కాంగ్రెస్ పార్టీలో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదూ అంటూ చెప్పేందుకు ఎలాంటి ప్రమాణాలూ లేవు. అయితే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఆ పార్టీలో ఎంతకాలం మనుగడ సాగించగలరు? అనేది మాత్రం ప్రశ్నార్థకమే. అవసరానికి మించి పూసుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి తీరుతో, చంద్రబాబుకు మీద అతి విధేయతతో ఆయన ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నారంటారు.
చంద్రబాబు నాయుడు తీరేమిటో తెలిసిందే అని కూడా పరిశీలకులు అంటారు. అవసరం ఉంటేనే ఎవరినైనా ఆయన పట్టించుకుంటారు. లేకపోతే సొంత సామాజికవర్గం ప్రముఖుడికి అయినా ఒకటే ట్రీట్ మెంట్ ఉంటుందని స్పష్టమవుతోందని అంటున్నారు విశ్లేషకులు. అలా చంద్రబాబుకు విధేయుడిగా ఇరుక్కుపోయిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ లో కొంచెం కలిసి వచ్చింది. ఎంపీ అయ్యారు. అయితే ఇప్పుడు తనకు సంబంధం లేని వ్యవహారంలో ఆయన తలదూరుస్తున్నారనే అభిప్రాయాలను కలిగిస్తూ ఉన్నారు.
హుజూర్ నగర్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో రేవంత్ ఏవైనా పైరవీలు చేయాలనుకుంటే ఇలా చేయాల్సింది కాదని, బహిరంగ ప్రకటనలు కాంగ్రెస్ లో చెల్లే రాజకీయాలు కావని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే పడనివారు చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్లు రేవంత్ కు మద్దతుగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు పెద్ద ఉదాహరణ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడలేదు.
హుజూర్ నగర్ తో రేవంత్ కు ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. అంతేగాక రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 'క్రమశిక్షణ సంఘం' నుంచి కూడా నోటీసులు రానున్నాయట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం నోటీసులు పంపాలంటూ రేవంత్ డిమాండ్ చేయగా, ఇప్పుడు అదే సంఘం నుంచి రేవంత్ కు నోటీసులు రాబోతున్నాయట. అదేమరి కాంగ్రెస్ రాజకీయం అంటే!