అవతార్ సినిమా.. ప్రపంచ సినీచరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన సినిమా. అదొక సంచలనం. అలాంటి సంచలనం అవతార్-2తో రిపీట్ అవుతుందని అంతా ఆశించారు. వరల్డ్ రికార్డులన్నీ చెల్లాచెదురవుతాయని భావించారు. వసూళ్లలో కొత్త ఎత్తులు చూపిస్తుందని బెట్ కట్టారు. కానీ అవతార్:ది వే ఆఫ్ వాటర్ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది.
మొదటి వారాంతం గడిచేసరికి అవతార్-2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 435 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్ కాదు. ప్యాండమిక్ టైమ్ లోనే వచ్చిన స్పైడర్ మేన్ నో వే హోమ్ సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో 600 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. డాక్టర్ స్ట్రేంజ్: ది మల్టీవెర్స్ ఆఫ్ మేడ్ నెస్ సినిమా 442 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది.
ఈ రెండు సినిమాలతో పోల్చి చూస్తే.. అవతార్-2 సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్స్ లిస్ట్ లో మూడో స్థానానికి పరిమితమైంది. ఆల్ టైమ్ వసూళ్లలో ఇది ఏ స్థానాన్ని అందుకుంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇటు ఇండియాలో విడుదలైన 3 రోజుల్లో అవతార్-2 సినిమాకు 110 కోట్ల రూపాయలు (18 మిలియన్ డాలర్లు) వసూళ్లు వచ్చాయి. సౌత్ నుంచే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తన పట్టు నిలుపుకుంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు ఏకంగా 37 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ వీకెండ్ ధమాకా, 18-పేజెస్ సినిమాల రాకతో అవతార్-2 సినిమాకు స్క్రీన్ కౌంట్ తగ్గబోతోంది. అయినప్పటికీ మల్టీప్లెక్స్, త్రీడీ వెర్షన్లలో ఈ సినిమా తన హవా చూపించడం ఖాయం.