‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గట్టి షాక్ ఇచ్చారు. ఇందుకు హైదరాబాద్‌లో గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలాయ్’ వేదికైంది. మౌనంతోనే మంచు విష్ణుకు తన పవర్ ఏంటో పవన్‌కల్యాణ్ చూపారని ఆయన అభిమానులు చెబుతున్నారు. మౌనానికి మించిన తిరస్కారం మరొకటి లేదని, తాజాగా మంచు విష్ణుపై తమ లీడర్ ప్రయోగించారని పవన్ అభిమానులు, జన సైనికులు పోస్ట్‌లు పెడుతుండడం గమనార్హం.
ఇటీవల మెగాస్టార్ కుటుంబంపై మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్‌బాబు తమదైన శైలిలో పంచ్‌లు విసురుతున్న సంగతి తెలిసిందే. ‘మా’ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మెగా కుటుంబాన్ని బహిష్కరించడం టాలీవుడ్‌లో స్పష్టమైన విభజన రేఖ చూపింది. అలాగే ప్రమాణ స్వీకార వేడుకలో ‘మేము అంత మంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం’ అని బెదిరింపులు, భయపెట్టాలని చూస్తే… ఎవరూ భయపడరని మెగా కుటుంబంపై మోహన్‌బాబు పరోక్షంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేకెత్తించింది.
మోహన్‌బాబు వ్యాఖ్యలపై మెగా అభిమానులు రగిలిపోతున్నారు. దెబ్బకు దెబ్బ కొట్టాలనే ప్రతీకార జ్వాలతో మెగా అభిమానులు, జన సైనికులు రగిలిపోతున్నారు. బహుశా అభిమానుల మనసెరిగిన పవన్‌కల్యాణ్ అందుకు తగ్గట్టు వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘అలయ్ బలాయ్’ కార్యక్రమంలో తనను మంచు విష్ణు పలకరించినా…పవన్‌కల్యాణ్ కనీస మర్యాదకైనా ‘ఊ’ కొట్టిన పాపాన కూడా పోలేదు. అలాగే తన పక్కనే మంచు విష్ణు కూచున్నా…. ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి అన్నట్టుగా పవన్‌కల్యాణ్ అటు వైపు తలెత్తి కూడా చూడలేదు.
తనను ఇండస్ట్రీ వ్యక్తి కాదన్నట్టు సినిమా టికెట్ల విషయమై ప్రకాశ్‌రాజ్‌ను మంచు విష్ణు ప్రశ్నించడం కూడా పవన్ మనసులో బలమైన నెగెటివ్ ముద్ర వేసిందని చెబుతున్నారు. మంచు విష్ణు, మోహన్‌బాబులపై తన వ్యతిరేకతను ప్రదర్శించడానికి ‘అలయ్ బలాయ్’ కార్యక్రమాన్ని పవన్ సద్వినియోగం చేసుకున్నారని ఆయన అభిమానులు, జన సైనికులు అంటున్నారు.
సహజంగా తమ నాయకుడు ప్రత్యర్థులతో గౌరవంగా ఉంటారని, కానీ మంచు విష్ణు, మోహన్‌బాబు మాత్రం శత్రువుల్లా అవమానించడం వల్లే మౌనంతో తగిన బుద్ధి చెప్పాల్సి వచ్చిందని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక మంచు విష్ణు ట్విటర్ వేదికగా పవన్‌కల్యాణ్ ఉన్న వీడియోను షేర్ చేస్తూ, ఎవరో చెప్పాలని వ్యంగ్యంగా అడిగారని జనసైనికులు అంటున్నారు.