పవన్‌కల్యాణ్‌కు రాజకీయంగా కొంచెం తిక్క ఉండొచ్చు. కానీ దానికో లెక్క వుంది. ఇది జగనే కాదు, జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం పదవిని దక్కించుకోవడాన్ని పవన్‌కల్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతగా అంటే… జగన్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన చంద్రబాబు కంటే పవనే ఎక్కువ ఓర్వలేకపోతున్నారు.
మనిషంతా ఆవేశం నింపుకున్న పవన్‌కల్యాణ్… విచక్షణ కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో రాణించాలని తపించే నాయకుడు చేయాల్సిన రాజకీయం ఇది మాత్రం కాదు. భావి తరాలకు పవన్ పొలిటికల్ ఫెయిల్యూర్ గొప్ప గుణపాఠంగా మిగులుతుంది. ఈ మేరకు జనానికి పవన్ మంచి చేస్తారని అనుకోవాలి.
పవన్ గురించి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మూడే మూడు పదాల్లో గొప్పగా చెప్పారు. అపరిపక్వత, మూర్ఖత్వం, అజ్ఞానం కలిస్తే పవన్ అని ఆయన తనదైన శైలిలో అభివర్ణించారు.
కౌలు రైతుల సభలో తమ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ విమర్శలను సజ్జల దీటుగా తిప్పికొట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొహం పగులగొట్టారు. ఇవాళ సజ్జల మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై విరుచుకుపడ్డారు.
సినిమా అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని దెప్పి పొడిచారు. వైసీపీని అధికారంలోకి రానివ్వననే పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. అధికారం ఎవరికి ఇవ్వాలన్నది ప్రజల నిర్ణయమన్నారు. అది పవన్‌కు సంబంధం లేని వ్యవహారమన్నారు.
కేవలం సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు అనుకుంటేనే జగన్ సీఎం కాకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుందని సజ్జల చెప్పారు. అపరిపక్వత, మూర్ఖత్వం, అజ్ఞానంతో పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరి తరపున పవన్ మాట్లాడుతున్నారో అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్ ధైర్యంగా చెప్పాలని సజ్జల డిమాండ్ చేయడం గమనార్హం. రాష్ట్రంలోకి కేఏ.పాల్ రావచ్చు.. పవన్ కల్యాణ్ ఇలా ఎవరైనా రావచ్చు, పోటీ చేయవచ్చని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.