టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనదైన ప్రత్యేక భాషలో చంద్రబాబును ఊచకోత కోశారు. గొల్లపూడిలో 'వైఎస్సార్ ఆసరా' సంబరాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఒక పగటి వేషగాడు, పిట్టలదొర అంటూ విమర్శించారు.
డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడన్నారు. డ్వాక్రా సంఘాలను ప్రవేశ పెట్టింది పీవీ నరసింహారావు హయాంలో అన్నారు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా రాబట్టిన పాలకుడు చంద్రబాబు అని మండిపడ్డారు.
డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్ర బాబు అని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తానిచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో రూ.13 వేల కోట్లను డ్వాక్రా మహిళలకు ఇచ్చారన్నారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడన్నారు. నేను, వంశీ ఫోన్లు చేసినా ఎత్తడన్నారు. తమ ఫోన్లు బ్లాక్‌లో పెట్టేశాడన్నారు. దేవినేని ఉమా ఓ చవటదద్దమ్మ అని విరుచుకుపడ్డారు.
ఉమా పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దని కోరారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కేసులుపెట్టాలని, అండగా ఉంటామని అధికారులకు భరోసా ఇచ్చారు. గుడివాడైనా, మైలవరమైనా.. మరెక్కడైనా వైఎస్సార్‌సీపీ జెండానే ఎగురుతుందని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.