హీరో రానా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశాడు. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టుడియోస్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన వేదికలో కొద్దిసేపటి కిందట రానా-మిహీకాల వివాహం గ్రాండ్ గా జరిగింది.
అతి కొద్ది మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. రానా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్, సతీసమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యాడు. అల్లు అర్జున్ కూడా పెళ్లికి హాజరయ్యాడు. ఇక రానా కుటుంబ సభ్యులైన నాగచైతన్య, సమంత పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పూర్తిగా లాక్ డౌన్ నిబంధనల మేరకు ఈ పెళ్లిని జరిపించాడు రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు. పెళ్లికి వచ్చిన అతిథులంతా ఫొటోలకు తప్పిస్తే, మిగతా అన్ని చోట్ల మాస్కులతోనే కనిపించారు. వీలైనంత వరకు భౌతిక దూరం పాటించారు.
మే నెలలో తన ప్రేమ సంగతి బయటపెట్టాడు రానా. మిహీకా తన ప్రపోజల్ కు అంగీకరించిందంటూ తనతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇక అప్పట్నుంచి దశలవారీగా రానా పెళ్లికి సంబంధించిన విశేషాలు బయటకొస్తూనే ఉన్నాయి. రోకా ఫంక్షన్ నుంచి నిన్న జరిగిన మెహందీ ఫంక్షన్ వరకు ప్రతి అంశం హైలెట్ అయింది. ఎట్టకేలకు ఓ మంచి సుమూహూర్తాన ఈరోజు మిహీకా మెడలో తాళి కట్టాడు మన భళ్లాలదేవుడు.