వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా అధికారం సాధించడం ఎలాగో తాను చూసుకుంటా అని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చెప్పేసారు. చెప్పేవాడికి వినేవాడు ఎలాగూ లోకువే. అందుకే అలా చెప్పేసి వుంటారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలంటే జనసేన కచ్చితంగా తెలుగుదేశంతో చేతులు కలిపి తీరాల్సిందే. అలా కాకుండా మరో మార్గం లేదు. మరి తెలుగుదేశంతో చేతులు కలిపితే పవన్ కళ్యాణ్ సిఎమ్ కావడం అన్నది నూటికి నూరు పాళ్లూ అసాధ్యం. బాబు, చినబాబు వుండగా పవన్ చేతికి పగ్గాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కానీ, దాని పునాదుల్లో వున్న సామాజిక వర్గం కానీ ఒప్పుకుంటాయని రాజకీయాల్లో ఎబిసిడి లు తెలియని వారు కూడా అనుకోరు.
మరి పవన్ ఎలా అధికారం సాధిస్తా అంటున్నారు. అంటే, పవన్ మదిలో అధికారంలో భాగస్వామ్యం అందుకోవడం అనే ఆలోచన బలంగా వుందని అర్థం అవుతోంది. బాబును అధికారంలోకి తీసుకువచ్చి, అందుకు ప్రతిగా ఎన్నో కొన్ని మంత్రి పదవులు అందుకోవడం అన్నది పవన్ ఆలోచన కావచ్చు. అదే అధికారం సాధించడం అనేదానికి నిర్వచనం కావచ్చు.
సరే, కాస్సేపు పవన్ ఆలోచన ఇదే అనుకుందాం. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే బాబు భాగస్వామ్యం అందిస్తారు? మహా అయితే పవన్ కు పాతిక సీట్లు మించి విదల్చడం అన్నది జరిగే పని అయితే కాదు. కేవలం పాతిక సీట్లు తీసుకుని బాబుగారి పల్లకీని పవన్ మోయాలి. అలా మోసినందుకు ప్రతిఫలంగా కాసిన్ని మంత్రి పదవులు తీసుకోవాలి. జస్ట్ లైక్…2014లో భాజపా తీసుకున్నట్లుగా.
సరే, ఇదే ఆలోచన అని కూడా అనుకుందాం. మరి ఇంతకీ పవన్ ముఖ్యమంత్రి ఎప్పటికి అవుతారు. 2029లోనా? అప్పుడు బాబును కాదని దూరంగా జరిగితే ఏం జరుగుతుంది, 2019లో భాజపా కామినేని శ్రీనివాస్ లాంటి వారు ఎలా పక్కకు తప్పుకున్నారో, జనసేన జనాలు కూడా అదే చేస్తారు. తన మనుషులను పట్టి వుంచుకోవడం అన్నది, బాబు నుంచి కాపాడుకోవడం అన్నది పవన్ కు సాధ్యమయ్యే పని ఎంత మాత్రం కాదు. అందువల్ల సోలో పోటీ అన్నది పవన్ కు ఎప్పటికీ సాధ్యం కాని వ్యవహారం.
ఇప్పుడు ప్రస్తుతానికి తన జనాలను కేరింతలు కొట్టించడం కోసం అధికారం..అధికార సాధన లాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు తప్ప..పవన్ గోల్ అల్టిమేట్ గా ఒకటే కనిపిస్తోంది. బాబుగారిని ఎలాగోలా అధికారంలోకి తేవడం. అంతే కదా?