టీడీపీ ఫైర్‌బ్రాండ్ గ్రీష్మపై అధిష్టానం గుర్రుగా వుంది. పార్టీకి నష్టం తెచ్చేలా ఆమె కామెంట్స్ చేయడంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. టీడీపీ అనుకూల చానల్లో నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, ఆమె కూతురు గ్రీష్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీష్మ రాజకీయంగా సొంత పార్టీ నేతపై చేసిన కామెంట్స్‌ను అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. సొంత పార్టీ నేతపై నోరు పారేసుకోవడంపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది.
శ్రీకాకుళం జిల్లా రాజాం సీటును గ్రీష్మ ఆశిస్తున్నారు. ఇందులో తప్పేం లేదు. టికెట్ సంగతి పార్టీ పెద్దల వద్ద తేల్చుకోవాల్సిన అంశం. కానీ గ్రీష్మ వెటకారంగా మాట్లాడ్డం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. సదరు చానల్ ఎండీ, యాంకర్ పాత్ర పోషించిన ఆర్కే రాజకీయంగా వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
2019లో మిస్పయింది? మరి 2024 సంగతేంటి? అని ఆర్కే ప్రశ్నించారు. దీనికి గ్రీష్మ స్పందిస్తూ… పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మనసులో మాటను చంద్రబాబుకు చెప్పానన్నారు. మరి అదే సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొండ్రు మురళి, గ్రీష్మ మధ్య పోటీనా అని ప్రశ్నించారు. గ్రీష్మ తన మార్క్ స్పందన తెలియజేశారు.
అది చంద్రబాబు చెప్పాలన్నారు. స్థిరంగా ఉండేవాళ్లు కావాలా, లేక జంపింగ్‌లు చేసేవాళ్లు కావాలా అనేది చంద్రబాబు తేల్చుకోవాల్సిన అంశంగా ఆమె కుండబద్ధలు కొట్టారు. కొండ్రు మురళిని వలస పక్షిగా పేర్కొంటూ, తానో, ఆయన కావాలో చంద్రబాబే తేల్చుకోవాలనడంపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఏదైనా వుంటే పార్టీ పెద్దల వద్ద మాట్లాడాలని, కొండ్రు మురళిపై పరోక్ష విమర్శలు చేయడం ఏంటని రాజాం టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే కొండ్రు మురళికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రీష్మ వ్యవహారశైలిపై టీడీపీ గత కొంత కాలంగా ఆగ్రహంగా ఉంది. గ్రీష్మ దూకుడు పార్టీకి నష్టం కలిగించేలా ఉందనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో వుంది. టీవీ డిబేట్లకు తరచూ వెళ్ల కూడదని ఆమెను కట్టడి కూడా చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఇవ్వకపోతే ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.