ఇవి అంకెలు కావు, లెక్కలు అంతకంటే కావు. ఉద్యమానికి పిడికిలి బిగించిన విశాఖ ఉక్కు కార్మికుల దృఢ దీక్షకు అచ్చమైన కొలమానాలు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తామని నాడు చూచాయగా కేంద్రం నిర్ణయం ప్రకటిచిన క్రమంలో ఫిబ్రవరి 12న విశాఖలో ఉవ్వెత్తున కార్మిక లోకం ఎగిసిపడింది.
ఆ రోజు లగాయితీ ఈ రోజు వరకూ ఎక్కడా తగ్గకుండా ఉక్కు పోరాటానికి పదును పెడుతూనే ఉంది. అలా రోజులు నెలలు దాటిపోయాయి. ఈ మధ్యలో ఎన్నో రికార్డు స్థాయి ఉద్యమాలు కూడా జరిగాయి. ఇపుడు అతి ముఖ్య ఘట్టానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేరుకున్నారు. ఈ నెల 19న ఉక్కు పోరాటానికి కచ్చితంగా 250 రోజులు పూర్తి అవుతాయి.
దాంతో ఆ రోజును గుర్తుంచుకుంటూ ఒక మైలు రాయిగా భావిస్తూ ఏకంగా 25 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్షను వేలాది మందితో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద నిర్వహించబోతున్నారు. ఆనాటి దీక్షలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అలాగే అన్ని కార్మిక సంఘాలు భాగస్వామ్యం అవుతున్నారు. ఒక్క బీజేపీ తప్ప అందరూ ఉక్కు సంకల్పానికి తమ మద్దతుని ప్రకటించారు.
విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోమని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్ నరసింగరావు హెచ్చరించారు. 250 రోజుల నుంచి ఆందోళన సాగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ఇంతకు ఇంతా మరిన్ని రోజులు కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిన్స్తామని, తమ లక్ష్యాన్ని చేరుకునేవరకూ ఈ పోరు ఆగదని ఆయన స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి మలి విడత ఉక్కు పోరాట ఘట్టంలో 250 రోజు మైలు రాయిగానే భావిస్తున్నారు.