సమీక్ష: గ్యాంగ్ లీడర్
రేటింగ్: 2.5/5
బ్యానర్: మైత్రి మూవి మేకర్స్
తారాగణం: నాని, ప్రియాంక అరుల్ మోహన్, కార్తికేయ, లక్ష్మి, శరణ్య, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, జైజ, ప్రణ్య, సత్య, అనీష్ కురువిల్లా తదితరులు
మాటలు: వెంకట్ డి. పాటి
సాహిత్యం: అనంత శ్రీరామ్
కళ: రాజీవన్
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: అనిరుధ్
ఛాయాగ్రహణం: మిరోస్లా కూబా బ్రోజెక్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై, మోహన్ చెరుకూరి (సివిఎం)
రచన, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్
విడుదల తేదీ: సెప్టెంబర్ 13, 2019
రెగ్యులర్ సినిమాలు తీసేసే దర్శకులపై పెద్దగా అంచనాలేం వుండవు కానీ రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తూ, గ్యాంగ్‌లోంచి సెపరేట్ అయి డిఫరెంట్‌గా కనిపించే దర్శకులనుంచి మాత్రం ప్రేక్షకులకి కాస్త ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్సే వుంటాయి. మనం, 24, ఇష్క్ లాంటి చిత్రాలు అందించిన విక్రమ్ కుమార్ ఈసారి నానితో కలిసి సినిమా చేస్తే వీరినుంచి తప్పకుండా కొత్తరకం వినోదం ఖాయమనే భావన కలిగింది. గ్యాంగ్‌లీడర్ ట్రెయిలర్స్ చూసినా అది నిజమే అనిపించింది. అయితే ట్రెయిలర్‌లో చూపించిన కాంటెంట్ మినహా ఇందులో ఇంకేం స్టఫ్ లేకపోవడమే ఆశ్చర్యపరిచింది. ముందే చెప్పినట్టు మందిలోని ఒకడయితే ఓకే అనుకోవచ్చు కానీ వందలో ఒక్కడు అనిపించుకున్న దర్శకుడి నుంచి ఆశించే ప్రోడక్ట్ ఖచ్చితంగా కాదిది.
చిన్న పాప దగ్గర్నుంచి డెబ్బయ్ ఏళ్ల బామ్మ వరకు… అయిదు ఏజ్ గ్రూప్స్‌లో వున్న ఆడవాళ్లు తమకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ అజ్ఞాత శత్రువుని వెతుకుతూ బయల్దేరతారు. హాలీవుడ్ రివెంజ్ కథలని కాపీ కొట్టి డైలాగ్ టు డైలాగ్ ట్రూ ట్రాన్‌స్లేట్ చేసే నవలా రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. రివెంజ్ అనే సీరియస్ థీమ్ వున్నా కానీ ఆ ప్రతీకారం తీసుకునే పాత్రలు సీరియస్‌గా కనిపించకపోవడంతో వినోదాత్మకమైన సెటప్ కుదిరింది. అలాగే సదరు అజ్ఞాత విలన్ ఎవరా అనే అన్వేషణ కూడా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే ఒక్కసారి ప్రతినాయకుడు అజ్ఞాతంలోంచి బయటకి వచ్చాక, అతనెవరనేది తెలిసాక ఒక్కసారిగా వినోదం పాళ్లు తగ్గడమే కాకుండా, అంతవరకు వున్న థ్రిల్ కూడా మిస్ అవుతుంది.
మామూలుగా తెలివైన కథనంతో సగటు కథలనే కొత్తగా చెప్పే విక్రమ్ కుమార్ ఈసారి ఆసక్తికరమైన సెటప్ పెట్టుకుని కూడా పాత్ర చిత్రణ పరంగా పలు పొరపాట్లు చేసుకుంటూ పోయాడు. నాని పాత్రని అసలు 'క్రియేటివిటీ' లేని రచయితగా పరిచయం చేసి, విలన్‌ని ఎలా కనిపెట్టాలనే క్లూ కూడా లేని వాడిగా చూపించి, సడన్‌గా అతడిని చాలా ఇంటిలిజెంట్‌గా మార్చేస్తారు. అసలు మూడు వందల కోట్లు అపహరించి, ఆరు హత్యలు చేసిన వాడిని పోలీసులు కూడా ట్రేస్ చేయలేకపోతే కేవలం రెండే రెండు ట్రిక్కులతో విలన్ ఎవరనేది కనిపెట్టేస్తాడు. దాంతో ఆరంభంలో చూపించినదంతా కామెడీ కోసమే అనుకోవాలి. కథలో బలహీనతలని కూడా కప్పిపుచ్చే నేచురల్ టాలెంట్ నానికి వుంది కనుక ప్రీ ఇంటర్వెల్ వరకు గ్యాంగ్ లీడర్ సాఫీగా సాగిపోయింది. అయితే ఒక్కసారి విలన్‌కి 'ముసుగు' తీసాక, అతని మోటివ్ చెప్పాక, అతని ప్రెజెంట్ స్టేటస్ చూపించాక అంతకుముందు వరకు సదరు విలన్‌పై వున్న 'అన్‌రీచబుల్' ఫీల్ పోతుంది.
అయిదుగురు ఆడవాళ్లు, ఒక సామాన్య రచయిత సాయంతో అంత ధనవంతుడు, స్టేటస్ వున్న వ్యక్తిపై పగ తీర్చుకోవడమనేది చాలా క్లిష్టమైన విషయం. అంత ఈజీగా విలన్‌ని వీరు రీచ్ అవడం కానీ, అతడిలో అలజడి కలిగించడం కానీ సాధ్యపడదు. వీరికున్న బలహీనతని అలాగే వుండనిచ్చి, విలన్‌ని ఇంకా భయానకంగా చూపిస్తే వీరికి ఏమవుతుందోననే ఆందోళనకి, ఉత్కంఠకీ అవకాశముంటుంది. కానీ వీళ్లకి 'అందుబాటు'లోకి విలన్‌ని తీసుకొచ్చేసి, 'పిల్లర్‌లో డబ్బు' పేరిట అతని జుట్టుని వీరి చేతిలో పెట్టేయడంతో విలన్ పట్ల వుండాల్సిన ఆ 'భయం' కరిగిపోతుంది. కనీసం వారి ఆచూకీ తెలుసుకున్న తర్వాత అయినా ప్రతినాయకుడు క్రూరంగా మారి వీరి ప్రతీకారానికి ప్రతిబంధకాలు సృష్టించగలిగితే థ్రిల్లింగ్ క్లయిమాక్స్‌కి వీలుండేది. తన చుట్టూ వున్న వారిని, సొంత మనుషులని క్షణాల్లో కనికరం లేకుండా చంపేసే కర్కశత్వం తనలో వున్నా కానీ తన ఉనికికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన వారిపై మాత్రం ప్రతాపం చూపించనే చూపించడు. చివరకు అతను వుండడం తమకి ప్రమాదమని హీరోనే తనంతట తానుగా అతడిని అప్రోచ్ అయి అకౌంట్ సెటిల్ చేయాల్సి వస్తుంది.
ఫస్ట్ హాఫ్ కామెడీగా సాగినా కానీ, సెకండ్ హాఫ్‌లో థ్రిల్‌కి చాలా స్కోప్ వున్న సబ్జెక్ట్ ఇది. కానీ లైటర్ వీన్‌లో వుంచేయడం కోసం కనీసం ట్విస్టులు, ఇంటిలిజెంట్ సీన్స్ జోలికి కూడా పోలేదు. గ్యాంగ్ అంతా కలిసే వుండడంతో అటు రొమాన్స్‌కీ స్పేస్ లేదు, సాంగ్స్‌ని కూడా హీరో వేసే పథకాల్లో భాగం చెయ్యక తప్పలేదు. ఇక తప్పదన్నట్టు క్లయిమాక్స్‌కి ముందు ఇచ్చిన ట్విస్ట్ కూడా చప్పగానే తేలిపోతుంది తప్ప ప్రయోజనం కనిపించదు. రివెంజర్స్, రివెంజ్ రైటర్ అంటూ కామెడీ పండించడానికి అవసరమైన సరంజామా సమకూరగానే ఇక మిగతా విషయాలపై ఫోకస్ అక్కర్లేదనే ధోరణి వల్ల ఈ 'గ్యాంగ్' అసంతృప్తిని కలిగిస్తారు. ఒక పాయింట్‌కి చేరే సరికి హాస్యం కోసం కూడా రిపీట్ సీన్లనే వాడుకున్నారు. ఫస్ట్ హాఫ్‌ని హాస్యంతో నింపి, అటుపై ఆసక్తిని హరించడంతో 'గ్యాంగ్‌లీడర్' సగటు హీరోగా మిగిలిపోయాడు.
నాని మరోసారి తన టాలెంట్ ఏమిటనేది పెన్సిల్ పార్థసారధిగా చూపించాడు. వేష, భాషలలో ఎక్కువ మార్పు చేర్పులు లేకుండా పాత్రకి అనుగుణంగా కనిపించడం అతని ప్రత్యేకత. జెర్సీలో కనిపించిన దానికీ, ఇందులోని పెన్సిల్‌కీ ఆహార్య పరంగా ఏమంత తేడా లేదు. అయినా కానీ ఆద్యంతం పెన్సిలే కనిపిస్తాడు తప్ప మరో సినిమాలోని నాని ఎక్కడా మన ముందుకి రాడు. ఇంత స్పెషల్ టాలెంట్ అందరికీ వుండేది కాదు. నాని సింగిల్ హ్యాండెడ్‌గా నడిపించిన ఈ చిత్రానికి కొన్ని సందర్భాలలో లక్ష్మీ, శరణ్య సాయపడ్డారు. కార్తికేయ విలన్‌గా విగ్రహంతో ఆకట్టుకున్నా కానీ అభినయ పరంగా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. హీరోయిన్ క్యారెక్టర్‌కి ప్రత్యేకమైన ఫుటేజీ లేదు. 'గుంపుతో' పాటుగానే కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గీత దాటకుండా ఒక 'ఆడ్' సీన్‌లో ఫన్ సృష్టించాడు.
అనిరుధ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు కూడా వినసొంపుగానే వున్నాయి. చిత్రీకరణ పరంగా వంక పెట్టడానికేమీ లేదు. విజువల్స్‌కి కావాల్సినవన్నీ బాగానే సమకూరాయి కానీ రచనా పరంగానే తగినంత శ్రద్ధ పెట్టకపోవడంతో 'గ్యాంగ్‌లీడర్' కేవలం కొన్ని నవ్వులకి మాత్రమే పరిమితమయ్యాడు. ఈ చిత్రాన్ని నిలబెట్టడానికి నాని తనవంతుగా ఎంత చేయాలో అంత కంటే కాస్త ఎక్కువే చేసినా కానీ ప్రతి చిత్రంలోను తనదైన శైలిలో ఆకట్టుకునే విక్రమ్ కుమార్ ఈసారి ఈ కథ చెప్పడంలో అలసత్వం చూపించాడు. కాసేపు నవ్వుకునే కాలక్షేపం చాలనుకునే వారికి మినహా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి మాత్రం ఈ చిత్రంతో నిరాశ తప్పదు.
బాటమ్ లైన్: అరిగిన 'పెన్సిల్'!
-గణేష్ రావూరి