దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల.. పెరుగుతున్న కేసుల సంఖ్యను చూడవద్దని, యాక్టివ్ కేసుల సంఖ్యను మాత్రమే పట్టించుకోవాలని ప్రకటించింది. కొత్తగా రిజిస్టర్ అవుతున్న కేసుల్లో రికవరీ కేసులు పోనూ మిగిలిన వాటిని యాక్టివ్ కేసులుగా పరిగణిస్తున్నారు.
ఒకవైపు దేశంలో దినవారీ కేసుల సంఖ్య కొత్త నంబర్ ను రీచ్ అవుతున్నాయి. అయితే ఊరట ఏమిటంటే.. రికవరీ కేసుల కూడా పెరుగుతూ ఉంది. ఇది కూడా దినవారీగా కొత్త హైట్స్ ను రీచ్ అవుతూ ఉంది. అయితే ఈ రెండూ సరిసమాన స్థాయిలో లేకుండా పోవడమే యాక్టివ్ కేసుల సంఖ్యను పెంచుతూ ఉంది.
దేశంలో దినవారీ కరోనా కేసుల సంఖ్య 40 వేల స్థాయికి చేరినప్పుడు ప్రతి రోజూ రికవరీ కేసుల సంఖ్య 25 వేల వరకూ ఉండేది. అప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ 15 వేల స్థాయిలో పెరిగాయి. ఆ తర్వాత రోజువారీ కరోనా కేసుల సంఖ్య 50 వేలను దాటింది. ఆ సమయానికి రికవరీ కేసుల సంఖ్య 40 వేల స్థాయిలో నిలిచింది. రోజువారీగా రిజిస్టర్ అయిన కేసుల సంఖ్య 50 నుంచి 60 వేల మధ్యలో ఉన్నప్పుడు రికవరీ కేసుల సంఖ్య కూడా 50 వేలకు చేరింది. అయితే ఇంతలోనే ప్రతి రోజూ రిజిస్టర్ అవుతున్న కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. 60 వేలను దాటిపోయింది.
గత రెండు రోజులుగా 60 వేల పై స్థాయిలో కరోనా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి దేశ వ్యాప్తంగా. ఇదే సమయంలో రికవరీ కేసుల సంఖ్య 50 వేల స్థాయిలో కొనసాగుతూ ఉంది. ఇలా ఇప్పుడు ప్రతిరోజూ కాస్త అటూ ఇటుగా 10 వేల స్థాయిలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ మేరకు హాస్పిటల్స్ పై కరోనా కేసుల లోడ్ పెరుగుతూ ఉంది.
కరోనా రికవరీకి ఇప్పుడు పది రోజుల సమయం పడుతోందనే లెక్కలు వేసినా.. పది రోజుల కిందట నమోదైన కేసుల సంఖ్య స్థాయిలో ఇప్పుడు రికవరీలు ఉంటున్నాయి. ఈ నిష్పత్తి ఇలానే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,19,088గా ఉంది. ఇప్పటి వరకూ కరోనాతో 42,518 మంది మరణించినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.