విశాఖ పిలుస్తోంది…రా క‌దిలిరా

ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని విశాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని పిలుస్తోంది…రా క‌దిలి రా అని. అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇదే సంద‌ర్భంలో పరిపాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌,  న్యాయ…

ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని విశాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని పిలుస్తోంది…రా క‌దిలి రా అని. అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇదే సంద‌ర్భంలో పరిపాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌,  న్యాయ రాజ‌ధా నిగా క‌ర్నూలు, శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండొచ్చేమో అంటూ ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఆ ప్ర‌కంప‌న‌లు ఇంకా కొనసాగుతున్నాయి.

అనేక ప‌రిణామాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు మూడు రాజ‌ధానులతో పాటు సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లులు గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేసుకున్నాయి. క‌ర్నూలుకు హైకోర్టు త‌ర‌లింపు ఆల‌స్యం కావ‌చ్చంటున్నారు. కానీ విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధాని త‌ర‌లింపు ఏ మాత్రం ఆల‌స్యం అయ్యే అవ‌కాశం లేదంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం న్యాయ‌స్థానాల్లో ఉంది. రాజ‌ధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప‌రిధిలోనిద‌ని, దాంట్లో కేంద్రం జోక్యం ఉండ‌ద‌ని ఇటీవ‌ల మోడీ స‌ర్కార్ హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ఇదే అఫిడ‌విట్‌లో మ‌రో కీల‌క అంశాన్ని కూడా కేంద్రం ప్ర‌స్తావించింది. చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌పై రాజ్యాంగం లోని అధిక‌ర‌ణ 122 ప్ర‌కారం న్యాయ‌స్థానాలు విచార‌ణ జ‌ర‌ప‌డానికి వీల్లేద‌ని అఫిడ‌విట్‌లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రో వైపు రాజ‌ధాని త‌ర‌లింపుపై ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు హైకోర్టు య‌థాత‌థ స్థితిని కొన‌సాగిస్తూ ఈ నెల 4న ఉత్త‌ర్వులిచ్చింది. ఈ ఉత్త‌ర్వుల‌పై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

ఇవ‌న్నీ ఒక వైపు జ‌రుగుతుండ‌గా, మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని ఏర్పాటుకు చ‌కాచ‌కా పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని శంకుస్థాప‌న‌కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. న్యాయ‌స్థానంలో అడ్డంకులు తొల‌గిపోతే మ‌రో వారంలో విశాఖ స‌ముద్ర తీరాన స‌రికొత్త ఉషోద‌యం ఆవిష్కృతం కానుంది.

ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని శంకుస్థాప‌నలో ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగానైనా పాల్గొనాల‌ని ప్ర‌ధాని మోడీని ఆహ్వానించేందుకు అపాయింట్మెంట్ కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ర‌పు ప్ర‌ధాని కార్యాల‌యానికి లేఖ పెట్టారు. రాజ‌ధాని శంకుస్థాప‌నతో పాటు ఇళ్ల ప‌ట్టాల పంపిణీలో కూడా పాల్గొనాల్సిందిగా ప్ర‌ధానిని ఆహ్వానించేందుకు సీఎం జ‌గ‌న్ ఉత్సాహంగా ఉన్నారు. విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానికి శంకుస్థాప‌న చేసేందుకు ఎంత ఉవ్విళ్లూరుతున్న‌దో చెప్పేందుకు అపాయింట్‌మెంట్ కోరే లేఖ తెలియ‌జేస్తోంది. ఆ లేఖ‌లో ఏమున్న‌దంటే…

“ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవలే ప‌రిపాలనా వికేంద్రీక‌ర‌ణ‌, అన్ని ప్రాంతాల స‌మీకృతాభివృద్ధి చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్ర‌కారం ఇకపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు ఉంటాయి. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇది అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుల్లో ఒక‌టి. మూడు రాజ‌ధానుల‌కు శంకుస్థాప‌న చేసేందుకు ఈ నెల 16వ తేదీని మంచి ముహూర్తంగా నిర్ణ‌యించాం. ఈ రోజు పోతే  మ‌రో రెండు నెల‌ల పాటు మంచి ముహూర్తాలు లేవు. అందువ‌ల్ల వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌ధానితో అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తే ,  ముఖ్య‌మంత్రి ఆయ‌న్ను స్వ‌య‌గా క‌లిసి రెండు ప్రాజెక్టుల గురించి ప్ర‌ధానికి వివ‌రించి ఆహ్వానిస్తారు” అని పీఎంవోకు రాసిన లేఖ‌లో ఏపీ స‌ర్కార్ కోరింది.

ఈ నెల 16వ తేదీ కుద‌ర‌క‌పోతే మ‌రో రెండు నెల‌ల పాటు శుభ ముహూర్తాలు లేవ‌నే ఆందోళ‌న జ‌గ‌న్ స‌ర్కార్‌లో క‌నిపిస్తోంది. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వానికి న్యాయ‌స్థానాల్లో ఊర‌ట ల‌భించాల్సి ఉంది. ఒక‌వేళ ఇప్పుడు ఏవైనా కార‌ణాల‌తో ఆల‌స్య‌మైతే మాత్రం ద‌స‌రాకు త‌ప్ప‌క విశాఖ‌లో శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. మొత్తానికి జ‌గ‌న్ త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?