డ్రగ్స్ వంటి కేసుల్లో అరెస్టైన వారెవరినైనా ఒక రకంగా బాధితులుగానే చూస్తుంది మన వ్యవస్థ. పుట్టుకతో ఎవరూ డ్రగ్స్ వాడరు. బలహీనతకు లోను కావడం, లేదా ఎవరి ప్రభావం వల్లనైనా డ్రగ్స్ తీసుకోవడం.. వంటివి జరుగుతూ ఉంటాయనేది చట్టం గుర్తించిన విషయమే.
డ్రగ్స్ వాడకం గురించి తమకు చిక్కిన వారికి చట్టపరంగా శిక్షలు వేయించడం సంగతెలా ఉన్నా, వారికి కౌన్సెలింగ్ ఇప్పించి, వారిని ఆ అలవాటు నుంచి బయటకు తీసుకురావడానికి కూడా యాంటీ నార్కోటిక్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. డ్రగ్స్ వినియోగం విషయంలో దొరికిన సెలబ్రిటీలను కూడా తాము బాధితులుగానే ట్రీట్ చేస్తున్నట్టుగా వారు బహిరంగ ప్రకటనలు కూడా చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇలాంటి వ్యవహారంలో దొరికి, ఎన్సీబీ కస్టడీలో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను కేవలం బాధితుడిగానే చూడటం లేదు ఆసంస్థ. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్లకు ఎన్సీబీ సమ్మతించడం లేదు. అతడు దీర్ఘకాలంగానే డ్రగ్స్ వాడుతున్నాడనేది ఎన్సీబీ అభియోగం. అలాగే డ్రగ్స్ తెప్పించుకోవడం గురించి చాట్ చేశాడని కూడా అంటోంది. ఈ మేరకు బెయిల్ పిటిషన్లకు అభ్యంతరం చెబుతూ ఉంది. ఆర్యన్ ను తమ కస్టడీలోనే పెట్టుకుంది.
ఇక ఇంకోవైపు ఆర్యన్ కు ఎన్సీబీ వైపు నుంచి కౌన్సెలింగ్ కూడా సాగుతున్నట్టుగా ఉంది. ఆ కౌన్సెలింగ్ సందర్భంగా ఆర్యన్ ఖాన్ కూడా తనలో పరివర్తన వస్తుందని చెబుతున్నాడట. తను ఇకపై ఇలాంటి అంశాలతో వార్తలకు ఎక్కనంటూ ఎన్సీబీ అధికారులతో ఆర్యన్ అన్నాడని సమాచారం. తనకు ఉన్న పరపతిని ఉపయోగించుకుని పేదలకు ఏదైనా చేయాలని అనుకుంటున్నట్టుగా ఆర్యన్ చెప్పాడని తెలుస్తోంది.
ఇప్పుడు తను రిలీజ్ అయితే.. అలాంటి పనుల మీద దృష్టి పెడతాను తప్ప.. ఈ అనుచితమైన వ్యవహారాల్లో తలదూర్చనంటూ ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ అధికారులకు ప్రామిస్ చేస్తున్నాడట. ఈ మేరకు షారూక్ తనయుడు ఎన్సీబీ, సోషల్ వర్కర్ల కౌన్సెలర్లతో స్పందిస్తున్నాడట.
పరివర్తన అనేది ఎవరిలో అయినా రావొచ్చు. తమ జీవితంలో డ్రగ్స్ వాడి, బతుకును గుల్ల చేసుకుని, ఆ తర్వాత ఆ ప్రభావం నుంచి బయటకు వచ్చినట్టుగా సంజయ్ దత్ వంటి హీరో తన బయోపిక్ రూపంలోనే వాంగ్మూలం ఇచ్చాడు. ఆర్యన్ ఖాన్ కూడా ఎన్సీబీ అధికారులతో అదే చెబుతున్నట్టుగా ఉన్నాడు.