తెలుగుదేశం పార్టీ పేరెత్తితేనే మొహం తిప్పుకుంటారు జూనియర్ ఎన్టీఆర్. చంద్రబాబునాయుడు పేరెత్తితే మండిపడతారు. నారా లోకేష్ పేరు చెబితే అసహ్యించుకుంటారు. ప్రెవేటు సంభాషణల్లో ఆయన వద్ద ఈ టాపిక్ తెచ్చే వారికి ఈ అనుభవాలు బాగా తెలుసు.
అలాంటిది.. 2024 ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వచ్చి ఊరూరా తిరుగుతూ చంద్రబాబునాయుడు భజన చేస్తూ.. సైకిలు గుర్తుకు ఓటు వేయమని అడుగుతారు.. అని చెబితే నమ్మడానికి ప్రజలు వెర్రివాళ్లా? కానీ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే చందంగా.. వచ్చే ఎన్నికలకు జూ.ఎన్టీఆర్ వస్తారు.. ప్రచారం చేస్తారు.. అని చెప్పుకుంటూ ప్రజల్లో సానుకూల పవనాలు సృష్టించుకునే చీప్ ట్రిక్స్ ను ఆశ్రయిస్తోంది తెలుగుదేశం పార్టీ.
తన డిజిగ్నేషన్ ‘సినిమా హీరో’ అని చెప్పుకోడానికి తగినట్టుగా కొన్ని సినిమాలు చేసిన నందమూరి తారకరత్న కు సినిమాల కంటె రాజకీయాల మీదనే ఆసక్తి ఎక్కువ. సినిమా హీరోగా టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. తన అరంగేట్రంరోజున తొమ్మిది సినిమాల్లో హీరోగా క్లాప్ కొట్టి ముహూర్తం చేసిన తారకరత్న.. ఇప్పటిదాకా జీవితంలో ఒక్క హిట్ గానీ, మంచి సినిమా గానీ చేయలేకపోయారు. ఇంకా చెప్పాలంటే.. విజిటింగ్ కార్డు మీద ఉండాల్సిందే తప్ప.. ఆయన సినిమా హీరో అనే సంగతి తెలుగు ప్రపంచం కూడా మరచిపోయింది. కానీ.. రాజకీయంగా మాత్రం.. అప్పుడప్పుడూ తెలుగుదేశం అనుకూల బాకా ప్రచారంలో ఆయన మెరుస్తూ ఉంటారు.
తాజాగా గుంటూరుజిల్లా పెదనందిపాడులో తాతయ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని తారకరత్న ఆవిష్కరించారు. ఆ సందర్భంగా తాను కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లుగా వెల్లడించారు. మామయ్యకు అండగా ఇప్పటినుంచే ఎన్నికల ప్రచారంలో ఉంటానని కూడా సెలవిచ్చారు. ఆయన పోటీచేసినా కూడా ఏం పర్లేదు. ఎటూ కొన్నిచోట్ల అభ్యర్థులకు కూడా దిక్కులేని స్థితిలో తెలుగుదేశం ఉంది. అలాంటి ఒక సీటును ఆయనకు చంద్రబాబు విదిలిస్తారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల ప్రచారానికి తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘వీలును బట్టి ’వస్తారని తారకరత్న ప్రకటించడం విశేషం. ‘వీలున్న సమయంలో’ అంటే అర్థం ఏమిటో ఆయనకే తెలియాలి.
జూ.ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీని చీదరించుకుని, దూరం జరిగి చాలా కాలం అయింది. 2018 ఎన్నికల్లో తన సొంత సోదరిని చంద్రబాబు కూకట్ పల్లి బరిలో దించినప్పుడు కూడా.. ఎన్టీఆర్ కాదు కదా, కల్యాణ్ రామ్ కూడా ప్రచారం దిశగా కన్నెత్తి చూడలేదు. అలాంటిది చంద్రబాబుకోసం ఏపీ ఎన్నికల ప్రచారానికి వస్తారనడం మిథ్య అని ప్రజలు అనుకుంటున్నారు.
అయినా జూనియర్ ఎన్టీఆర్ వీలును బట్టి ప్రచారానికి వస్తారని ధ్రువీకరించడానికి, ఈ నందమూరి తారకరత్న.. ఆయనకు మేనేజరా? పీఆర్వోనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదో తనకు అనుకూల పవనాలు సృష్టించుకోవడానికి జూ.ఎన్టీఆర్ గురించి బొంకులు మాట్లాడుతున్నారని కూడా అనుకుంటున్నారు.