తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి అవకాశవాద రాజకీయాలకు హద్దెక్కడ? అనే అంశానికి అంత తేలికగా సమాధానం దొరకకపోవచ్చు. నిండా మునిగినవాడికి చలేమిటి అన్నట్టుగా.. ఇప్పటికే తన మాటలకు పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు నాయుడు, ఎంతకైనా దిగజారి మాట్లాడుతున్నట్టున్నారు.
ఇప్పటికే బోలెడన్ని యూటర్న్ లు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. అలాంటి రాజకీయంతో జనం చేత ఛీత్కారాలు పొందారు. కేవలం 23 అసెంబ్లీ సీట్లకు పరిమితం అయిపోయింది ఆయన పార్టీ. చంద్రబాబు చేసే దిక్కుమాలిన రాజకీయాలకు ఏపీ ప్రజలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అది. ఆయన మాటలతో, మాటల మార్పిడితో విసిగెత్తిన ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారు.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. తీరు మార్చుకోవాలి. అప్పుడే రాజకీయ నేతను మళ్లీ ప్రజలు విశ్వసించే అవకాశాలుంటాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అలాంటి అలవాటే తనకు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. మారేది లేదు, మాటలు మార్చడమే.. అన్నట్టుగా సాగుతోంది ఆయన తాజా రాజకీయం కూడా! అధికారంలో ఉన్నప్పుడు విపరీత స్థాయి అవకాశవాదాన్ని చూపించి చంద్రబాబు నాయుడు చిత్తయ్యారు.
అయితే ఇప్పుడు కూడా ఆయన అదే అవకాశవాదాన్నే చూపిస్తున్నారు. ఒకసారి తను రైటన్న విషయాన్ని, మరోసారి తనే తప్పు అనడం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పని. ఇప్పుడు మళ్లీ కథ మొదటకు వచ్చింది. తను తప్పన్న అంశాలను ఇప్పుడు మళ్లీ రైటు అంటున్నారాయన.
అందుకు ఒక చిన్న ఉదాహరణ.. అమరావతికి మోడీ ఇచ్చిన మట్టి గురించి! అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాన మంత్రి మోడీ మట్టి తెచ్చిచ్చారు. ఆ మట్టిని చంద్రబాబు నాయుడు కళ్లకు అద్ది తీసుకున్నారు. అయితే అప్పట్లోనే సామాన్య ప్రజలు ఆ విషయంలో పెదవి విరిచారు.
అమరావతి అభివృద్ధికి, ఏపీ నూతన రాజధానికి మోడీ ఏమైనా నిధుల సంచులు ఇస్తారనుకుంటే మట్టిగడ్డలు ఇచ్చారని సామాన్యులు నివ్వెరపోయారు. అయితే చంద్రబాబు నాయుడుకు మాత్రం అప్పుడు ఆ మట్టిగడ్డలు చాలా పవిత్రంగా కనిపించాయి. అప్పుడంతా మోడీతో దోస్తీ కావాలి ఆయనకు. అందుకే ఆ మట్టి చాలా పవిత్రంగా అనిపించింది. ఆ విషయాన్నే జనాలకు చెప్పి నమ్మించారు.
తీరా ఎన్నికల సమయానికి వచ్చే సరికి మళ్లీ రూటు మార్చారు. మోడీ తెచ్చిచ్చిన మట్టి గురించి తన ఇష్టానుసారం మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో ధర్నా చేస్తూ.. తన కచడాపచడా ఇంగ్లిష్ లో చంద్రబాబు నాయుడు అదే మట్టి గురించి మోడీని నిందించారు. అమరావతికి మట్టి కుండలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎన్నికల ముందు మోడీని నిందించారు చంద్రబాబు నాయుడు. అయితే ఆ మట్టి కథ ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉండటం, ఇప్పుడు దానికి మరో భాష్యం చెబుతూ ఉండటం చంద్రబాబు నాయుడి అవకాశవాదానికి పరాకాష్ట.
ఆ మట్టికి ఇప్పుడు మళ్లీ పవిత్రతను ఆపాదించారు చంద్రబాబు నాయుడు. మోడీ చాలా పవిత్రమైన మట్టి తెచ్చిచ్చారని, ఇప్పుడు జగన్ అమరావతికి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారనేది చంద్రబాబు నాయుడి తాజా ఆరోపణ! మోడీతో అవసరం ఉంటే ఆ మట్టి పవిత్రమైనది, మోడీతో అవసరం లేకపోతే ఆ మట్టి వ్యర్థమైనది! ఇదీ చంద్రబాబు నాయుడి భాష్యం.
ఇలాంటి మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు తన పార్టీని 23 సీట్లకు తీసుకొచ్చారు. ప్రతి అంశంలోనూ తన అవకాశవాదంతో మాట్లాడి, రాష్ట్ర ప్రయోజనాలకూ-తన రాజకీయ-ఆర్థిక ప్రయోజనాలకు ముడి పెట్టి చంద్రబాబు నాయుడు యూటర్న్ రాజకీయాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. ఒక మట్టి కుండ విషయంలోనే చంద్రబాబు నాయుడు ఇలా పదే పదే మాటలు మారుస్తూ.. ఆ మాటల ద్వారా ఏదో రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. అయితే ఈ రాజకీయాన్ని ప్రజలు ఎప్పుడో అసహ్యించుకున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోక చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా ఆ అసహ్యకరమైన రాజకీయాన్నే చేస్తున్నారు!