యూపీలో బీజేపీకి వ్య‌తిరేక‌త భ‌య‌మా?

యూపీ అసెంబ్లీలో బీజేపీ బ‌లం 300 మంది ఎమ్మెల్యేల వ‌ర‌కూ ఉంది. ఒక చోటా మిత్ర‌ప‌క్షంతో ఈ బ‌లం మ‌రింత ఎక్కువ‌. ఇక త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన యూపీ విష‌యంలో బీజేపీ చాన్నాళ్లుగా…

యూపీ అసెంబ్లీలో బీజేపీ బ‌లం 300 మంది ఎమ్మెల్యేల వ‌ర‌కూ ఉంది. ఒక చోటా మిత్ర‌ప‌క్షంతో ఈ బ‌లం మ‌రింత ఎక్కువ‌. ఇక త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన యూపీ విష‌యంలో బీజేపీ చాన్నాళ్లుగా క‌స‌ర‌త్తు చేస్తూ ఉంది. తీవ్ర‌మైన క‌రోనా ప‌రిస్థితుల్లో కూడా బీజేపీకి యూపీ ఎన్నిక‌ల చింతే క‌లిగింది. 

యూపీలో మ‌ళ్లీ ఎలా గెల‌వాల‌నే అంశంపై చాలా క‌స‌ర‌త్తే సాగుతూ ఉంది క‌మ‌లం పార్టీ వైపు నుంచి. రామమందిర నిర్మాణంతో స‌హా ప‌లు హిందుత్వ‌వాద అంశాలే ఈ సారి కూడా బీజేపీకి ప్ర‌ధాన ఆయుధాలు అవుతున్నాయి. 

మ‌రి ఇన్ని సానుకూల‌త‌లు ఉన్నా.. క‌మ‌లం పార్టీకి మాత్రం వ్య‌తిరేక‌త భ‌యం ఉండ‌నే ఉంద‌ట‌. అందుకే ఏకంగా వంద మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని క‌మ‌లం పార్టీ అనుకుంటోంద‌ట‌. మూడు వంద‌ల మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మూడో వంతు మందికిపైగా ఈ సారి టికెట్లు నిరాక‌రించ‌నున్నార‌నే అంశం హాట్ టాపిక్ గా మారింది. 

మోడీ ఇమేజ్ మీద‌, యోగి నాయ‌క‌త్వం ఇమేజ్ విష‌యంలో భ‌రోసాతోనే ఉన్న బీజేపీ అదే ఎమ్మెల్యేల వ‌ర‌కూ వ‌చ్చేసరికి మాత్రం ఆ న‌మ్మ‌కంతో లేన‌ట్టుగా ఉంది. వంద‌మందిని మార్చేస్తార‌ని ఒక‌వైపు, కాదు 150 మంది మీదికి ఈ సారి టికెట్ల‌ను నిరాక‌రించి, వారి స్థానంలో కొత్త వారికి ఛాన్సు ఇస్తార‌నే ప్ర‌చారం మ‌రోవైపు సాగుతూ ఉంది. 

ఈ స్థాయిలో సిట్టింగుల‌కు సీట్ల‌ను నిరాక‌రిస్తే.. బీజేపీ త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌పై త‌నే విశ్వాసంతో లేన‌ట్టుగా అవుతుంది. ఆ స్థాయి మార్పులు ప్ర‌తిప‌క్షాల‌కూ ఆయుధాలు అవుతాయి. ఏదో జ‌రుగుతోంద‌నే అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల్లోనూ క‌లిగిస్తాయి.  

ఈ అంశంపై ఎస్పీ నేత‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ స్పందిస్తూ.. బీజేపీ ఎదుర్కొంటున్న ప్ర‌జావ్య‌తిరేక‌త‌కు ఈ మార్పులు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నాడు. ఆ స్థాయిలో సిట్టింగుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం బీజేపీ ప్ర‌భుత్వం ఫెయిల్యూర్ కు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నాడు. బీజేపీ కొత్త వాళ్ల‌ను తీసుకురావ‌డం త‌మ విజ‌యాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తుంద‌ని ఎస్పీ నేత ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మాండ‌మైన విజ‌యం సాధిస్తుంద‌ని, రికార్డు స్థాయి మెజారిటీ అని అఖిలేష్ ఒక‌టికి ప‌ది సార్లు చెప్పుకుంటున్నారు. విజ‌యం మీద ప‌దే ప‌దే ధీమాను వ్య‌క్తం చేస్తున్న అఖిలేష్ ను యూపీ ప్ర‌జ‌లు ఏ మేర‌కు ఆద‌రిస్తారో!