‘మా’ ఎన్నికలు జనానికి వినోదాన్ని, ఇండస్ట్రీకి తలనొప్పిని పంచుతున్నాయి. ఎన్నికలు ముగిసినా, రాద్ధాంతం మాత్రం కొనసాగుతూనే ఉంది. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్‌లోని ప్రతి డెవలప్‌మెంట్‌ను నెటిజన్లు జాగ్రత్తగా గమనిస్తూ తమ సృజనాత్మక కామెంట్స్‌తో తగిన ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ నూతన అధ్యక్షుడు విష్ణు అక్క, నటి మంచు లక్ష్మీప్రసన్నకు నెటిజన్లు కోపం తెప్పించారు. దీంతో ఆమె తెరపైకి రావాల్సి వచ్చింది.
‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో మంచు లక్ష్మి భావోద్వేగ ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
‘ఈ రోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం!! నా సోదరుడు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించనున్న కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు చేయనున్నావోనని చూస్తున్నాను’ అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.
అయితే, ‘మా’ అధ్యక్ష పదవేదో ముఖ్యమంత్రి లేదా ప్రధాని పదవి అన్న రేంజ్‌లో మంచు లక్ష్మి ఫీల్ అయ్యారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ‘మా’ అధ్యక్షుడు మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలడు?’ అంటూ మంచు లక్ష్మి ట్వీట్‌పై నెటిజన్లు పంచ్‌లు విసిరారు. నెటిజన్ల వ్యంగ్యాన్ని భరించలేక మంచు లక్ష్మి మరో ట్వీట్ చేయాల్సి వచ్చింది. ఈ దఫా నెటిజన్లపై కాసింత ఆగ్రహాన్ని ప్రదర్శించారామె.
‘ఇక ఆపండి!! ఎప్పుడు ఛాన్స్ వస్తుందా.. ఎవర్ని కామెంట్ చేద్దామా.. అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ఓ ప్రపంచం. కాబట్టి, నా ఉద్దేశం ప్రకారం మీరు అనుకునేలా ప్రపంచాన్ని మార్చడం కాదు.. మా అసోసియేషన్ ప్రపంచాన్ని మార్చడం.. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి’ అని ఆమె వివరణ ఇచ్చారు.
ఇదేదో ముందే వివరంగా ట్వీట్ చేసి వుంటే ఈ తలనొప్పులు తప్పేవి కదా అని నెటిజన్లు మళ్లీ తమదైన శైలిలో కామెంట్స్ చేయడం గమనార్హం. సోషల్ మీడియాను అదుపు చేయగలమా లక్ష్మి నెటిజన్లతో గొడవ పడడం అంటే, ప్రకాశ్‌ప్యానల్‌పై దాడి చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? అని మళ్లీ నెటిజన్లు తమ సృజనకు పదును పెట్టారు.