బతుకు ఒక పరుగుపందెం. ఎంత దూరం పరుగెత్తాం? ఎన్ని విజయాలు నమోదు చేశాం? అనే అంశాలమీదనే అందరి ధ్యాస ఉంటుంది. కానీ, పరుగు ఎప్పుడు ఆపదలచుకున్నాం.. పరుగు ఆపడానికి ఏరకంగా మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం.. మన చుట్టూ ఉన్న మనప్రపంచాన్ని ఏ రకంగా సిద్ధం చేశాం అనేది కూడా చాలా కీలకమైన సంగతి.
పరుగు ఆపడం మీదనే ఆ జీవితంలోని పరిపూర్ణత కనిపిస్తుంది. అందుకే పరుగు ఆపడం ఒక కళ. జీవన విలువల దృక్కోణంలోంచి పరుగు ఆపడం తెలియక.. జీవితాన్ని గందరగోళం చేసుకునే వారు ఎందరో ఉంటారు? అన్ని కోణాల్లోంచి సాధికారిక విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర స్టోరీ.
ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది కాదు.. ఎప్పుడు క్విట్ కావాలనేది షేర్ మార్కెట్ లో సక్సెస్ కు అవసరమైన ప్రథమ సూత్రం.. అని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. ఇది కేవలం షేర్ మార్కెట్ కు మాత్రం వర్తించే సిద్ధాంతం కాదు. ప్రతి జీవితానికి వర్తించే సిద్ధాంతం. కెరీర్లో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన సూత్రం. తమ తమ రంగాలనుంచి ఎప్పుడు విరమించుకోవాలో తెలియక.. తెలిసినా సరే.. విరమించుకోవడానికి మనసొప్పక, ఆశ చావక కొనసాగించే వారే ఎక్కువ మంది ఉంటారు. వారందరూ ఆయా రంగాలకు, తాము భారంగా మారిపోతున్నాం అనే వాస్తవాన్ని గుర్తించకుండా, గుర్తించినా తెలియనట్టు నటిస్తూ బతుకీడుస్తుంటారు. పాపులారిటీ, ధనార్జన ఎక్కువగా ఉండే రంగాల్లోనే ఈ రకం జాడ్యం కూడా ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా పాపులారిటీ ఉండే ప్రధాన రంగాలు మూడున్నాయి. సినిమా, రాజకీయం, స్పోర్ట్స్. ఈ రంగాలలోకి రావాలని ఉవ్విళ్లూరే వారు లక్షల్లో ఉంటారు. స్థిరపడిన వాళ్లు వందల్లో వేలల్లో ఉంటారు. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసినా సరే.. అది తమకు వర్తించదు అన్నట్టుగా ఆ రంగాన్నే పట్టుకుని వేళ్లాడుతున్న వారు పదుల సంఖ్యలో ఉంటారు. వాళ్లు వెళ్లరు.. కొత్త నీరును రానివ్వరు. కుంటిసాకులు వెతుక్కుంటూ గడిపేస్తుంటారు.
పరుగాపడం.. రిటైర్మెంట్ అవసరమా?
రిటైర్మెంట్ అసలు అవసరమా.. ఏ కెరీర్ లోనైనా అనే సందేహం మనకు కలుగుతుంది. ఒక మనిషి పనిచేయగలిగినంత కాలమూ పనిచేస్తుంటాడు కదా..? ఇంకొకరికి అందులో అభ్యంతరం ఎందుకు? అనే సందేహమూ కలుగుతుంది. ఇది కూడా నిజమే.. ఏదైనా వ్యాపారంలో స్థిరపడి.. తొంభయ్యేళ్లు వచ్చేదాకా కూడా దుకాణంలో కూర్చుని నడిపిస్తున్న వారు మనకు అనేకులు కనిపిస్తారు. ప్రభుత్వోద్యోగాలంటే.. నిర్బంధ పదవీవిరమణ ఉంటుంది గనుక.. వాళ్లు చాలించుకుని ఇంట్లో కూర్చుంటారు. కానీ.. కొన్ని ప్రెవేటు కొలువుల్లో సంపన్నుల దగ్గర పనిచేసేవాళ్లు చచ్చేవరకు ఆ పనిచేస్తూనే ఉంటారు. మరి రిటైర్మెంట్ గురించి, పరుగాపడం గురించి మాట్లాడుకోవడం అవసరమా అనే సందేహం రావడంలో తప్పులేదు.
కానీ మనం మాట్లాడుకుంటున్నది ఇలాంటి సాధారణ రంగాల గురించి కాదు. పాపులారిటీ, ధనార్జన అధికంగా ఉండే రంగాల గురించి. ప్రజలు ఒకరి పాపులారిటీని బట్టి ఆదరిస్తున్నారు.. అంటే.. ఆ పాపులారిటీకి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందని గుర్తించాలి. పాపులారిటీ అనేది.. ఆ వ్యక్తిలోని ఒక క్వాలిటీని బట్టి ఏర్పడుతుంది. మరి ఆ క్వాలిటీ చిరస్థాయిగా ఒకే రీతిగా ఉంటుందని అనుకోవడం పిచ్చి భ్రమ.
ఒక క్రీడాకారుడినే తీసుకుందాం. మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు గనుక.. సచిన్ టెండూల్కర్ ను ప్రపంచం ఆరాధించింది. క్రికెట్ దేవుడిగా గుర్తించింది. నేను క్రికెట్‌కు దేవుడిని గనుక.. గుడి కట్టుకుని కదలకుండా ఇక్కడే కూర్చుండిపోతాను అని సచిన్ అనుకుని ఉంటే ఏమయ్యేది? క్రికెట్ ఆడడం అనేది.. శారీరక దార్ఢ్యం, లాఘవంతో కూడా ముడిపడి ఉంటుంది. ఎంతగా ఫిట్ నెస్ మెయింటైన్ చేసినా.. అందులో ఎంతో కొంత తేడా వస్తూ ఉంటుంది.
పాతికేళ్ల చిరుతప్రాయంలో ఉండే లాఘవం.. నలభయ్యేళ్లకు కూడా ఉంటుందని అనుకోలేం. ఆ నైపుణ్యాన్ని, కౌశలాన్ని, లాఘవాన్ని మిస్ కావడం అనేది.. యావత్ ప్రపంచం గుర్తించే వరకు మనం ఆగనే కూడదు. ఎందుకంటే.. మిస్ అవుతున్న సంగతి ఇతరులు గుర్తించడం కంటెముందు మనకే అర్థమవుతుంది. అర్థం కాగానే.. రిటైర్మెంట్ గురించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. నిజానికి సచిన్ టెండూల్కర్ చేసినది కూడా అదే. దేవుడిగా అందరూ కీర్తిస్తూనే ఉన్నప్పటికీ.. ఆట మీద పట్టు తప్పుతున్నదని తనకు అనిపించినప్పుడే.. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాడు. నిజానికి ఇంకో రెండు మూడేళ్లు కొనసాగినా.. అతడిని జట్టులోంచి తొలగించరు. కానీ క్రీడాభిమానులే బోరింగ్ గా అనుకుంటారు. దేవుడు అనే నిర్వచనాన్ని మర్చిపోతారు. కొత్తగా జట్టుకు గుదిబండ అనే నిర్వచనం యాడ్ చేసినా చేస్తారు. అక్కడి దాకా రాకుండా జాగ్రత్త పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త.
మరో ఉదాహరణ చెప్పుకుందాం. మొన్నటి తరం హీరో శోభన్ బాబు మనకు ఎలా గుర్తుంటాడు. సూపర్ స్టార్ కృష్ణ ఎలా గుర్తుంటాడు? వీళ్లు కెరీర్ లో ది బెస్ట్ సినిమాలు చేస్తూ ఉన్న రోజుల్లోనే రిటైర్ అయ్యారు. శోభన్ బాబు అయితే మరీ.. వయసు మళ్లిన పాత్రలు వచ్చినా ఒప్పుకోలేదు. ‘శోభన్ బాబు అనే పేరు అంటే.. ఒక తరం గుండెల్లో ఒక ముద్ర ఉంటుంది. అది చెరగిపోవడానికి వీల్లేదు’ అని తప్పుకున్నారు. ఎంత పట్టుదలతో తప్పుకున్నారంటే.. సినిమాలు చేయడం మానేశారు సరే.. తన ఫోటోలు కూడా ఎక్కడా బయటకు రానంతగా తన చుట్టూ గిరిగీసేసుకున్నారు. అందుకే ఒకే అందమైన చిత్తరువుగానే ఆయన అందరి మదిలో మిగిలిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ చేయదలచుకుంటే.. చివరి శ్వాస వరకు ఏదో ఒక తరహా సినిమా అవకాశాలు రాకుండానే ఉంటాయా? కానీ, ఆయన కూడా వద్దనుకున్నారు. అదే పరుగు ఆపాలని అనుకోవడం. అందుకే సూపర్ స్టార్ గానే.. ఆయన వెళ్లిపోయారు.
రాజకీయాలను గమనిస్తే.. నిన్నటితరం ఉక్కుమనిషిగా.. ఇవాళ కేంద్రంతోపాటూ అనేక రాష్ట్రాల్లో అధికారం అనుభవిస్తున్న మహావృక్షంగా విస్తరించిన భారతీయ జనతా పార్టీకి తల్లివేరు వంటి వారు. వయసు మళ్లింది. ఆయన రాజకీయంగా పూర్తిగా తప్పుకున్నారు. అర్రులు చాచలేదు. వీల్ చెయిర్ లో కూర్చుని కూడా రాజకీయం చేయాలని, ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని ఆశపడే వాళ్లున్న ఈ రోజుల్లో, నేను నడవగలిగే స్థితిలో ఉన్నాను కాబట్టి నాకింకా పొలిటికల్ కెరీర్ ఉంది అని ఆయన వెంపర్లాడలేదు.
ఆపడంలో అంచనాలు తప్పి..
ఉసేన్ బోల్ట్.. పరుగుల మరమనిషిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ.. తన రిటైర్మెంట్ కు సరైన సమయాన్ని ప్లాన్ చేసుకోలేకపోయాడు. అనేకానేక ఒలింపిక్ పతకాలు సాధించిన బోల్ట్.. తన సామర్థ్యాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో సరిగా నిర్ణయించుకోలేకపోయాడు. కొంచెం ముందుగా ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకుని ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. ముందే ప్రకటించిన రిటైర్మెంట్ నిర్ణయం ప్రకారం.. చివరి పరుగు పందెంలో, చివరి ల్యాప్ పూర్తి చేయకుండా.. చతికిలబడి అత్యంత అవమానకరమైన రీతిలో ఉసేన్ బోల్ట్ ట్రాక్ నుంచి పక్కకు తప్పుకున్నాడు.
ఇటీవలి కాలంలో అలాంటి మరో మంచి ఉదాహరణ రోజర్ ఫెదరర్. టెన్నిస్ ను అభిమానించే వాళ్లలో ఫెదరర్ ను అభిమానించని వాళ్లు ఉండరు. రోజర్ ను ఓడించి టైటిల్స్ గెలిచిన నాదల్ లాంటి వాళ్లు కూడా ఉండవచ్చు గాక.. కానీ వారికంటె రోజర్ కే ఎక్కువ మంది ప్రేమాభిమానాలు సొంతం అయ్యాయి. కేవలం ఆట మాత్రమే కాదు.. ఆటతో పాటు అతని వ్యక్తిత్వం, నిలకడ, తీరు అన్నీ అతనికి ప్లస్ అయ్యాయి. ఒకప్పట్లో గ్రాండ్ శ్లామ్ టైటిల్ టోర్నీలలో సైతం.. ఒక్క గేమ్ కూడా ప్రత్యర్థికి కోల్పోకుండా.. టైటిల్ చివరి వరకు నెగ్గుతూ వచ్చి రికార్డులు సృష్టించిన రోజర్ ఫెదరర్.. ఆట మసకబారిపోతున్నా సరే.. దానిని గుర్తించడంలో విఫలం అయ్యాడు.
నిజానికి అతని ఆట సన్నిగిల్లి ఉండకపోవచ్చు.. కానీ ఉవ్వెత్తున ఎగసి వస్తున్న క్రీడా యువతరంగాలు.. అతడిని బీట్ చేస్తూ వచ్చాయి. చాలా ఆలస్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. టెన్నిస్ రంగం నుంచి ఏటా మిలియన్ డాలర్లలో ఇచ్చే ప్రతిఫలాన్ని రిటైర్మెంట్ అనే పదం ద్వారా ఉన్నపళంగా వదులుకోవడానికి అతడికి మనసు అంగీకరించకపోయి ఉండొచ్చు. పరుగు ఆపడాన్ని సాగదీశాడు. ఫలితం ఏమైంది? లావెర్ కప్ లో తన చిరకాల ప్రత్యర్థి నాదల్ వంటి మేటి ఆటగాడు పార్టనర్ గా డబుల్స్ మ్యాచ్ లో బరిలోకి దిగి.. అనామకుల చేతిలో ఓడిపోయారు. అలా అవమానకరమైన ఓటమితో ఆయన అత్యద్భుతమైన, రోమాంచితమైన కెరీర్ ను రోజర్ ముగించాల్సి వచ్చింది.
ఇవన్నీ పొరబాటు నిర్ణయాలు. జడ్జిమెంట్ లేకపోవడం వల్ల.. తాను ఎప్పటికీ ఒకనాటి ప్రతిభలనే కలిగిఉన్నాననే భ్రమలో తీసుకునే నిర్ణయాలు. ఈ ఉదాహరణలు క్రీడారంగానికి సంబంధించినవే అయినప్పటికీ.. పాపులారిటీ అనే పదంతో బాగా ముడిపడి ఉండే సినిమా రాజకీయ రంగాలకు కూడా వర్తిస్తాయి.
ఏ జాగ్రత్త అవసరం? ఎలాగైతే బెటర్?
ఏ వయసులో ఏ రంగంనుంచి తప్పుకుంటే బాగుంటుంది..? అనేది ఎప్పటికీ పెద్ద ప్రశ్న. నిజానికి వారిలో సత్తా పుష్కలంగా ఉన్నప్పుడు తప్పుకునే అవసరమే లేదు.. కానీ ప్రజాదరణ, గ్లామర్ తో ముడిపడిఉన్నప్పుడు తప్పదు. ప్రధానంగా మన కెరీర్ లో మన నైపుణ్యాలకు, మనకు దక్కుతున్న ఆదరణకు మూలమైన వనరు ఏమిటి? అనే స్పృహ మనలో ఉండాలి. మనలో ఆ వనరులు ఉడిగిపోతున్నాయని అనిపించినప్పుడు.. ఆ వనరులకు ఒక పరిమితి ఉంటుందని అనిపించినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి.
ఉదాహరణకు క్రీడల సంగతే తీసుకుందాం. క్రీడలు అంటేనే శారీరక దార్ఢ్యంతో ముడిపడిన వ్యవహారం. సచిన్ ఎగ్జాంపుల్ మాదిరిగా పాతికేళ్ల శారీరక దార్డ్యం నలభై యాభైలలో ఉండదు. దానికి తగ్గట్టు సుమారు 35 ఏళ్ల వయసు వచ్చేసరికి క్రీడాకారులు తమ రిటైర్మెంట్ ప్లాన్స్ తో సిద్ధంగా ఉండాలి. పరుగు ఆపడాన్ని నేర్చుకోవాలి.
అదే మాదిరిగా సినిమా రంగం విషయానికి వస్తే.. హీరోలు లేదా హీరోయిన్లకు ప్రజాదరణ అనేది గ్లామర్ తో ముడిపడిన అంశం. గ్లామర్ తగ్గుతోందని అనిపించినప్పుడు ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లాన్స్ ఉండాలి. పరుగు ఆపడం మంచిదని గ్రహించాలి. ఉదాహరణ తీసుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి– రాధ ఒక దశలో టాలీవుడ్‌ను ఏలారు. నిజానికి హీరోల కెరీర్ కంటె, హీరోయిన్ల కెరీర్ చాలా కురచగా ఉంటుంది.. ఇది సహజం. అయినా సరే.. పోల్చి చూసినప్పుడు.. రాధ.. హీరోయిన్ గా చాలా టాప్ రేంజిలో ఉన్న రోజుల్లోనే పరుగు ఆపింది. ఇప్పుడు ఏదైనా ప్రెవేటు కార్యక్రమాల్లో రాధను చూసినప్పుడు ఆమెలో గ్లామర్ కోషంట్ మనకు కనిపించదు. కానీ.. ఇలా పలచబడిపోయిన గ్లామర్ తో నేను తల్లిపాత్రలు చేస్తా, అమ్మమ్మ పాత్రలు చేస్తా అంటూ డబ్బు కోసం ఆమె ఇండస్ట్రీలో కంటిన్యూ కాలేదు. అందుకే.. రాధ ఎప్పటికీ అప్పటి రాధ లాగానే.. ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..’ అంటూ హొయలొలికిస్తూ ఊరించే రాధగానే ప్రేక్షకలోకానికి గుర్తుండిపోయింది.
అదే చిరంజీవి విషయానికి వచ్చేసరికి ఏమైంది? కొండవీటిదొంగ, గ్యాంగ్ లీడర్ నాటి క్రేజీ ఫాలోయింగ్ ను ఇవాళ ఊహించగలమా? ఒకప్పట్లో చిరంజీవి అంటే వేలం వెర్రిగా ఉరకలెత్తిన జనం ఇవాళ మాయమైపోయారా? మరి ఎందుకు ఓపెనింగ్ లకు కూడా ఆరాటపడాల్సి వస్తోంది. ఇప్పుడు చిరంజీవిలో ‘జగదేకవీరుడి’ని జనం చూడగలుగుతున్నారా? అనేది ప్రశ్న. పోనీ వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకునే తత్వం అలవడిందా అంటే అది కూడా లేదు. నిజం చెప్పాలంటే.. వయసుకు తగ్గపాత్రలు అనే క్లారిటీ ముందుగా చిరంజీవికే వచ్చింది. అన్నయ్య, హిట్లర్ లాంటి సినిమాలు ఆ క్రమంలో తయారయ్యాయి. కానీ.. నెమ్మదిగా మళ్లీ స్టార్డమ్ వ్యామోహం అంటుకుంది. వయసు మీదపడినా.. గ్రాఫిక్స్ తో, రకరకాల కెమెరా గిమ్మిక్కులతో పడుచు చిరంజీవిగా చూపించే కుయత్నాలతో ఆయన ఇమేజిని మరింతగా పలుచన అయిపోతోంది.
ఈ రంగాలనుంచి పూర్తిగా పరుగు ఆపే అవసరం లేదు. అదేస్థాయి ప్రజాదరణ, ఆర్జన కోరుకోకుంటే.. కేవలం ఆరంగం మీద ప్రేమే గనుక వారిని ప్రేరేపించేట్లయితే.. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు చూడవచ్చు. నటులు వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకోవచ్చు. క్రీడాకారులు కోచ్ లుగా, వ్యాఖ్యాతలుగా మారవచ్చు. తమ రంగంతో తమ అనుబంధాన్ని కొనసాగించవచ్చు. సినిమా రంగానికి 60 ఏళ్ల వార్ధక్యం అనేది ఒక హద్దుగా ఉంటే, పరుగు ఆపడానికి అందంగా ఉంటుంది.
రాజకీయం సంగతి వేరు..
పాపులారిటీ విషయంలో ఈ రెండు రంగాలతో రాజకీయం పోటీ పడుతుంది. కానీ శారీరక దార్ఢ్యం, గ్లామర్ వంటివి ఈ రంగాన్ని నడిపించవు. కేవలం పాపులారిటీ, ఆర్జన మాత్రమే కాదు.. అధికారదర్పం ఈ రంగానికి ఉండే అదనపు ఆకర్షణ. దానిని వదిలించుకోవడం కూడా చాలామందికి కష్టం. వీల్ చెయిర్ దశకు చేరుకుని.. ఇంకా ఎన్నికల్లో పోటీచేయాలనుకునే వాళ్లు మనకు ఉన్నారు. అంతో ఇంతో భారతీయ జనతా పార్టీ ఒక నియమం పెట్టుకుందా. 75 ఏళ్లు దాటిన వృద్ధులు క్రియాశీల రాజకీయాల్లో ఉండనే వద్దు అనే నియమం పెట్టుకున్నారు. ఆ కోటాలో అనేకమంది మహామహులు, ఉద్ధండపిండాలు తప్పుకున్నారు. ఉక్కుమనిషి అద్వానీ కూడా పరుగు ఆపేశారు.
రాజకీయాలకు ఉండాల్సిన మౌలిక లక్షణం ఏమిటి? ప్రజలతో మమేకం కావడం. వారి వాస్తవ అవసరాల్ని గుర్తించగలగడం. వయసు పెరిగే కొద్దీ, అధికారాన్ని సుదీర్ఘకాలం అనుభవించే కొద్దీ.. ప్రజలతో మమేకం అయ్యే మౌలిక లక్షణాన్ని కోల్పోతున్నవారే ఎక్కువ. నిజానికి ఈ రంగంలో కూడా ప్రత్యామ్నాయంగా వెలుగొందగల అవకాశాలున్నాయి. కానీ.. అందరికీ అధికారంతో కూడిన వైభవమే కావాలి.. అక్కడే వస్తుంది తంటా.
ఇప్పుడు చంద్రబాబునాయుడుతో వచ్చిన సమస్య కూడా అదే. ‘లాస్ట్ చాన్స్’ అంటూ ఈ వృద్ధాప్యంలో ఆయన ప్రజలను దేహీమనడంలో విడ్డూరం కూడా అదే. లాస్ట్ చాన్స్ లాంటి డైలాగులు చెప్పడం లేదు గానీ.. చంద్రబాబునాయుడు లాగానే.. 72 ఏళ్ల వృద్ధాప్యంలోనే ఉన్న నరేంద్రమోడీ కూడా బహుశా ఈసారి చివరి ఎన్నికలనే ఎదుర్కొంటారు. పార్టీలో తాను తీసుకువచ్చిన నియమానికి కట్టుబడి ఆయన వచ్చే ఎన్నికల సమయానికి బరిలో ఉండకపోవచ్చు.
అయితే వీరు పార్టీలకు మార్గదర్శనం చేసే స్థితికి వెళ్లాలి. కానీ.. తామే స్వయంగా అధికారంలో ఉండడాన్నే అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి పిచ్చి వ్యామోహంలోనే ఉన్నారా? అనిపిస్తుంది. ఎందుకంటే.. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే.. మరో ముప్ఫయ్యేళ్లపాటూ సీఎంగా సేవలందిస్తానని ఆయన పదేపదే చెబుతుంటారు. ఇప్పుడు ఆయన వయస్సు 50 ఏళ్లు. అంటే.. 80ఏళ్లు నిండేవరకు ఆయన సీఎం కుర్చీలోనే ఉండాలనుకుంటున్నారా? అంత అవసరమా? అనేది ప్రశ్న.
పరుగు ఆపడం అనేది నిజంగానే ఒక కళ. కెరీర్ లో చీకటి రోజులు ప్రారంభమయ్యే దాకా ఆగే వాళ్లు.. ఆ కళలో విఫలురు అయినట్టు లెక్క. కానీ.. పరమవైభవ స్థితిలో ఉన్నప్పుడే.. పరుగు ఆపారంటే వాళ్లు అద్భుతమైన వ్యక్తుల కింద లెక్క. వారిని ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని బోధపరచుకుంటే.. ఇక తమ తమ కెరీర్ లను ఎలా ప్లాన్ చేసుకోవాలో.. ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.
.. ఎల్. విజయలక్ష్మి