cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పహిల్వాన్‌

సినిమా రివ్యూ: పహిల్వాన్‌

సమీక్ష: పహిల్వాన్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఆర్‌.ఆర్‌.ఆర్‌. మోషన్‌ పిక్చర్స్‌, వారాహి చలనచిత్రం
తారాగణం: సుదీప్‌, ఆకాంక్ష సింగ్‌, సునీల్‌ శెట్టి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, అవినాష్‌, సుషాంత్‌ సింగ్‌, శరత్‌ లోహితాశ్వ, అప్పన్న తదితరులు
సంగీతం: అర్జున్‌ జన్య
కూర్పు: రూబెన్‌
ఛాయాగ్రహణం: కరుణాకర ఏ.
నిర్మాత: స్వప్న కృష్ణ
రచన, దర్శకత్వం: ఎస్‌. కృష్ణ
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 12, 2019

బాహుబలితో రీజనల్‌ సినిమాకి పాన్‌ ఇండియా మార్కెట్‌ ఏర్పడడంతో, 'కెజిఎఫ్‌' తర్వాత కన్నడ చిత్ర రంగం నుంచి పలు భాషల్లోకి అనువాదమై విడుదలయింది 'పహిల్వాన్‌'. సుదీప్‌ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా మార్కెట్‌ని టార్గెట్‌ చేసిందంటే ఏదైనా యూనివర్సల్‌ పాయింట్‌ వుందేమోనని భ్రమ పడతారు. ఇది సుదీప్‌కి కర్నాటకలో వున్న మాస్‌ ఫాలోయింగ్‌కి అనుగుణంగా రూపొందిన సగటు మాస్‌ చిత్రమే తప్ప దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు చూడ్డానికేమీ లేదు. పాన్‌ ఇండియా మార్కెట్‌ అంటే బాలీవుడ్‌ నటులైన సునీల్‌ శెట్టి, సుషాంత్‌ సింగ్‌లాంటి వాళ్లని పెట్టేస్తే వచ్చేయదు.

హీరో చేసే ప్రతి చర్యని అల్ట్రా స్లో మోషన్‌లో చూపించడం, దుమ్ము రేగడం దగ్గర్నుంచి, చెట్లు కదలడం వరకు అన్నిటినీ స్లో మోషన్‌లో క్యాప్చర్‌ చేయడం 'పహిల్వాన్‌' రన్‌టైమ్‌ని కనీసం అరగంట పెంచి వుంటుంది. ఆ స్లో మోషన్‌ షాట్స్‌ అన్నిటినీ రెగ్యులర్‌ స్పీడ్‌లో చూపిస్తే కనీసం ప్రేక్షకులకి ఒక అరగంట ముందే విముక్తి లభించేది. పహిల్వాన్‌ అంటూ కుస్తీ నేపథ్యంలో కథ మొదలయ్యే సరికి రెజ్లింగ్‌ క్రీడపై అవగాహన పెంచే విధంగా ఏదైనా రియలిస్టిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా తీసి వుంటారేమో, అందుకే దేశ వ్యాప్తంగా పలు భాషలలో విడుదల చేసారనే భావన కలుగుతుంది. అయితే ఒక పది నిమిషాలకే ఇదో సగటు ఆల్‌ మిక్స్‌ కిచిడీ అనేది క్లియర్‌ అయిపోతుంది.

హీరో పరిచయ సన్నివేశంలో కుస్తీ క్రీడ మరీ కమర్షియల్‌గా కనిపించినా అది సుదీప్‌ ఫాన్స్‌ కోసమని సరిపెట్టుకోవచ్చు. కానీ వన్స్‌ హీరోయిన్‌ (ఆకాంక్ష) ట్రాక్‌ స్టార్ట్‌ అయ్యాక కుస్తీ బ్యాక్‌డ్రాప్‌ అనేది మాస్‌ పులిహూరకి వేసిన తాలింపు మాత్రమే అని గ్రహించవచ్చు. హీరోయిన్‌తో పాటుగా విలన్‌గా రాజు (సుషాంత్‌ సింగ్‌) పరిచయ సన్నివేశాలు, అతను కుస్తీ వీరుడని చెప్పడం ఇంకా పెద్ద జోకు. సుదీప్‌కి సమ వయస్కుడిలా వున్న సునీల్‌ శెట్టి అతనికి కోచ్‌ కమ్‌ పెంపుడు తండ్రిగా అస్సలు సూట్‌ కాలేదు. పైగా కనీసం వయసు పరంగా పెద్దవాడిని అనిపించేందుకు సునీల్‌ శెట్టి కాస్త నటించడానికి కూడా ప్రయత్నించలేదు. ఈ పులిహూరలో సెపరేట్‌గా కామెడీ వుండాలని అప్నన్నతో చేయించిన హాస్యం నవ్వించడం మాటేమో కానీ నరకం స్పెల్లింగ్‌ రాయించారు.

కోచ్‌ కోరికని మన్నించకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కుస్తీ వీరుడిని ఇక జీవితంలో కుస్తీ చేయరాదని, దూరంగా పొమ్మని పంపేస్తే సగటు రజనీకాంత్‌ సినిమా కథ మాదిరిగా ఇక అతను బళ్లు తోయడం, రాళ్లు కొట్టడం లాంటి పనులు చేస్తూ కుస్తీకి దూరమైపోతాడు. ఇతడిని వెతుక్కుంటూ వచ్చిన బాక్సింగ్‌ కోచ్‌ రెజ్లింగ్‌ నుంచి హీరోని బాక్సింగ్‌ వైపు తీసుకెళతాడు. అంతవరకు ఒక క్రీడలో తర్ఫీదు పొందిన వాడు మరో క్రీడకి మళ్లిపోవడం సినిమాల్లోనే సాధ్యమని సరిపెట్టుకోవాలి. అప్పటివరకు కుస్తీ టెక్నిక్కులు నేర్పిన మొదటి కోచ్‌ బాక్సింగ్‌ కిటుకులు కూడా నేర్పించేయడం ఇంకా వెరైటీ. ఎలాగో హీరోనే గెలుస్తాడని తెలిసిన మ్యాచ్‌ని రక్తపాతంతో నింపేసి, మరో పావుగంట పాటు ప్రేక్షకుల సెన్సెస్‌పై పిడిగుద్దులు కురిపిస్తాడు 'పహిల్వాన్‌'. బాక్సింగ్‌ చేయడానికి కారణంగా అనాధ పిల్లల అగచాట్లు చూపించడం, వారికోసం హీరో ఈ మ్యాచ్‌ ఆడాడనడం నాకౌట్‌ పంచ్‌.

మసాలా సినిమా అంటే ఏదీ వదిలిపెట్టకుండా అన్నీ 'దంచి' కొట్టాలనే దర్శకుడి తాపత్రయం అర్థం చేసుకోవచ్చు కానీ దీనికి యూనివర్సల్‌ అప్పీల్‌ వుందనే భ్రమతో ఇన్ని భాషలలో విడుదల చేయడమే మరీ అతి. మామూలుగా డీసెంట్‌ యాక్టర్‌ అయిన సుదీప్‌ కూడా పలుమార్లు క్లూలెస్‌గా కనిపిస్తాడంటే అందుకు దర్శకుడినే నిందించాలి. హీరో ఎలివేషన్లతో కెజిఎఫ్‌కి ఆదరణ దక్కినపుడు దీనికి మాత్రం ఎందుకు లభించదనే ఫీలింగ్‌తో హీరోయిజమ్‌ చూపించడమే పరమావధి అన్నట్టుగా పేట్రేగిపోయాడు. సపోర్టింగ్‌ కాస్ట్‌లోని అందరూ ఓవరాక్షన్‌తో సహనానికి అగ్ని పరీక్ష పెట్టారు.

నిర్మాణ విలువలు బాగున్నాయి. చిత్రీకరణ పరంగా క్వాలిటీ మెయింటైన్‌ చేసారు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రంలో అన్ని పాటల అవసరమేంటో దర్శకుడికే తెలియాలి. కనీసం అనువాద వెర్షన్లలో అయినా వాటిని తగ్గించాల్సింది. దర్శకుడు కృష్ణ తీసిన ఒక సాధారణ మాస్‌ చిత్రాన్ని కన్నడకి మాత్రమే పరిమితం చేయాల్సింది. సుదీప్‌ ఫాన్స్‌ కోసం మాత్రమే తీసినట్టున్న ఈ చిత్రం మిగిలిన భాషల ప్రేక్షకులని మాత్రం మూడు గంటల పాటు నస పెడుతుంది.

తెలుగు హీరోలు చేస్తోంటేనే చూడలేకపోతున్న ఈ మసాలా చిత్రాలని పొరుగు హీరోలతో చేయిస్తే ఎలా చూడగలరు? ఒరిజినల్‌లో పహిల్వాన్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చినా కానీ తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రం తిరస్కారం తప్పదు.
బాటమ్‌ లైన్‌: పులియోగరే!
-గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: సాహో     సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి

 


×