తను చేస్తున్న, చేయబోతున్న సినిమాలు అన్నీ స్పెషల్ గా వుండబొతున్నాయని హీరో నిఖిల్ వెల్లడించారు. 18 పేజెస్ విడుదల సందర్భంగా ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇంటర్వూ ఇచ్చారు.
సుధీర్ వర్మ డైరక్షన్ లో చేస్తున్న సినిమా లో రేస్ లు ప్రధాన ఆకర్షణగా వుంటాయని, ఇందుకొసం కీలకమైన రేస్ ఎపిసోడ్ లను విదేశాల్లో చిత్రీకరించాల్సి వుందని అన్నారు. అలాగే స్పై సినిమా సబ్జెక్ట్ చాలా కొత్తగా వుంటుందని, భాషలతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు.
టాగోర్ మధు నిర్మాణంలో చేయబోయే పీరియాడిక్ సినిమా కథ వేరే లెవెల్ లో వుంటుందని, ఆ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఎప్పుడు చేస్తానా అన్న యాంగ్జయిటీతో వున్నానని చెప్పారు. కార్తికేయ 3 విషయంలో దర్శకుడు చందు పాయింట్ చెప్పాడని, అస్సలు మామూలుగా లేదని అన్నారు.
ఇలా రాబోయే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలు అని చెప్పనని, కానీ మన సినిమాను అందరికీ పరిచయం చేస్తామని మాత్రం చెబుతా అని నిఖిల్ అన్నారు. 18 పేజెస్ సినిమాను గీతా సంస్థ, సుకుమార్ అన్న రెండు మాటలు విని, కథ వినకుండానే సైన్ చేసానని అన్నారు.
కానీ ఆ తరువాత చాలా మంది తనకు మెసేజ్ లు చేసారని, ఆ కథ తమకు తెలుసు అని, ఎలా తీసినా సూపర్ కథ అని చెప్పారని వెల్లడించారు. కార్తికేయ 2 తరువాత కథలో మార్పులు చేయలేదు కానీ, సీన్లు కొన్ని కొత్తగా తీసామని అన్నారు.
అయితే అలా చేయడానికి కేవలం కార్తికేయ 2 కారణం కాదని, సుకుమార్ కు పుష్ప సినిమా ఇచ్చిన అద్భుతమైన సక్సెస్ కూడా ఓ కారణమని అన్నారు. 18 పేజెస్ సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు ఇలా ప్రతి దాని వెనుక సుకుమార్ వున్నారని, దర్శకుడు ప్రతాప్ కు కూడా సినిమా మీద మంచి విజన్ వుందన అన్నారు.