వీకెండ్స్‌లో జనసేనాని పవన్‌కల్యాణ్ ఏపీ రాజకీయాల్లోకి వస్తారు. ఎక్కడో ఒక చోట సభ పెడతారు. అరిగిపోయిన రికార్డులా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై నోరు పారేసుకుంటారు. ఆ తర్వాత మంత్రులు, వైసీపీ నేతలకు వారమంతా పని పెడ్తారు. పవన్‌ను వరుసగా టార్గెట్ చేయడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. సీఎం జగన్ మినహా, ముఖ్య నేతలంతా పవన్ అజ్ఞానాన్ని చీల్చి చెండాడుతున్నారు.
పవన్‌కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తన మార్క్ పంచ్‌లతో విరుచుకుపడ్డారు. రాజకీయాలకు పవన్‌కల్యాణ్ పనికి రాడని ఆమె తేల్చి చెప్పారు. ఎంత సేపు చంద్రబాబుకు వత్తాపు పలికే పవన్‌కల్యాణ్ ప్రజా సమస్యలను ఎలా పట్టించుకుంటారని నిలదీశారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి వేళ్లు, చెప్పులు చూపిస్తే… ప్రజలు అవే తిరిగి చూపిస్తారని ఆమె ఘాటు హెచ్చరిక చేశారు. పవన్‌ను కేవలం ఒక నటుడిగా మాత్రమే గౌరవిస్తారన్నారు.
సినిమా హీరో వస్తే ఓట్లేసేస్తారనే రోజులు పోయాయన్నారు. జనసేన అధినేత తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. పవన్‌తో పాటు ఆయన అన్నలను కూడా జనం ఓడించారని గుర్తు చేశారు. సొంత ఊళ్లలో అన్నదమ్ములు చిత్తుగా ఓడిపోయారంటే తమ మీద ప్రజలకు నమ్మకం లేదని తెలుసుకోవాలని రోజా హితవు పలికారు. పోలవరం నిర్మాణంపై గతంలో చంద్రబాబును అడగకుండా గాడిదలు కాశావా అని ఆమె నిలదీశారు. ఇలా ఒక్కో అంశంపై పవన్‌ను నిలదీస్తూ రోజా చెడుగుడు ఆడుకున్నారు.
ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానని పవన్‌కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి పవన్ తానే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చంద్రబాబు మాయలో పడడం వల్లే ఆయన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో చంద్రబాబును తానే అధికారంలోకి తెచ్చానని అనేక సందర్భాల్లో చెప్పడం వల్ల… ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటికి పవన్ బాధ్యత వహించాల్సి వస్తోంది.
ఇప్పుడు ప్రతి అంశానికి అప్పుడేం చేశావనే ప్రత్యర్థుల ప్రశ్నకు పవన్ నుంచి సమాధానం కొరవడింది.