నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు ఎన్నికలు జరపాలి. అంటే ఎన్నికల ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. కమ్యూనిస్టు పార్టీలకు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. అన్నాడీఎంకే వంటి కొన్ని పార్టీలకు కూడా ప్రధాన కార్యదర్శే పార్టీ సారధిగా ఉంటారు. సరే …అధ్యక్షుడైనా, ప్రధాన కార్యదర్శి అయినా ఎన్నికల ద్వారా ఎన్నుకోవాల్సిందే.
కానీ ప్రాంతీయ పార్టీల్లో పేరుకే ఎన్నికలు. పార్టీ స్థాపకుడే పార్టీ అధ్యక్షుడు/అధ్యక్షురాలు అవుతారు. ఎన్నికల్లో వారు తప్ప మరొకరు నామినేషన్ వేయరు. వారు తుది శ్వాస విడిచేవరకు వారే అధినేతగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోనూ ఇంతే. నెహ్రు -గాంధీ కుటుంబానికి చెందినవారు తప్ప మరొకరు పార్టీ సారధిగా ఉండటానికి అవకాశం లేదు.
మధ్యలో పొరపాటునో, అదృష్టం కొద్దో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఇంకెవరో గాంధీ కుటుంబానికి చెందని వారు అధ్యక్షులుగా ఉన్నారు. అది వేరే కథ. ఇదంతా చెప్పుకోవడానికి కారణమేమిటంటే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఈరోజు (ఆదివారం) షెడ్యూల్ విడుదలైంది. 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23 న పరిశీలన ఉంటుంది. 24 న ఉపసంహరణ ఉంటుంది. 25 న ఎన్నిక జరుగుతుంది. ఇది థియరీ మాత్రమే. ఇదే క్రమంలో ఎన్నిక జరుగుతుందని ఎవరైనా అనుకుంటే (ఎవరూ అనుకోరనుకోండి) వాళ్ళు పిచ్చోళ్ళ కింద లెక్కే. టీఆర్ఎస్ కు కేసీఆర్ కాకుండా మరొకరు అధ్యక్షుడు అవగలరా? అలా అవగల వ్యక్తి కేటీఆర్ మాత్రమే.
కానీ షెడ్యూల్ విడుదల కాగానే సీఎం కేసీఆర్ నామినేషన్ వేశారు. దీంతో వాస్తవానికి ఎన్నిక అయిపోయినట్లే లెక్క. పెద్దాయన నామినేషన్ వేశాక నామినేషన్ వేసే దమ్ము, ధైర్యం ఇంకెవరికైనా ఉంటాయా ? నామినేషన్ వేయడంతోనే కేసీఆర్ అధ్యక్షుడు అయిపోయినా అధికారికంగా 25 నే ప్రకటిస్తారు.
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ తరఫున పార్టీ అధ్యక్ష పదవికి మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ను మంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా, మంత్రులు బలపరిచారు.
ఈసారి కేసీఆర్ అధ్యక్షుడు అవుతారా? లేదా పూర్తిగా పార్టీ బాధ్యతలను కేటీఆర్ కు కట్టబెడతారా? అన్న దానిపై పార్టీలో కొంత కాలంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఆయన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. జిల్లాలు, మండలాల కార్యవర్గాల నియామకం పూర్తయింది.
తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ దాదాపు ఇరవై ఏళ్లుగా కేసీఆర్ నేతృత్వంలోనే రెండు ఎన్నికలకు వెళ్లింది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కూడా కేసీఆర్ పార్టీ పనులన్నీ తానే చూసుకునే వారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై దృష్టి పెట్టాల్సి రావడంతో కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. వచ్చే ఎన్నికలకు కూడా కేసీఆర్ నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళుతుంది. అదిప్పుడు తేలిపోయింది.
పార్టీ మొత్తం కేటీఆర్ కు అప్పగించాలని భావిస్తే ఈసారి టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్ వేసే అవకాశాలు ఉండకపోవచ్చని అనుకున్నారు. పార్టీ నేతలు ఎక్కువ మంది కేటీఆర్ ను అధ్యక్ష పదవిలో చూడాలనుకున్నారు. కానీ వారు అనుకున్న దానికి భిన్నంగా జరిగింది.
ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ కు అధ్యక్ష పదవి అప్పగిస్తారని ప్రచారం సాగినా చివరి క్షణంలో దక్కలేదు. దీంతో ఈ సారి మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉన్నా వివిధ కారణాలతో ప్రతి సారి వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.