తెలుగు ప్రజల జీవితాల్లో తెలుగుదేశం పార్టీది కూడా ఓ భాగం. కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం పాలించినా ఓ అనుబంధం అంటూ పెద్దగా పెనవేసుకోలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రాంతీయంగా జనాలతో మమేకమైంది. అది అనుకూలంగా కావచ్చు, ప్రతి కూలంగా కావచ్చు. ఆ పార్టీ పేరు జనాల్లో నానుతూనే వుంది. దానికి అంటూ ఓ ఓట్ బ్యాంక్ వుంది. దానికి అంటూ ఓ కేడర్ వుంది. మరో రెండేళ్లలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకునే తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడిని విడదీసి చూడలేం. ఎన్టీఆర్ వెనుక నీడలా పార్టీలో వున్న నాటి నుంచి ఎన్టీఆర్ ను పక్కకు తప్పించి పార్టీని తన చేతుల్లోకి తీసుకునే వరకు చంద్రబాబు నాయుడు ఎదిగారు. ఆ తరువాత జాతీయంగా, అంతర్జాతీయంగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు. అనేక వ్యవస్థల్లో తన అభిమానులు కావచ్చు, తన మనుషులు కావచ్చు, తన విశ్వాసపాత్రుల కావచ్చు, కచ్చితంగా వుండేలా చూసుకున్నారు.
ఇన్ని చేసినా, ఇంత చేసినా, ముదిమి మీద పడిన వేళ చంద్రబాబు కలవరపాటుకు గురవుతున్నారు. తన తరువాత పార్టీ ఏమవుతుంది అన్నది కాదు. తనలో శక్తి యుక్తులు ఉడిగిపోకుండా వుండగానే మళ్లీ పార్టీని అధికారంలోకి తేవాల్సి వుంది. అలా తెచ్చిన పార్టీని కొడుకు లోకేష్ నాయుడు చేతిలో వుంచాల్సి వుంది. ఈ రెండు బృహత్తర కార్యక్రమాలు 2019లోనే జరిగిపోతాయని ఆయన ఆశ పెట్టుకున్నారు. సర్వశక్తులు ఒడ్డారు. పసుపుకుంకుమ అంటూ డబ్బులు వెదజల్లారు. అయినా కోరిక నెరవేరలేదు. అధికార వారసుడు అవుతాడనుకున్న కొడుకు సైతం ఓటమి చవిచూసాడు.
ఇలాంటి నేపథ్యంలో మరో మూడు నాలుగేళ్ల పాటు చంద్రబాబు పోరాడాల్సి వుంది. ఆపై అధికారాన్ని సాధించి, పార్టీని మళ్లీ పటిష్టంగా నిలబెట్టాల్సి వుంది. అప్పుడు లోకేష్ నాయుడిని వారసుడిగా తీర్చి దిద్దాల్సి వుంది. ఇవన్నీ జరుగుతాయా? అన్నదే తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు అయినా, వ్యతిరేకించేవారు అయినా, ఆలోచించేది. కానీ ఇటీవల చంద్రబాబు స్ట్రాటజీలు సరిగ్గా వుండడం లేదు. పండడం లేదు. పార్టీ ప్రయోజనాలు, తెలుగు జనాల బహుళ ప్రయోజనాలు దృష్టిలో వుంచుకుంటే ఎలా వుండేదో? కేవలం అమరావతి అనే ఒక్క దాని కోసం చంద్రబాబు సర్వ శక్తులు ఒడ్డడం అన్నది మైనస్ అయిపోతోంది.
ఎంత తప్పిదం?
''..కావాలంటే మా పదవులు అన్నీ తీసేసుకోండి. కానీ అమరావతిని మాత్రం రాజధానిగా వదిలేయండి…''
ఇదీ చంద్రబాబు వేడుకోలు. అమరావతి ఎంపిక సరైనదా? కాదా? దాని వెనుక ఏం జరిగింది? ఎవరి ప్రయోజనాలు ఏమైనా వున్నాయా? లేదా? అన్నది పక్కన పెడదాం. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, విస్తృతంగా ఆలోచించాల్సి వుంది. ఒక్క అమరావతి ఇచ్చేయండి చాలు, మాకింకేం వద్దు అనే రీతిలో చంద్రబాబు మాట్లాడడం ఎంత మాత్రం సరికాదు. అసలు చంద్రబాబు ఓ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాల్సి వుంది
'…రాజధానిగా విశాఖ ఎందుకు పనికిరాదు…'' అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి. లేదూ, సింపుల్ గా '…రాజధానిగా విశాఖ పనికి రాదు' అని అయినా చెప్పాలి. నిజానికి చంద్రబాబు నిన్నటికి నిన్న ఇవ్వాల్సిన స్టేట్ మెంట్ పదవులు తీసుకుని అమరావతి వదిలేయమని చెప్పడం కాదు. మూడు రాజధానులు వద్దు అని కదా గగ్గోలు పెడుతున్నది. అందువల్ల కావాలంటే విశాఖనో, కర్నూలునో రాజధాని చేసుకోండి. అంతే తప్ప, మూడు రాజధానులు వద్దు అని చెప్పి వుండాల్సింది. అప్పుడు కచ్చితంగా ఉత్తరాంధ్ర, సీమ జనాలు చంద్రబాబును మెచ్చుకునేవారు.
కానీ ఇప్పుడేమయింది. సీమ నుంచి గెల్చిన పదవులు, ఉత్తరాంధ్ర నుంచి గెల్చిన పదవులు కూడా ఒక్క అమరావతి కోసం చంద్రబాబు ఒడ్డారు. అంటే అమరావతి కోసం ఈ రెండు ప్రాంతాల ప్రయోజనాలు వడ్డినట్లే కదా? ఇది ఎంత తప్పిదం? బాబుగారికి అనుకూల మీడియా దన్ను వుంది కాబట్టి సరిపోయింది. లేదూ అంటే ఇదే పాయింట్ ను సాగదీసి, నానా యాగీ చేసి వుండేవారు.
పాజిటివ్ ..నెగిటివ్
చంద్రబాబు వేడు కోలును పాజిటివ్ గా తీసుకుంటే ఓకె. లేదూ అంటే బాబుగారు ఇంత బేలగా ఎందుకు వేడుకుంటున్నారు. పదవులు అన్నీ వదిలేస్తాం అంటున్నారు. అమరావతి వెనుక ఏదో లేకపోతే బాబుగారు మరీ ఎందుకు ఇంతలా దిగిపోతారు అని జనం ఆలోచించడం మొదలుపెడితే..? నిజానికి ఏ అమరావతి అయితే తన కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా వుండిపోయేలా చేస్తుంది అనుకున్నారో? ఏ అమరావతి అయితే తెలుగుదేశం పార్టీని దఫ దఫాలుగా గెలిచేలా చేస్తుంది అనుకున్నారో, అదే అమరావతి ఇప్పుడు చంద్రబాబుకు గుదిబండగా మారుతోంది. కోర్టులో ఏమవుతుంది? అమరావతిని నిలబెట్టుకోవడంలో కొర్టుల ద్వారా బాబు విజయం సాధిస్తారా? సాధించరా? అన్నది పక్కన పెడితే, 2024 ఎన్నికలకు ఇది ఎలాగైనా ఇబ్బందికరమైన విషయమే.
బాబు అనుకూల మీడియా ఎంత టోన్ డౌన్ చేసినా, ఉత్తరాంధ్ర వాసులు ఎంత మెతకగా వున్నా, కొంతయినా సెంటిమెంట్ వర్క్ చేయడం పక్కా. ఇక రాయలసీమ అయితే, సమస్యే లేదు, తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే. ఎందుకంటే సీమ వాసులు, ఉత్తరాంధ్ర జనాల్లా మెతకగా వుండిపోరు. వాళ్లకు రావాల్సిన ఎయిమ్స్ ను తన్నుకుపోయి, వాళ్లకు వస్తుందనుకున్న హైకోర్టును తన్నుకుపోతే ఎలా వుంటుంది సెంటిమెంట్ లెవెల్ అన్నది ఊహించుకోవచ్చు.
చంద్రబాబు భయం అదేనా?
అసలు చంద్రబాబు అమరావతి కోసం ఎందుకు ఇంతలా కిందా మీదా అయిపోతున్నారు. నిజంగా ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందా? ఆ ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిన తన వారి కోసమే ఆయన ఇంత హడావుడి చేస్తున్నారా? అంటే కాదనే చెప్పాలి. అమరావతి అన్నది ఓ సామాజిక వర్గపు సెంటిమెంట్. ఇది వారి రాజధాని అని వారు అనుకుంటున్నది. పైకి జనాల రాజధాని అని అంటే అనొచ్చు. కానీ సెంటిమెంటల్ అది వారి సామ్రాజ్యం.
ఆ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ప్రారంభమైన పార్టీ తెలుగుదేశం. అందులో అణుమాత్రం సందేహం లేదు. ఎటొచ్చీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి అనే నినాదం తలకెత్తుకుని ఎన్టీఆర్ ముందుకు వెళ్లారు అధికారం సాధించారు. అయితే కీలక పగ్గాలు అన్నీ ఎవరి దగ్గర వుండాలో వారి దగ్గరే వుంటూ వస్తున్నాయి. అలాంటి పార్టీకి సామాజిక బంధాలతో పలువురు బయట నుంచి వివిధ స్థాయిల్లో ఎవరి మద్దతు వారు అందిస్తున్నారు . వీరందరికీ పార్టీ ముఖ్యం. పార్టీని ఎవరు లీడ్ చేస్తారు అన్నది కాదు. ఎవరు లీడ్ చేసినా పార్టీని నిలబెట్టాలి.
లక్ష్మీపార్వతి సీన్ లోకి ఎంటర్ అయ్యే వరకు పార్టీ నేత ఎన్టీఆర్ కు తిరుగులేదు. పార్టీలో తన హవా ఎక్కడ పోతుందో అని చంద్రబాబు తిరుగుబాటు చేసి వుండొచ్చు. కానీ ఆ తిరుగుబాబుకు మద్దతు ఇచ్చింది పార్టీని బలంగా నమ్ముకున్న, పార్టీకి బలంగా నిలిచిన సామాజిక వర్గమే. ఈ వర్గం ఆ టైమ్ లో బాబుకు అండగా వుండకపోతే, ఎన్టీఆర్ ను గద్దె దింపడం సాధ్యం అయ్యేది కాదు. తమ సామాజిక వర్గానికి ఐకాన్ లాంటి ఎన్టీఆర్ ను సైతం కిందకు దించేయడానికి వెనుకాడలేదు. ఎందుకు? తమకు ఎన్టీఆర్ కన్నా పార్టీ ముఖ్యం కనుక. పార్టీ బతికి వుండాలి. పార్టీ అధికారంలో వుండాలి కనుక, చంద్రబాబు వ్యూహానికి మద్దతు లభించింది.
ఇప్పుడు మళ్లీ అలాంటి సిట్యువేషన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వుంది. లోకేష్ సమర్థత మీద నీలినీడలు ముసురుకున్నాయి. కీలకమైన అమరావతి సంక్షోభంలో చిక్కుకుంది. ఇప్పుడు చంద్రబాబు తన సమర్థతను నిరూపించుకోవాలి. కనీసం పోరాడాలి. పోరాడినట్లు కనిపించాలి. పోరాడి తీరాలి. లేదూ అంటే పార్టీకి పునాది లాంటి సామాజిక వర్గం మరెవరు వున్నారా? ఈపనికి అని చూసే అవకాశం వుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు గట్టిగా మాట్లాడాలి. మాట్లాడుతున్నారు కూడా.
నిజానికి తన మాటల వల్ల ప్రయోజనం లేదని, పోరాటం అనేది జనంలో రాదని బాబుకు కూడా తెలుసు. ఏమైనా జరిగితే కోర్టు ద్వారా జరగాలి తప్ప, తమ పోరాట, హుంకరింపుల వల్ల కాదని ఆయనకు తెలియంది కాదు. కానీ తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి, పార్టీని ముందుకు నడిపించడానికి తగిన జవసత్వాలు తనలో వున్నాయని చంద్రబాబు చూపించాలి ఇప్పుడు. లేదూ అంటే జూనియర్ ఎన్టీఆర్ కాకపోయినా, మరెవరు వున్నారని ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఆ పరిస్థితి రాకూడదనే బాబుగారి ఆరాటం, పోరాటం అంతా. బాబుగారి వల్ల పని జరగడం లేదని ఆ సామాజిక వర్గం ఆలోచించడం ప్రారంభిస్తే లెక్కలు మారిపోతాయి. అది బాబుగారికి తెలియంది కాదు. ఆ వర్గం మద్దతు లేకుండా తను పార్టీని లీడ్ చేయలేననీ తెలుసు. అందుకే ఆ వర్గం మనోభావాలకు అనుగుణంగా ఆయన ముందుకు వెళ్లక తప్పదు.
జనం కలిసిరారని తెలిసే..
అమరావతి ఉద్యమానికి 13జిల్లాల ప్రజలు కలిసిరారు అని చంద్రబాబుకు తెలియంది కాదు. అలా వచ్చేవాళ్లే అయితే గత ఆరేడు నెలలుగా ఉద్యమం జరుగుతున్నపుడే వచ్చి వుండేవారు. ఉత్తరాంధ్రకు, సీమ వాసులకు అమరావతి గురించి పెద్దగా పట్టదు. మరీ రాజకీయాలు భయంకరంగా వంట పట్టించుకున్నవారు మాత్రమే ముందుకు వచ్చే అవకాశం వుంది. అదే సమయంలో ఉత్తరాంధ్ర, సీమ ప్రజా ప్రతినిధులు ఉద్యమించరు. అలా ఉద్యమిస్తే స్థానికంగా బ్యాడ్ అవుతారు. అందుకే చంద్రబాబు ఈ రాజీనామా, మిడ్ టెర్మ్ ఎన్నికలు లాంటి నినాదం తలకెత్తుకున్నారు.
ఇది చాలా సలువు. దమ్ముంటే రాజీనామా చేసేయండి అని డిమాండ్ చేయవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, తమ పార్టీ జనాల చేత రాజీనామా చేయించకుండా అవతల వారిని ముందుగా డిమాండ్ చేయడం. ధర్నా ఎవరు చేస్తారు? నిరసన ఎవరు వ్యక్తం చేస్తారు? అసెంబ్లీలో వాకౌట్ ఎవరు చేస్తారు? ప్రతిపక్షమే కానీ అధికారపక్షం కాదు కదా? మరి అయినా బాబుగారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అంటే, ఇంక అంతకన్నా చేసేది ఏమీ లేదు కనుక. ప్రజల్లో జగన్ ఎన్నికలు అంటే భయపడుతున్నాడు అన్న కలరింగ్ ఇవ్వొచ్చు కనుక.
ఎన్నికలు ఎవరికి భయం?
నిజానికి ఎన్నికలంటే ఎవరికి భయం? చంద్రబాబుకే. ఆయన హయాంలో ఎప్పుడూ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ధైర్యం చేయలేదు. గత అయిదేళ్లలో చేసింది అదే. ఏదో విధంగా నెట్టుకురావడం. ఒక్క ఎన్నిక చేయలేదు. ఉపఎన్నికలు అంటే ఆయన చేతిలో వుండవు కనక తప్పలేదు. ఏదో విధంగా గెలిచారు. అయినా కూడా లోకల్ బాడీ ఎన్నికలకు ధైర్యం చేయలేదు.
కానీ ఇప్పుడు ఆయన ఐడియా ఏమిటి? జగన్ వచ్చి ఏడాదే అయింది.ఆయన చేస్తున్నపనులు అన్నీ ఇంకా ఆరంభంలోనేవున్నాయి. ఇవన్నీ కాస్త గజిబిజిగా వున్నాయి. అందువల్ల ఇలాంటి టైమ్ లో ఎన్నికలు అంటే జనం తనవైపు మొగ్గు చూపుతారని. కానీ జగన్ ఏమన్నా అమాయకుడా? రాజకీయం తెలియని వెర్రివాడా? బాబుగారు డిమాండ్ చేయగానే, పౌరుషానికి పోయి సరే అనేయడానికి?
అయితే జనాల్లోకి జగన్ ఎన్నికల కోసం భయపడుతున్నారు అన్న టాక్ ను ఇంజెక్ట్ చేయాలన్నది స్ట్రాటజీ. కానీ దీని ప్రభావం ఎన్నాళ్లు వుంటుంది? మహా అయితే మూడు రోజులు తరువాత కొత్తది ఏదో మరోటి వస్తుంది. ఎన్నికలు ఇంకా మరో నాలుగేళ్లు వున్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ యాగీ చేసి ఫలితం లేదు. చేసాను, చేస్తున్నాను అని బాబుగారు అనిపించుకోవడం తప్ప.
బొమ్మ అయినా బొరుసు అయినా
అమరావతి వ్యవహారం కోర్టులో వుంది. తీర్పు ఏమి వస్తుంది అన్నది ఊహించాల్సింది, ఊహించగలిగేది కాదు. అందువల్ల ఆ విషయం పక్కన పెడితే, నాలుగేళ్ల తరువాత ఎన్నికలు వస్తే బాబుగారి పరిస్థితి ఏమిటి? అన్నది ఆలోచించాలి. ఆర్థికంగా అండదండలు అందించే వర్గం కష్టకాలంలో వుంది. నాయకులు చాలా మంది అటు ఇటు చెదిరిపోతున్నారు. పవన్ కళ్యాణ్-భాజపా జోడి ఎలాగూ వేరే వెళ్తుంది. చంద్రబాబును మోడీ దగ్గరకు రానివ్వరు. రానివ్వాలంటే ఏదో అద్భుతం జరగాలి. అంటే మళ్లీ త్రికోణం పోటీ.
అధికారంలో వున్న పార్టీ, ప్రజలకు పంచుతున్న పథకాలు, మూడు రాజధానులు ఇవన్నీ సహజంగానే జగన్ కు కాస్త ప్లస్ పాయింట్లు గా వుంటాయి. వివిధ రకాల ఓట్ బ్యాంకును పదిలం చేసుకుంటున్నారు. దీనిని కేవలం నెగిటివ్ ఓట్ అనే దాంతో బాబుగారు ఎదుర్కోవాలి. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ తన వాటా అంటూ రెడీగా వుంటారు. అందువల్ల 2024 నాటికి అయిదో దశాబ్దంలో అడుగుపెట్టే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు జవసత్వాలు అందించగలరా? లేదా? అన్నది పెద్ద సందేహం. ఎందుకంటే చంద్రబాబు ఇంకా పాత తరహా రాజకీయ వ్యూహాలను, తన మీడియాను నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. పార్టీ మొత్తం సీనియర్ల గుప్పిట్లోనే వుంది. కానీ ఇప్పుడు యువరక్తం జగన్ పార్టీలో వుంది. సోషల్ మీడియా అనేది సాంప్రదాయ మీడియాను ఎప్పడో పక్కకు తోసేసింది.
అందువల్ల చంద్రబాబు ఏ మేరకు విజయం సాధిస్తారు? తెలుగుదేశం పార్టీని పునరుజ్జీవింప చేస్తారు? అన్నది 2024 నాటికి కీలకమైన విషయం. ఈ విషయం మీదే లోకేష్ నాయుడి రాజకీయ భవితవ్యం కూడా ఆధారపడి వుంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఈ విషయంలో విఫలమైతే, తెలుగుదేశం పార్టీ చరిత్రలో రెండోసారి పార్టీ పగ్గాలు చేతులు మారే ప్రమాదం పొంచి వుంది అన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
చాణక్య
[email protected]