బండ్ల గణేష్ పైనా అతని అనుచరుల పైనా నిర్మాత, ఫైనాన్షియర్ పివిపి ఫిర్యాదు.
పివిపిపై నిర్మాత బండ్లగణేష్ ఫిర్యాదు.
ఏమిటిది? అసలు ఏం జరిగింది?
గతంలో బండ్ల గణేష్ కు పివిపికి ఆర్థిక లావాదేవీలు వున్నాయి. అది వాస్తవం. ఓ చెక్ బౌన్స్ కేసు కూడా వుంది. అయితే ఓ కేసులో బండ్లగణేష్ గెలిచాడు. కానీ ఉత్తరోత్తరా ఇతర వ్యవహారాలకు సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది ఏదో కుదిరింది. అందువల్ల కొంత మొత్తం బండ్ల గణేష్ ఇవ్వాల్సి వుందని బోగట్టా. కానీ దీనిని బండ్ల గణేష్ అంగీకరించడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో మూడు నాలుగు రోజుల క్రితం బండ్ల గణేష్-పివిపి పార్క్ హయాత్ హోటల్ లో తారసపడ్డారు. అక్కడ ఇద్దరి మధ్య కాస్త సంభాషణ నడిచింది. అప్పుడే పివిపి డబ్బుల విషయమైన హెచ్చరించారని బండ్ల సన్నిహిత వర్గాల బోగట్టా. హెచ్చరించడం ఏమీలేదు, బాకీ గురించి ప్రస్తావన మాత్రమే జరిగిందని పివిపి వర్గాల బోగట్టా.
ఇలాంటి నేపథ్యంలో బండ్ల గణేష్ నుంచి ఓ ఫిర్యాదు, పివిపి వైపు నుంచి ఓ ఫిర్యాదు పోలీసులకు అందాయి. నిన్న సాయంత్రం బండ్ల ఫిర్యాదుచేసినట్లు తెలుస్తోంది. కానీ అది ఎఫ్ఐఆర్ కట్టారో లేదో తెలియదు. అయితే రాత్రి బండ్ల సన్నిహితుడు కిషోర్ అనే వ్యక్తి, మరో ఇద్దరు వ్యక్తులు పివిపి ఇంటికి వచ్చి, సెటిల్ మెంట్ గురించి మాట్లాడతామని అన్నట్లు బోగట్టా.
మరి ఆ తరువాత ఏమయిందో కానీ, పివిపి ఫిర్యాదు చేసారు. దీంతో ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ పివిపిపై విరుచుకుపడ్డారు. మొత్తంమీద ఒకేరోజు రవిప్రకాష్ వ్యవహారం, పివిపి-బండ్ల వ్యవహారం కలిసి మీడియాకు కావాల్సినంత వార్తా సరుకును అందించాయి.