బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మానవతా దృక్పథంతో స్పందించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగులు లేక, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న డ్యాన్సర్లకు ఆమె ఆర్థిక సాయం అందించినట్టుగా సమాచారం. వంద మంది డ్యాన్సర్ల బ్యాంక్ అకౌంట్లలోకి కత్రినా డైరెక్టుగా డబ్బును ట్రాన్స్ ఫర్ చేసిందట. ఎంత నగదును ఆమె వారి అకౌంట్లలోకి బదిలీ చేసిందీ ప్రకటించలేదు కానీ, ఈ సాయం పట్ల వారు కృతజ్ఞతాభావంతో స్పందించారట.
కరోనా పరిస్థితుల్లో ఉపాధి పూర్తిగా కోల్పోయిన వారిలో సినీ రంగంలో పని చేస్తున్న కార్మికులు కూడా ఉన్నారు. వీరికి మరో పని చేతగాక, చేసే పని లేని పరిస్థితి. ప్రత్యేకించి ఎక్ స్ట్రాలు, డ్యాన్సర్లకు ఉపాధే లేదు. ఇప్పటికే షూటింగులు ఆగిపోయి దాదాపు ఐదు నెలలు కావొస్తున్నాయి. మరి కొన్నాళ్లు ఇదే పరిస్థితి ఉండవచ్చని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ కూలి పనిలా సినిమా రంగంలో పని చేసే కార్మికులు అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు.
ఈ క్రమంలో కొందరు సినిమా వాళ్లు స్పందిస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో కొందరు స్టార్ హీరో సినీరంగ కార్మికులకు ఆపన్న హస్తాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా తన వంతుగా ఎంతో కొంత సాయం చేసినట్టుంది.