తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఇవాళ్టి విచారణకు రాలేనని, మరి కొంత సమయం ఇవ్వాలంటూ రోహిత్‌రెడ్డి తన పీఏ ద్వారా ఈడీ అధికారులకు లేఖ పంపారు. అయితే రోహిత్‌రెడ్డి విన్నపాన్ని తిరస్కరిస్తున్నట్టు ఈడీ స్పష్టం చేసింది. దీంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. కర్నాటక డ్రగ్స్ కేసులో ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి అత్యంత కీలకమైన వ్యక్తి. ఇతని ఫామ్‌హౌస్‌లోనే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు సాగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ అగ్రనేతల్ని ఇరికించాలని కేసీఆర్ సర్కార్ పకడ్బండీ వ్యూహం రచించింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇది దూకుడుగా వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరికించడంలో ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన రోహిత్‌రెడ్డి పని పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా అడుగులు వేస్తోంది. కర్నాటక డ్రగ్స్ కేసును తెరపైకి తెచ్చింది. దీంతో రోహిత్‌రెడ్డి ఉలిక్కిపడ్డారు. రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లకుండా ఏదో చేయాలని ఎత్తుగడ వేసింది. కానీ ఈడీ పైఎత్తు వేసింది. విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం 10.30 గంటలకు రోహిత్ వెళ్లాల్సి వుంది. కానీ ఆయన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో చర్చిస్తూ గడిపారు. 11.30 గంటలకు రోహిత్‌రెడ్డి పీఏ వెళ్లి ఈడీ అధికారులకు లేఖ ఇవ్వడం గమనార్హం. దీన్ని ఈడీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. తనకు గడువు ఇవ్వాలన్న రోహిత్ అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన వెళ్లేందుకే నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వెళ్లినంత వరకూ ఉత్కంఠే అని చెప్పక తప్పదు.