సమీక్ష: గద్దలకొండ గణేష్ (వాల్మీకి)
రేటింగ్: 2.75/5
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
తారాగణం: వరుణ్ తేజ్, అధర్వా, పూజ హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజీ, సత్య, సుప్రియా పాఠక్ తదితరులు
కథ: కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం: మిక్కీ జె మేయర్
కూర్పు: చోటా కె ప్రసాద్
ఛాయాగ్రహణం: అయనాంకా బోస్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
మాటలు, మార్పులు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.
విడుదల తేదీ: సెప్టెంబర్ 20, 2019
'దబాంగ్'ని తెలుగులో రీమేక్ చేస్తున్నారన్నపుడు పవన్‌కళ్యాణ్ ఫాన్స్ కూడా 'ఇప్పుడెందుకొచ్చిన రీమేక్ ఇది' అనుకున్నారు. అయితే ఒక సాధారణ కథని తీసుకుని పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌కి అనుగుణంగా 'మార్పులు' చేసి పదకొండేళ్ల పాటు అభిమానులు ఎదురుచూసిన బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చాడు హరీష్ శంకర్. కథ చెప్పడం తెలిస్తే, కమర్షియల్ మీటర్ మీద పట్టుంటే తెలిసిన కథనే ఎంత ఎఫెక్టివ్‌గా చెప్పవచ్చు అనే దానికి అదో చక్కని ఉదాహరణ. ఈసారి 'జిగర్తాండ' అనే క్లాసిక్ క్రైమ్ కామెడీని 'వాల్మీకి'గా రీమేక్ చేసాడు. ఇప్పుడు కూడా దర్శకుడిగా తనకి కమర్షియల్ అంశాల మీద వున్న గ్రిప్ చూపించినా కానీ ఈసారి హరీష్ శంకర్ ఎంచుకున్న కథ 'దబాంగ్' లాంటి సాధారణ కథ కాదు. 'జిగర్తాండ' ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ క్రైమ్ కామెడీ. ఆ కథలో విలన్‌గా హీరో ఇమేజ్ వున్న వరుణ్ తేజ్‌ని తీసుకోవడంతో హరీష్ శంకర్ చాలానే 'మార్పులు' చేసాడు. ఈ 'మార్పులు' అన్నీ 'మార్కులు' వేయించుకోవు కానీ 'మాసెస్' కనక్ట్ అయ్యే అంశాలకి అయితే లోటు లేదు.
మిగతా విషయాల మాట ఎలా వున్నా కానీ ఈ పాత్ర చేయాలి, చేయగలను అంటూ బాగా నమ్మాడు వరుణ్ తేజ్. ఎప్పుడూ హీరో వేషాలే వేస్తూ వుంటే దాంట్లో ఛాలెంజ్ ఏముంటుంది? తనని ఇంతవరకు జనం చూసిన దానికి భిన్నంగా కనిపించడానికి వరుణ్ సాహసించాడు. వేటగాడు వాల్మీకి అయినట్టుగా ఈ వాల్మీకి కోసం హీరో విలన్ అయ్యాడు. అయితే వరుణ్ చేసిన పాత్రని విలన్ అనలేం. అతనికీ ఒక ఫ్లాష్‌బ్యాక్ ఇచ్చి, అతను వయొలెంట్‌గా మారడానికో కారణం చూపించారు. ఈ చిత్రంలో అధర్వ పాత్ర ఎలాగయితే 'నా విలనే నా హీరో' అంటాడో హరీష్ కూడా తన హీరోని విలన్‌లా చూపించాడంతే. బాబీ సింహా లాంటి ఎలాంటి ఇమేజ్ లేని నటుడు చేసిన పాత్రని వరుణ్ తేజ్ లాంటి సక్సెస్‌ఫుల్ హీరోతో చేసినపుడు కథలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. గద్దలకొండ గణేష్‌గా వరుణ్‌ని అతి భయానకంగా, బీభత్సంగా చూపించడానికి హరీష్ చాలానే సీన్లు రాసుకున్నాడు. దీని వల్ల ఆ పాత్ర పరిచయం అయిన తర్వాత చాలా సన్నివేశాలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతోన్న భావన కలుగుతుంది.
మాస్ కామెడీ పేరిట హరీష్ శంకర్ పలుమార్లు గీత దాటిన సందర్భాలున్నాయి కానీ అవి సగటు మాస్ మసాలా ప్రియులకి అభ్యంతరం అనిపించకపోవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో వరుణ్ క్యారెక్టరైజేషన్, అతని పర్‌ఫార్మెన్స్ మినహా ఆట్టుకునే అంశాలు లేవు. అధర్వకీ, మృణాళినికి మధ్య సన్నివేశాలు కానీ, గణేష్ గురించి ఆరా తీయడానికి అతని సహచరులకి అభి (అధర్వ) దగ్గరయ్యే సన్నివేశాలు కానీ సోసోగానే అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు సన్నివేశాలు మాత్రం గణేష్ పాత్ర తెలివితేటలని, అలాగే అతని భయంకరమైన నైజాన్ని, జాలి లేని గుణాన్ని హైలైట్ చేస్తాయి. అలాగే అభి పాత్రకి ఎదురయ్యే పరిస్థితుల గురించిన ఉత్కంఠని కలిగిస్తూ ఇంటర్వెల్ పాయింట్ ఒక సగటు కమర్షియల్ చిత్రానికి తగ్గట్టుగా కుదిరింది.
ఇక ద్వితియార్థంలో హరీష్‌లోని మాస్ దర్శకుడు డ్రైవింగ్ సీట్‌లోకి వచ్చాడు. గద్దలకొండ గణేష్ అంత కర్కశంగా మారడానికి ముందు అతనిలోని సున్నితత్వం చూపిస్తూ ఒక చిన్న లవ్ స్టోరీ చూపిస్తాడు. సిగరెట్ ప్యాకెట్ రూపాయి డెబ్బయ్ అయిదు పైసలున్న రోజుల్లో… శ్రీదేవిని బ్యూటీ క్వీన్‌గా పాలాభిషేకాలు చేస్తూ తెలుగు యువత ఆరాధిస్తోన్న కాలంలో గణేష్‌కి కూడా ఒక శ్రీదేవి (పూజ హెగ్డే) తారసపడుతుంది. ఆమెతో ప్రేమలో పడిన గణేష్ తనలోనే శ్రీదేవిని చూసుకుంటూ శ్రీదేవి పాటనే రీమిక్స్ చేసుకుంటాడు.
ఈ ఫ్లాష్‌బ్యాక్ ఘట్టం అంతా అప్పటికే మొహం మొత్తిన హింసాత్మక సన్నివేశాల మధ్య హాయిగా అనిపిస్తుంది. ఈ పార్ట్‌ని చాలా బాగా డీల్ చేసిన హరీష్ శంకర్ జిగర్తాండకి తాను రాసిన స్క్రీన్‌ప్లే మాస్‌కి మరింత చేరువయ్యేలా చేసుకున్నాడు. అయితే ఆ తర్వాతే చిక్కొచ్చి పడింది. బాబీ సింహా లాంటోడు 'నా కథలో నేనే హీరోగా నటిస్తా' అంటే సమస్య వస్తుంది కానీ వరుణ్ తేజ్ లాంటి హీరో పర్సనాలిటీ వున్నోడు హీరోగా నటిస్తానంటే పెద్దగా అభ్యంతర పెట్టడానికి ఏముంటుంది. ఈ భాగంలోనే 'వాల్మీకి' తడబడుతుంది. సదరు యాక్టింగ్ కోచింగ్‌కి సంబంధించిన సన్నివేశాలు, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్‌తో చేసిన కామెడీ ఆశించిన విధంగా పండలేదు.
అయితే పతాక సన్నివేశాలు పండడానికి, గద్దలకొండ గణేష్‌లో కూడా వాల్మీకిలో వచ్చిన మార్పు రావడానికి అనుగుణంగా ముందునుంచీ హరీష్ శంకర్ మదర్ క్యారెక్టర్‌ని ప్యారలల్‌గా పెడుతూ వచ్చాడు. అది పతాక సన్నివేశంలో చక్కని కమర్షియల్ మైలేజ్‌కి పనికొచ్చింది. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల తర్వాత పడిపోయిన గ్రాఫ్ పతాక సన్నివేశాలకి తిరిగి పైకి లేచి ఫైనల్‌గా శాటిస్‌ఫాక్టరీ ఫీల్ ఇచ్చి పంపుతుంది. జిగర్తాండ కథని ఇలా చెప్పడం కరెక్టా అంటే దానికి చాలా విధాల వాదనలు వినిపించవచ్చు కానీ వరుణ్‌ని సరికొత్తగా చూపించడానికి మాత్రం ఈ కథ బాగా పనికొచ్చింది. అలాగే దాంట్లో, ముఖ్యంగా ద్వితియార్థంలో తగినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకునే విధంగా మలచుకుకున్న విధానం కూడా మార్కులేయించుకుంటుంది.
అభినయ పరంగా ఇక మరెవరి ప్రస్తావన కూడా అక్కర్లేకుండా వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసాడు. ఇంతకుముందు తనని చూసిన వారికి ఆ పాత్రలేవీ గుర్తు రానంతగా ఈ పాత్రలోకి ఒదిగిపోయాడు. నటుడిగా ఒకేసారి నాలుగు మెట్లు ఎక్కేసాడు. పూజ హెగ్డే కనిపించేది కాసేపే అయినా కానీ తన గ్లామర్‌తో శ్రీదేవి అంత ఎఫెక్టివ్‌గా అనిపించింది. అధర్వ సింగిల్ ఎక్స్‌ప్రెషన్ మెయింటైన్ చేస్తూ ఏదో ఛల్తా అనిపించాడు కానీ తెలుగు వారికి తెలిసిన నటుడయితే బాగుండేది. తనికెళ్ల భరణికీ, సుప్రియా పాఠక్‌కి ఎమోషనల్‌గా కనక్ట్ చేసే మంచి సీన్లు ఇవ్వగా వారిద్దరూ ఆ సన్నివేశాలకి జీవం పోసారు.
వరుణ్ తేజ్‌కి ఇది ఎలాగయితే మేక్ ఓవరో అలాగే సంగీత దర్శకుడు మిక్కీ మేయర్‌కి కూడా ఇది టెర్రిఫిక్ మేకోవర్. మాస్ చిత్రానికి ఇంతవరకు మనకి తెలియని మిక్కీని వినిపించాడు. వాక్కా వాక్కా థీమ్ మ్యూజిక్‌తో అయితే గద్దలకొండ గణేష్ పాత్రని మరో లెవల్‌కి ఎలివేట్ చేసాడు. డైలాగ్స్, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు ఎస్సెట్స్ అయ్యాయి.
వరుణ్ తేజ్ అద్భుతమైన అభినయం, కమర్షియల్ మీటర్‌లో సాగే ద్వితియార్థం, రెండు పసందైన మాస్ పాటలతో పాటు అలరించే నేపథ్య సంగీతం, కాలక్షేపానికి లోటు లేని వినోదం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. పైన సమీక్షలో చెప్పుకున్న మైనస్‌లు లేకపోలేదు కానీ మాస్ మసాలా డోస్ తగినంత పడింది కనుక 'వాల్మీకి' కమర్షియల్‌గా ఈజీగా పాస్ అయిపోతుంది.
బాటమ్ లైన్: గత్తర లేపిండు!
-గణేష్ రావూరి