అధోగతి ఆంధ్ర చంద్రబాబుకు ఎందుకో?

మెగా క్యాంప్ ను ఎన్ని మాటలన్నాఅననీయండి…కాపులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యానికి టాలీవుడ్ లొంగకూడదని తెరవెనుక మెగా క్యాంప్ ఎన్ని ఎత్తుగడలైనా వేయనీయండి…కమ్మవారు కాపుల కోసం స్నేహ హస్తం…

మెగా క్యాంప్ ను ఎన్ని మాటలన్నాఅననీయండి…కాపులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యానికి టాలీవుడ్ లొంగకూడదని తెరవెనుక మెగా క్యాంప్ ఎన్ని ఎత్తుగడలైనా వేయనీయండి…కమ్మవారు కాపుల కోసం స్నేహ హస్తం చాచాల్సిందే. అలా చేయడం లేదంటే అది జగన్ కుట్ర. 

ఎందుకంటే జగన్ ను ఓడించాలంటే కమ్మవారికి శక్తి చాలదు. వారికి కాపుల అండ కావాల్సిందే.కాపు కాయాల్సిందే. అలా అయితేనే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కమ్మ సామాజిక వర్గం మళ్లీ ఆంధ్రలో అధికారం చెలాయించగలదు. అమరావతిలో భూముల వ్యాపారం చేసుకోగలదేమో. అలా కాకుండా కమ్మ-కాపు ఎడమొహం పెడమొహం అయితే చంద్రబాబుకు అధికారం దక్కదు.

ఈ ధర్మసూక్ష్మం తెలిసినవ్యక్తి ఎబిఎన్ ఆర్కే…తెలియకుండా భోళాగా విష్ణుకు మద్దతు ఇచ్చి కమ్మ-కాపుల మధ్య దూరం పెరిగేలా చేసింది నందమూరి బాలకృష్ణ.

వెనకటికి సామెత వుంది. మొగుడు కొట్టాడని కాదు. తోటికోడలు దెప్పిందని బాధంట. అలా వుంది వ్యవహారం. మెగా వర్గం చాలా తెలివిగా ముందుగా ప్రకాష్ రాజ్ అనే కాయిన్ ను నప్పింది. అక్కడి నుంచి కాపులను చాలా మందిని మెల్లగా ఓ దగ్గరకు చేరవేయగలిగారు. ఇది సహజంగానే ఇండస్ట్రీలోని కమ్మవారికి మండించింది. అక్కడ వారికి మరే రాజకీయాలు లేవు. 

చిరకాలంగా ఇండస్ట్రీ మీద తమకు వున్నపట్టు నిలబెట్టుకోవాలన్నదే. అక్కడ చంద్రబాబు-పవన్ కళ్యాణ్ లోపాయకారీ పొత్తు అన్నది ఆలోచనలో లేదు. చిరంజీవి ఇంట్లో సమావేశానికి కొందరిని పిలిచి, మరి కొందరిని పిలవలేదన్నదే వుంది. అంతే కానీ బాలకృష్ణ బాహాటంగా విష్ణుకు మద్దతు ఇస్తే కాపులు బాధపడతారని, దాని వల్ల తెలుగుదేశం పార్టీ కి అధికారం అందడం సమస్య అవుతుందనే ఆలోచన లేదు. 

ఆ మాటకు వస్తే ఇలా ఎవ్వరూ ఆలోచించ లేదు. ఎందకుంటే వారికి ఆర్కే అంతటి దూర దృష్టి లేదు. అర్జంట్ గా చంద్రబాబును ఎలాగైనా సిఎమ్ ను చేయాలన్నా ఆలోచనా లేదు. ఉన్న ఆలోచన అల్లా విష్ణును ఎలా గెలిపించుకోవాలి అనే. అదే ఆలోచించారు.అదే చేసారు. గెలిచారు.

అనుకోకుండా సంభవించిన పరిణామం ఇది. కానీ ఇది పోయి పోయి, పవన్-చంద్రబాబు పొత్తుకు ఎక్కడ విఘాతం కల్పిస్తుందో అన్నదే భయమంతా. నిజానికి పవన్ – చంద్రబాబు ల మధ్య కొద్ది నెలల క్రితమే ఖరారు అయిపోయింది. అక్కడి నుంచే పవన్ ను మీడియాలో లేపడం మొదలయింది. లోకేష్ సర్దు మణగడం మొదలయింది. పవన్-బాబు పొత్తు పక్కా అని తెలుగుదేశం వర్గాలు ఫుల్ ఖుషీగా చెప్పుకోవడం మొదలయిపోయింది.

చంద్రబాబు రెగ్యులర్ స్ట్రాటజీ ప్రకారం తెలుగుదేశంలో వున్న కొంతమందిని జనసేనలోకి పంపే కార్యక్రమం కూడా రూపు దిద్దుకోవడం మొదలయింది. కానీ అంతా బాగానే వుంది. పైపైన పెద్దలంతా ఒక్కటైపోయినా, జనం మాత్రం ఇంకా కొట్టుకుంటారేమో అన్న అనుమానం వుంది. ఆ అనుమానానికి ఈ మా ఎన్నికలు మరింత బలం చేకూర్చుకుతున్నాయి. అందుకే బాధ ఆగడం లేదు.

సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆర్కే కు తెలియని రాజకీయాలు, ఈక్వేషన్లు లేవు. కాపులు ఎందుకు అధికారం అందుకోలేకపోతున్నారు?  ప్రతి జిల్లాలో వారికి ఒకటి రెండు సామాజిక వర్గాలతో ఎన్నో దశాబ్దాలుగా వైరుధ్యం వుండడం వల్ల.  శ్రీకాకుళం జిల్లాలో కాళింగులతో, విజయనగరం జిల్లాలో కొప్పల వెలమలతో, విశాఖ జిల్లాలో గవర్లతో కాపులకు సయోధ్య వుందా?  ఈస్ట్ గోదావరిలో కమ్మవారితో, వెస్ట్ గోదావరిలో క్షత్రియులతో, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో కమ్మవారితో సయోధ్య వుందా? 

అంత సయోధ్య వుంటే రాధా, రంగాల జీవితాలు అంత అర్థాంతరంగా ఎందుకు ముగుస్తాయి? సరే ఈ వ్యవహారం అలా వుంటే అన్ని జిల్లాల్లో కూడా కాపులకు ఇంకా పలు సామాజిక వైరుధ్యాలు వుండనే వున్నాయి. పత్రికల్లో అగ్రవర్ణాలు, బడుగు వర్గాల గొడవలు అని రాయడం కామన్. రిజర్వేషన్ కావాలి..అన్న సంగతి అలా వుంచితే ఆ వార్తల్లో చాలా చోట్ల అగ్రవర్ణం అన్నది కాపులే అన్న సంగతి జనాలకు తెలిసిందే. 

ఇలాంటి నేపథ్యంలో కాపులను-కమ్మలను ఓ చోట చేర్చడం, ఓటు బదిలీ అన్నది సాధించడం అంత సులువు కాదు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం కాపులు అధికారం అనుభవిస్తున్నారు. గవర్లు అధికారానికి దూరంగా మౌనంగా వున్నారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ తో పవన్ పొత్తు పెట్టుకుంటారు. గవర్లకు కాపుల ఓట్లు బదిలీ అవుతాయా? 

గత ఎన్నికల్లో జనసేన -టీడీపీ పొత్తు లేదని ఎలా అనగలం? గాజువాకలో పవన్ గెలుపు కోసం చంద్రబాబు తెరవెనుక వ్యూహ రచన చేసారు కదా? కానీ ఏమయింది? ఓటు బదిలీ సాధ్యం కాలేదేం? భీమవరంలో పవన్ తన పోలింగ్ మేనేజ్ మెంట్ అంతా క్షత్రియుల చేతిలో పెట్టారు. మరి ఓటు బదిలీ జరగలేదేం? 

పెళ్లాం వేరే వాడితో వెళ్లిపోతుందని తెలిసినా మౌనంగా భరిస్తున్న మొగుడి మాదిరిగా వుంది భాజపా వ్యవహారం. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు వెళ్లేది తెలుగుదేశంతో కలిసే అని రాజకీయ వర్గాలు అన్నీ బలంగా నమ్ముతున్నాయి. ఆ మేరకు ఒప్పందం కుదిరిపోయిందని వార్తలు వున్నాయి. అయినా భాజపా మాత్రం ఏమీ అనలేకపోతోంది. ఏమైనా అంటే అలా వెళ్లిపోవడానికి తామే రూటు వేసినట్లు అవుతుందని కక్కలేక మింగలేక వుంది.

జనసేన-తేదేపా కలిస్తే సరిపోదు. మోడీ అండ వుండాలి. అంటే కేంద్రం అండ వుండాలి. అలా అయితేనే జగన్ ను లోపలకు తోసేయచ్చు అన్నది మరో బాధ. కానీ దానికి ఆదానీ లాంటి వాళ్లు అడ్డం పడ్డారన్నది ఇంకో బాధ. అందుకే ఇప్పుడు ముందు వాళ్లను టార్గెట్ చేయాలి. ఆదానీని బదనామ్ చేయాలి. ఆ ప్రయత్నమూ యధాశక్తి చేస్తున్నారు.

అంటే మిత్రలాభం, మిత్ర బేధం అనే రెండు వ్యవహారాలు ఒకేసారి అమలు చేస్తున్నారు. అయినా కూడా నమ్మకం చాలడం లేదు. జనం ఎక్కడ ఇంకా జగన్ వైపే వున్నారేమో అన్న అనుమానం. దానికీ విరుగుడు వ్యూహం వుంది. జగన్ అప్పులుచేస్తున్నారు. ఆంధ్ర అధోగతిలోకి పోయింది. అల్లా..జీసస్, వెంకన్న ముగ్గురు కలిసి ఓ ముఖ్యమంత్రిని తయారు చేసినా ఇక ఆంధ్ర ను బాగు చేయలేరు. 

నిజమే అనుకుందాం…కానీ మరి అలాంటి అస్సలు భగవంతుడు కూడా బాగు చేయలేని ఆంధ్ర ఎందుకు కావాలి? చంద్రబాబకు? తెలుగుదేశం పార్టీకి? దీనికి జవాబు చెబితే చాలు.