పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిలాంటిది కానీ చంద్రబాబుకూ, తన బినామీలకు మాత్రం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. పోలవరాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనకు, తన అనుచరుల అక్రమాలు, అవినీతికి అడ్డాగా మార్చుకున్నారని అంటోంది నిపుణుల కమిటీ. ఈ ప్రాజెక్టు విషయంలో ఇటీవల నిపుణుల కమిటీ నియమితం అయిన సంగతి తెలిసిందే. దాని అధ్యయనానికి సంబంధించి కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలి. అయితే టిడిపి వాళ్లు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం అందినకాడికి నొక్కేద్దాం అనే నిర్ణయానికి వచ్చినట్టుగా వ్యవహరించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించినట్లు పోలవరాన్ని ఏటీఎంగానే ఉపయోగించుకున్నారు. జాతీయ ప్రాజక్టులు అన్నింటినీ ఇప్పటివరకూ కేంద్రమే నిర్మిస్తూ వస్తోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టుకు డబ్బులు మీరివ్వండి నిర్మాణ బాధ్యతలు మేం చేపడతాం అని చెప్పలేదు.
కానీ ఆంధ్రప్రదేశ్లోని అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో పట్టుపట్టి మరీ సాధించుకుంది. చూసిన వాళ్లందరూ మన సీఎం ఎంతో కష్టపడి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు అని అనుకున్నారు. కానీ దానివెనుక తమవారికి లబ్ధిచేకూర్చాలని, అందినకాడికి దండుకోవాలనే ఆలోచన, గత అయిదేళ్లలో అవినీతి, అక్రమాలకు అడ్డాగా పోలవరం మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును టిడిపి ఎంపీగా ఎన్నికైన రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ దక్కించుకుంది. ఆ కంపెనీ పోలవరం పనులను నత్తనడకన చేపట్టడంతో చంద్రబాబు తన అననూయలకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు.
చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్ పనుల్లో 2,400 కోట్ల అక్రమ చెల్లింపులు, అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ తేల్చింది. మొత్తం చెల్లింపులల్లో అంత మొత్తం అక్రమాలు జరిగాయంటే అందులో ఎంత మొత్తం నాటి ప్రభుత్వంలోని పెద్దలకు, ముఖ్యులకు చేరిందనేది తదుపరి దర్యాప్తులోగానీ బయటపడే అవకాశం లేదు. ఈ ప్రాజెక్ట్ ను తమ స్వార్థ ప్రయోజనాలకోసమే ఉపయోగించుకున్నారని నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను పరిశీలిస్తే సామాన్యులకు సైతం అర్థం అవుతుంది.
కొత్త ప్రభుత్వం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలనే ఉద్ధేశ్యంతో రివర్స్ టెండరింగ్ కు వెళుతోంది. ఈ పద్ధతిలో ఎవరు అతి తక్కువ ధరకు ప్రాజెక్టు నిర్మిస్తామని ముందుకు వస్తే వారికే పనులను అప్పగిస్తారు. రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ విధానం విజయవంతమైతే తాముచేసిన తప్పులు, ముఖ్యంగా పోలవరం పేరుతో చేసిన దోపిడీ ఎక్కడ బయటకు వస్తుందోనన్న ఉద్ధేశంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్తూ టీడీపీ నేతలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు…
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తనడకన జరగడమే కాకుండా అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతోనే కొత్తం ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో అధ్యాయనం చేయించింది. ఆ కమిటీ ప్రధాని చేసిన ఆరోపణలను నిరూపించేవిధంగా నివేదిక సమర్పించింది. ప్రాజెక్ట్ పనులు ఓ వైపు నత్తనడకన నడుస్తూ రైతులకు ప్రయోజనాలు అందించడంలో ఆలస్యం అవ్వడమే కాకుండా అదే అదునుగా వ్యయాలను పెంచుకుంటూ, త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు అదనపు చెల్లింపులు అవసరం అంటూ ప్రభుత్వం అప్పట్లో ఇష్టానుసారం బిల్లులు చెల్లించింది.
అందుకు అడ్డం వచ్చిన నియమ నిబంధనలను క్యాబినెట్ తీర్మానాల పేరుతో తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రాజెక్ట్ లో ప్రధానమైన పనులను నేరుగా నామినేషన్ పద్ధతిలో అప్పగించింది. వేలకోట్ల రూపాయలు ఈ విధంగా నామినేషన్ పద్ధతిలో అప్పగించినా ఎవ్వరూ నోరుమెదపలేదు. తమ వారికి ప్రయోజనం చేకూరుతోందని ఎల్లో మీడియా పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు పలికింది. దేశంలో ఎక్కడాలేని విధంగా వేలకోట్ల రూపాయ పనులను ప్రధాన కాంట్రాక్టర్ నుంచి తప్పించి తమకు కావాల్సిన కాంట్రాక్టర్ కు అప్పగించడం నాటి తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమయ్యింది.
ప్యాకేజీలుగా విభజించి బినామీలకు…
పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు ముఖ్య బినామీలుగా పేరుపడ్డ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు) సన్నిహిత కంపెనీగా పేరుపడ్డ త్రివేణీ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ద్వారా కట్టబెట్టారు. ఈ కంపెనీ చంద్రబాబు బినామీ అని రాజకీయ, ఇన్ ఫ్రా కంపెనీ వర్గాల్లో ఆరోపణలున్నాయి. పోలవరం కుడి, ఎడమ కాలువ పనులను కూడా ప్యాకేజీలుగా విభజించి చంద్రబాబు తన అనుయాయులకు, పార్టీ నేతలకు కట్టబెట్టారనే తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగాచేసిన యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు వందల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఒకపక్క ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పే ఆర్ధిక మంత్రి తన వియ్యంకుడి కంపెనీ బిల్లులు వస్తే మాత్రం ఆఘమేఘూలపై క్లియర్ చేసేవారు.
పుట్టా సుధాకర్ యాదవ్ కు టీడీపీ ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ అయిదో ప్యాకేజ్లో రూ.142 కోట్ల పనులు, అలాగే 179 కోట్ల విలువ చేసే ఆరో ప్యాకేజీ పనులను టీడీపీ తూర్పు గోదావరి జిల్లా నేత సుధాకరరావుకు అప్పగించారు. ప్రస్తుత ఎంపీ సీఎం రమేష్ కు సంబంధించిన త్రివేణీ సంస్థకు అత్యధికంగా రూ.1,708 కోట్ల విలువైన హెడ్ వర్క్స్ మట్టి పనిని కట్టబెట్టారు. పోలవరం కుడి కాలువ ఆరు, ఏడు ప్యాకేజీల పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్ కంపెనీకి అప్పగించారు. ఈ పనుల విలువ 286 కోట్లు. సూర్య కన్ స్ట్రక్షన్స్ శ్రీనివాసరావుకు రూ. 103 కోట్ల పనులు అప్పగించారు.
పరీక్షించకుండానే బిల్లుల చెల్లింపులు…
పోలవరం ప్రాజెక్టులో ఆది నుంచి అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు ఇస్టానుసారం చేస్తున్నారని, మట్టి పనిని ఎం బుక్లో రికార్డ్ చేయలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సీఎం రమేష్ తెచ్చిన త్రివేణీ కంపెనీకి మట్టి పనులు అప్పగించటంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధచూపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. ఎస్ఈ స్థాయి అధికారిని కాంట్రాక్టు సంస్థ నిర్వహించే మెస్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ మొదలైన వాటి నాణ్యత పరీక్షించేందుకు కూడా ప్రభుత్వం చెల్లింపులు చేసింది.
అయితే నిబంధన ప్రకారం అక్కడ నాణ్యత పరీక్షలకు లేబరేటరీ ఏర్పాటు చేయాల్సి ఉన్న అలా చేసినట్లు ఆధారాలు ఎక్కడాలేవు. లేబరేటరీ ఉన్నట్లు సంస్థ మాత్రం తెలిపింది. ఎస్ఈని కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన కిచెన్ ఇన్ చార్జిగా చూపారు. ఇదో వింత. ఆ రోజున 44,23,981 అడ్వాన్స్ గా చెల్లించారు. ఇదో ఉదాహరణ. వీక్లీ రేషన్ కు 2017 సెప్టెంబర్ 25న 44,23,981 అడ్వాన్స్ గా చెల్లించారు. మెటీరియల్ కు అడ్వాన్స్ చెల్లించారు. అది వాస్తవంగా నిర్మాణ ప్రాంతానికి చేరిందా లేదా అని చూసేవారు లేరు.
అలాగే ఇంప్రెస్ట్, రివాల్వింగ్ ఫండ్ కింద అందుకున్న మెటీరియల్ కు సంబంధించిన శాఖా అకౌంట్లలో ఎలాంటి వివరాలూ లేవు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చేసిన పోలవరం దందాలో నిబంధనల ఉల్లంఘన, దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.