ముఖ్యమంత్రిగా జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. వాలంటీర్లను నియమిస్తే.. బస్తాలు మోసే పనిచ్చారని ఎద్దేవా చేశారు. సచివాలయాల్లో లక్షల ఉద్యోగాలు కల్పిస్తే పేపర్ లీకైందని ఏడుపు మొదలు పెట్టారు. రివర్స్ టెండరింగ్ లో వృథాని అరికడితే పనుల్లో క్వాలిటీ తగ్గుతుందని కుంటి సాకులు వెతికారు. రైతు భరోసా ప్రకటిస్తే.. విడతలవారీగా విదిలిస్తున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం జగన్ ని పల్లెత్తు మాటనే ధైర్యం చేయలేకపోయారు చంద్రబాబు.
పదవుల్లో, స్థానిక కాంట్రాక్ట్ పనుల్లో మహిళలకు 33శాతం, బడుగు బలహీన వర్గాలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం చంద్రబాబు టచ్ చేయలేకపోయారు. విమర్శించలేదు సరికదా సైలెంట్ గా జగన్ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో చంద్రబాబు రిజర్వేషన్ల ప్రకారం పదవులిస్తామని ప్రకటించారు. బడుగు బలహీన వర్గాలకు 50శాతం, మహిళలకు 33శాతం పదవులిస్తామని చెప్పారు. పోలిట్ బ్యూరో సమావేశంలో ఈమేరకు ప్రకటన చేసి అదేదో ఘనకార్యమైనట్టు సొంత మీడియాతో డబ్బా కొట్టించుకుంటున్నారు.
అంటే ఇన్నాళ్లూ మహిళల్ని, బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని పరోక్షంగా ఒప్పుకున్నట్టే దీనర్థం. చంద్రబాబు హయాంలోకి వచ్చిన తర్వాత పార్టీలో కేవలం తన వర్గం వారికే పదవులిచ్చుకుంటూ వచ్చారు. పార్టీ పదవుల్ని కంటి తుడుపుగానే బలహీన వర్గాలకు కేటాయించేవారు. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వర్గాల్లో సంచలనంగా మారింది. మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేసి చూపించే ముఖ్యమంత్రి వచ్చారని మహిళలు, వెనుకబడిన వర్గాలు సంబరపడుతున్నాయి. దీంతో చంద్రబాబు కూడా రూటు మార్చారు. పార్టీతో ప్రక్షాళణ మొదలు పెడతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.
ఇన్నాళ్లూ బడుగు బలహీన వర్గాలను, మహిళలను పదవుల విషయంలో మోసం చేసిన బాబు.. ఇప్పుడు ప్రాయశ్చిత్తానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా చంద్రబాబుని నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరనేది మాత్రం ఫైనల్. ఈ విషయంలో బాబు, జగన్ ను ఫాలో అయినా అతడికి వచ్చే మైలేజీ శూన్యం.