మాచర్లలో జరిగిన విధ్వంసం, కొట్లాటలు, దహనాలు ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఓ ముసలం పుట్టడానికి కారణం అయ్యాయి. మాచర్ల విషయంలో చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వ్యూహం, వేస్తున్న అడుగుల మీద అనేకమందికి అసంతృప్తి ఉంది. వారు తమ ప్రెవేటు సంభాషణల్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అధినేత దృష్టికి కూడా తీసుకువెళుతున్నారు. అయితే రాజకీయ గిమ్మిక్కుగా చంద్రబాబునాయుడు మాచర్ల కక్షల ఘర్షణలను పెద్దవి చేయడానికిక ప్రయత్నిస్తున్నారు గానీ.. వాస్తవంలో ఆ వ్యూహం బ్యాక్ ఫైర్ అవుతుందని, తమ పార్టీకి పెద్దగా లాభించేదేమీ ఉండదని అనేకమంది నాయకులు అంచనా వేస్తున్నారు.
మాచర్లలో ఉభయ వర్గాలు కొట్టుకున్నాయి. ఫ్యాక్షన్ తగాదాలతో నిత్యం రెచ్చిపోతూ ఉండే రెండు వర్గాల మధ్య తగాదాలు రేగడానికి ఈసారి మాత్రం.. తెలుగుదేశం పార్టీ వారి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం వేదిక అయింది. ఆ సాకు పెట్టుకుని.. ఉభయ వర్గాలు ఫ్యాక్షన్ కక్షలకు, కొట్లాటలకు తెగబడ్డాయి. తెలుగుదేశం ముసుగులో బ్రహ్మారెడ్డి వర్గీయులు తొలిదాడికి పాల్పడి, రెచ్చగొడితే.. వైసీపీ దళాలు కూడా ఆ ఫ్యాక్షన్ భాషలోనే జవాబు చెప్పాయి. మాచర్ల విధ్వంసకాండ మొత్తం ఇరువర్గాల మధ్య ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగినది మాత్రమే అని జిల్లా ఎస్పీ కూడా తేల్చి చెప్పారు.
అయితే దీనిని రాజకీయం రాద్ధాంతం చేయడంద్వారా లబ్ధి పొందాలని తెలుగుదేశం సహజంగానే ప్రయత్నిస్తూ ఉంది. మాచర్లలో బాధిత కుటుంబాలను పార్టీ తరఫున తాను ఆదుకుంటానని చంద్రబాబునాయుడు సెలవిచ్చారు. అలాగే పోలీసులు తమ పార్టీ వారి మీద నమోదు చేసిన కేసుల విషయంలో కోర్టు ఖర్చులన్నీ కూడా పార్టీ చూసుకుంటుందని కూడా సెలవిచ్చారు. ఇలా ఆ వ్యవహారాన్ని హైలైట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదంతా నచ్చని వర్గం ఒకటి తెలుగుదేశం పార్టీలోనే తయారవుతోంది.
మాచర్ల గొడవ కేవలం ఫాక్షన్ తగాదా అని అందులో తమ పార్టీ అతిగా వేలుపెట్టడం తగదని, పార్టీ నిధులు, వనరులు మొత్తం ఫ్యాక్షన్ లీడర్ ను కాపాడడం కోసం తగలేయడం అనవసరం అని వారు వాదిస్తున్నారు. పైగా ఒక రెడ్డి వర్గానికి చెందిన నాయకుడి ఫాక్షన్ దందా కోసం తమ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది.. తెలుగుదేశం లోని కమ్మ వర్గానికి చెందిన అనేకమంది నాయకులకు నచ్చడం లేదు. మాచర్ల విధ్వంసాన్ని ఏదో వేదికలమీద మాట్లాడేప్పుడు మైలేజీ కోసం, వైసీపీని నిందించడం కోసం వాడుకోవాలే తప్ప.. వారిని ఆదుకోవడానికి పార్టీ శ్రమపడడం ఖర్చుపెట్టడం వద్దని వారు చంద్రబాబుకు సూచిస్తున్నారు.
అయితే చంద్రబాబునాయుడు వ్యూహం వేరుగా ఉంది. వాస్తవంగా అది ఫాక్షన్ తగాదా మాత్రమే అనే సంగతి.. స్థానికంగా మాచర్లలోనో, ఇరుగుపొరుగు ఊర్లలోనో ఉన్నవారికి అర్థమవుతుంది గానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిలో వైసీపీ దమనకాండలాగా ప్రచారం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటున్నారు. అందుకు ఈ మాత్రం ఖర్చు పెద్ద దండగేం కాదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.