టీడీపీ అధినేత చంద్రబాబును తన సొంత నియోజకవర్గం కుప్పం నీడలా వెంటాడుతూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆయన్ను ఆత్మరక్షణలో పడేశాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, ఆ పార్టీ మద్దతుదారులు ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. దీంతో చివరికి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కూడా బాబు పని అయిపోయిందంటూ ప్రత్యర్థి వైసీపీ ప్రచారాన్ని సాగించింది.
ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావడం బాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కుప్పం మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. దీంతో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నెలాఖరు లేదా నవంబర్ మొదటి వారంలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్నట్టు సమాచారం.
ఇప్పటికే వైసీపీ, టీడీపీ తరపున బరిలో నిలవాలని భావిస్తున్న అభ్యర్థులు కుప్పంలో ప్రచారం చేసుకుంటున్నారు. కుప్పంలో మొత్తం 25 వార్డులున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. గతంలో వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగని మున్సిపాలిటీల జాబితాలో కుప్పం ఉంది. రాష్ట్రం మొత్తమ్మీద ఒక్క తాడిపత్రి మినహా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో అధికార వైసీపీ పాగా వేసింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కుప్పం అగ్నిపరీక్ష పెట్టనుంది. మరోవైపు వైసీపీ ఎలాగైనా మరోసారి చంద్రబాబును సొంత నియోజక వర్గంలోనే మట్టి కరిపించి తలెత్తుకోలేకుండా చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కుప్పం మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.