సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి

సమీక్ష: కౌసల్య కృష్ణమూర్తి రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ తారాగణం: ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌, సి.వి.ఎల్‌ తదితరులు కథ: అరుణ్‌ రాజా కామరాజ్‌ సంగీతం:…

సమీక్ష: కౌసల్య కృష్ణమూర్తి
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌
తారాగణం: ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌, సి.వి.ఎల్‌ తదితరులు
కథ: అరుణ్‌ రాజా కామరాజ్‌
సంగీతం: ధిబు నినన్‌ థామస్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ
నిర్మాత: కె.ఏ. వల్లభ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
విడుదల తేదీ: ఆగస్ట్‌ 23, 2019

స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ డ్రామాలు ఇటీవల ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. జెర్సీ, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌ స్పోర్ట్స్‌ని ఒక్కో కోణంలో చూపిస్తే… 'కౌసల్య కృష్ణమూర్తి' సగటు స్పోర్ట్స్‌ డ్రామా టెంప్లేట్‌ని రెలీజియస్‌గా ఫాలో అయిపోయింది. క్రికెట్‌ పురుషుల ఆట అని భావించే రోజుల్లో ఒక యువతి తన చిన్ననాటి కలని సాకారం చేసుకుని తండ్రి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఏమి చేసింది అనేది ఒక్క లైన్‌లో కౌసల్య కృష్ణమూర్తి స్టోరీ.

తనతో పాటు కనీసం మరో పది మందికి కూడా అదే ఆసక్తి వుంటే తప్ప ఆడలేని ఆటని ఒంటరిగా ఆడాలంటే కౌసల్య ఏమి చేయాలి? ఆడేందుకు అమ్మాయిలు దొరకక అబ్బాయిలతోనే కలిసి గేమ్‌ ఆడుతుంది. ఏకలవ్యలా క్రికెట్‌ని 'చూసి' అధ్యయనం చేస్తూ స్పిన్‌ బౌలర్‌గా అవతరిస్తుంది. అబ్బాయిలని తికమక పెట్టే కౌసల్య గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి, ఆపై జాతీయ స్థాయికి ఎదిగి మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో ఎలా చోటు దక్కించుకుంటుంది?

ఈ ప్రస్థానం అంతా ఆసక్తికరంగా చెప్పే వీలుంది కానీ తమిళ దర్శకుడు అతి సాధారణ సన్నివేశాలతో అత్యంత సాదాసీదాగా నడిపించేయగా, రీమేక్‌ కథలకి చిన్న మార్పు చేయడానికి కూడా మనసు రాని భీమనేని శ్రీనివాసరావు అదే స్క్రీన్‌ప్లే ఫాలో అయిపోయాడు. కేవలం సన్నివేశాలని యథాతథంగా తీసేయడమే కాకుండా… తమిళ చిత్రంలోని సన్నివేశాలనే కత్తిరించి తెచ్చి అనువదించేసాడు! 'క్రియేటివ్‌ కమర్షియల్స్‌' లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌ నుంచి ఇలాంటి 'కట్‌ అండ్‌ పేస్ట్‌' వ్యవహారం దేనికో అంతు చిక్కదు.

తమిళ వారికి బాగా తెలిసిన శివకార్తికేయన్‌ చేసిన భాగాన్ని అనువదించి పెట్టేసినపుడు… తెలుగు వాళ్లకి అంతకంటే బాగా తెలిసిన సత్యరాజ్‌ పార్ట్‌ని కూడా అలాగే వుంచేసి తమిళ చిత్రాన్నే అనువదించేస్తే సరిపోయేదిగా? రీమేక్‌ చేసుకునేంత డ్రామా అయితే ఇందులో ఖచ్చితంగా లేదు. అందుకేనేమో స్పోర్ట్స్‌ డ్రామాకి సపోర్ట్‌గా రైతుల కష్టాలని కూడా జోడించి నడిపించారు. రైతుల కష్టాలు, కన్నీళ్లని ఇటీవల చాలా చిత్రాలకి కమర్షియల్‌ మైలేజీ కోసం వాడేస్తున్నారు. ఖైదీ నంబర్‌ 150, మహర్షిలాంటివి లేకపోతే కౌసల్య కృష్ణమూర్తికి కనీసం ఆ పాయింట్‌ అయినా కాస్త హెల్ప్‌ అయ్యేదేమో.

కౌసల్య (ఐశ్వర్యారాజేష్‌) క్రికెటింగ్‌ జర్నీ నాలుగైదు సార్లు చూసేసిన క్రికెట్‌ మ్యాచ్‌ అంత ఆసక్తికరంగా సాగుతోంటే, కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్‌) వ్యవసాయం వెతలు పొద్దున్నుంచీ సాయంత్రం వరకు చూపించే బ్రేకింగ్‌ న్యూస్‌ అంత సందడిగా అనిపిస్తాయి. ఎన్నోసార్లు చూసిన కథనే అయినా కానీ ఎంతో కొంత కొత్తగా చెప్పే వీలుంటుంది కానీ ఈ క్రికెట్‌ స్టోరీ మాత్రం ఎక్కడైనా కొత్తదనం కనిపిస్తే 'ఔట్‌' ఇచ్చేస్తారనేంత భయంభయంగా రొటీన్‌ దారిని విడిచి పెట్టడానికి వణికిపోయింది. నెక్స్‌ట్‌ ఏమి జరుగుతుందనేది కనీసపు క్రియేటివిటీ లేదా ఊహాశక్తి లేని వారు కూడా ఈజీగా గెస్‌ కొట్టేసి 'డైరెక్టర్‌'లా ఫీల్‌ అయ్యేట్టు చేసే స్క్రీన్‌ప్లేకి అంత సేపు సాగతీత దేనికనేది దర్శకుడికే తెలియాలి. శుభం కార్డు వేసేయడానికి ఆస్కారమున్నంత సేపు కూర్చోబెట్టాక కౌసల్య అసలు క్రికెట్‌ మొదలవుతుంది.

చక్‌ దే ఇండియాలో షారుక్‌ ఖాన్‌ మాదిరిగా ఒక చేదుగతం వున్న కోచ్‌ (శివకార్తికేయన్‌) రంగంలోకి దిగగా, ఇతనికి మాత్రమే చక్‌దే స్ఫూర్తి వుండాలా… మనం కూడా అందులో ఆడ హాకీ ప్లేయర్లలానే ప్రవర్తిద్దాం అన్నట్టుగా నేషనల్‌ టీమ్‌లోని అమ్మాయిలు కూడా అదే హిందీ సినిమాని తలపిస్తారు. ఇక కౌసల్య బౌలింగ్‌ చేసేసి ఇండియాని గెలిపించేస్తే మనం పెవిలియన్‌ చేరిపోవచ్చునని ఆడియన్స్‌ వెయిట్‌ చేస్తుంటే… ఇప్పుడప్పుడే ఇంటికి పంపించే ఉద్దేశం లేదంటూ మరి కాసేపు సాగదీయడమే కాకుండా… ప్రధాన పాత్రధారులందరి చేతిలో గ్లిజరిన్‌ బాటిల్స్‌ పెట్టేసి ఏడిపించడంలో ఎవరు గెలుస్తారో చూద్దామనే సవాల్‌ విసురుతారు. ఇండియాని గెలిపించిన తర్వాత కౌసల్య ఇచ్చే స్పీచ్‌ నిజంగానే కదిలిస్తుంది కానీ అప్పటికే ప్రేక్షకుల ఓపికని హరించేస్తారు.

కౌసల్య – కృష్ణమూర్తిగా ఐశ్వర్య, రాజేంద్రప్రసాద్‌ ఇద్దరూ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచారు. వారి అభినయనే ఈ చిత్రానికి ఆలంబనగా నిలిచింది. శివకార్తికేయన్‌ పాత్ర మరీ పాత సినిమాలని తలపించేది కావడం వలన అతని అభినయం కూడా ఎఫెక్టివ్‌ అనిపించుకోలేకపోయింది. తెరవెనుక కూడా ఎవరినుంచీ అబ్బురపరిచే పనితనం లేకపోవడంతో ఈ చిత్రం అదనపు హంగులతోను మెప్పించలేకపోయింది. స్పోర్ట్స్‌ డ్రామా తీయాలంటే జెర్సీ అంతగా కదిలించే భావోద్వేగాలు అయినా వుండాలి లేదా మజిలీ మాదిరిగా మెజారిటీని ఆకట్టుకునే కమర్షియల్‌ హంగులు అయినా తోడవ్వాలి. అంతే తప్ప రొటీన్‌ స్పోర్ట్స్‌ డ్రామాపై కావాల్సినంత గ్లిజరిన్‌ చిలకరించేస్తే ప్రేక్షకులు చలించిపోరు. రైతుల కష్టాలని చూపించిన ప్రతిసారీ ట్రోఫీ కట్టబెట్టేయరు.
బాటమ్‌ లైన్‌: నో-బాల్‌!
– గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: రణరంగం     సినిమా రివ్యూ: ఎవరు