పవన్ కల్యాణ్.. ఓ వజ్రపు తునకలాంటి మాట అన్నారు. భాజపాకు, తెదేపాకు అమ్ముడుపోవాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. అవును నిజమే. పవన్ కల్యాణ్ కు అమ్ముడు పోవాల్సిన ఖర్మ లేదు. కానీ.. వాస్తవాల్ని బేరీజు వేసినప్పుడు ఆయనకు ఆ ఇద్దరినీ కాదని పోటీచేయగల దమ్ములేదు. సమర్థత కూడా లేదు. ఆ వాస్తవాన్ని ఆయన గుర్తించకుండా.. నాకు ఖర్మ లేదు.. అనే విషయాన్ని మాత్రమే ఆయన ప్రచారం చేసుకున్నంత కాలం.. ఆయనకు భవిష్యత్తు కూడా ఉండదు. ఆ సంగతి పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి.
రాజకీయంగా సభ పెట్టే సందర్భం దొరికితే చాలు. రంకెలు వేయడంలో పవన్ కల్యాణ్ ను మించిన వారు లేరు. కౌలుభరోసా యాత్ర పేరిట నాదెండ్లతో పాటు, తాను కూడా అప్పుడప్పుడూ ప్రజల్లోకి వెళుతున్న పవన్ కల్యాణ్ కు మళ్లీ కాస్త ఖాళీ దొరికింది. ఆదివారం కావడంతో షూటింగులు ఉండవు గనుక.. ఆయన ప్రజాక్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. యథారీతిగా మళ్లీ రంకెలు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
వైసీపీని అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత మీది అంటూ ప్రజలకు చెప్పారు. అదే సమయంలో.. వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు ఇవాళ్టికీ కట్టుబడి ఉన్నానని కూడా చెప్పారు.తనకు తెలుగుదేశానికి అమ్ముడుపోవాల్సిన ఖర్మ లేదని వివరణ ఇచ్చుకున్నారు.
ఆ ఖర్మ తనకు లేదని చెబుతున్న పవన్ కల్యాణ్.. తాను అసలు ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉన్నానని, తనకు ప్రజాదరణ నిండుగా ఉన్నదని నమ్ముతున్నారా? ప్రజలు తనను ఏ ఇతర నాయకుడి కంటె ఎక్కువగా నమ్ముతున్నారనే విశ్వాసం ఆయనకు ఉన్నదా? ఆ దమ్ముంటే ఆయన ప్రజాక్షేత్రంలో ఎన్ని స్థానాలకు పోటీచేయాలో తేల్చుకోవాలి.
వ్యతిరేక ఓటు చీలనివ్వనని అంటున్నారు సరే..కానీ.. అందుకని దేహీమని తెలుగుదేశం పాదాల వద్ద, చంద్రబాబునాయుడు పాదాల వద్ద మోకరిల్లవలసిన అవసరం లేదు కదా. వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకుంటున్నానే తప్ప నాకు బలం లేక కాదు.. నాకు ప్రజా బలం ఉంది.. కాబట్టి మీరు నేను చెరి సగం సీట్లు పంచుకుని పోటీచేద్దాం అని దమ్ముగా చెప్పగల తెగువ పవన్ కల్యాణ్ కు ఉందా? అని ప్రజలు సందేహిస్తున్నారు.
ఆ మాటకొస్తే.. 30 సీట్ల కోసం చంద్రబాబునాయుడును దేబిరిస్తూ.. అవి ఇస్తే చాలు అని అడుగుతున్న పవన్ కల్యాణ్.. ఒకవేళ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసినా సరే.. పొత్తులకు సిద్ధపడి సగం సీట్లు పవన్ కల్యాణ్ కు కేటాయిస్తే.. కనీసం ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ ఎజెంట్లను పూర్తిస్థాయిలో పెట్టుకోగల దమ్ము సమర్థత అయినా జనసేనకు ఉన్నాయా అనేది ప్రజల్లో సందేహం.
తనకు వేరే గతిలేక, ప్రజల్లో బలం లేక చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి సిద్ధపడుతున్న పవన్ కల్యాణ్.. అమ్ముడు పోవాల్సిన ఖర్మ తనకు లేదని చెప్పడం పెద్ద కామెడీగా ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.