ఈడీ విచారణకు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి డుమ్మా కొట్టారు. కర్నాటక డ్రగ్స్ కేసులో ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి లాయర్‌తో సహా విచారణకు హాజరవుతారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతూ వచ్చారు. దీంతో 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి రోహిత్‌రెడ్డి వెళ్లకపోవడం ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం ఆయన ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తున్నారని సమాచారం. తాను విచారణకు హాజరు కాని విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశారు. ఈ నెల 25న విచారణకు హాజరవుతానని ఈడీ అధికారులకు లేఖ రాసి పంపారు. రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డ్రగ్స్ కేసులో రోహిత్‌రెడ్డి ఇరుక్కున్నట్టు బండి సంజయ్ ముందే చెప్పడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
బండి సంజయ్ చెప్పి మరీ రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇప్పించారని మంత్రి హరీష్‌రావు ఘాటు విమర్శ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అమ్మవారిపై ప్రమాణం వరకూ వెళ్లింది. రోహిత్‌రెడ్డి సవాల్‌కు బీజేపీ నేతలు రియాక్ట్ కాలేదు.
తాజాగా ఈడీ విచారణకు రోహిత్‌రెడ్డి గైర్హాజరు వెనుక వ్యూహం ఏమై వుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ లోపు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందుతారా? లేక 25న విచారణకు హాజరవుతారా? అనేది ఉత్కంఠకు తెరలేచింది.