పల్నాడులో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాచర్లలో విద్వేషపూరిత ఘటనలకు ఆయన్ను బాధ్యుడ్ని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. అయినప్పటికీ తన కార్యకర్తల్లో మనో స్థైర్యాన్ని నింపేందుకు ఆయన సోషల్ మీడియాను వాడుకుంటున్నారు.
జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడిన వీడియో ప్రస్తుతం టీడీపీ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలకు కాలమే జవాబు చెబుతుందన్నారు. మాచర్లలో టీడీపీ శ్రేణులు చూపిన పట్టుదల, పౌరుషం కొనసాగించాలని ఆయన కోరారు. పౌరుషం అంటే ఎదుటి వాళ్ల మీద దాడి చేయడం కాదన్నారు.
ఎన్ని ఇబ్బందులొచ్చినా పార్టీ కోసం గట్టిగా నిలబడడమే పౌరుషమని ఆయన చెప్పుకొచ్చారు. తనను కాపాడేందుకు కార్యకర్తలు పడిన తాపత్రాయన్ని జీవితాంతం మరిచిపోలేనన్నారు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదన్నారు. పల్నాడులో పుట్టిన ప్రతి బిడ్డ ఏదో ఒక రోజు పోలీస్‌స్టేషన్‌కు పోయి వచ్చిన వాళ్లే అని ఆయన అన్నారు. ఇవన్నీ కొత్త కాదన్నారు.
తప్పుడు కేసులకు బెదరాల్సిన, చెదరాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్ అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు. కార్యకర్తలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నారన్నారు. పోలీస్‌స్టేషన్లో హింసిస్తే కోర్టుల్లో మేజిస్ట్రేట్ ముందు చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొద్ది రోజులు దూరంగా ఉండాల్సి వస్తోందన్నారు. బాధగా ఉందన్నారు. అయినప్పటికీ తప్పడం లేదన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని ఆయన కోరారు. కార్యకర్తల కోసం న్యాయ స్థానంలో ఎన్ని పిటిషన్లు వేయడానికైనా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.