‘మా’ గొప్పతనం మేడిపండును తలపిస్తోంది. స్వయంగా ‘మా’ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖుల అభిప్రాయాలు వింటుంటే ఈ అభిప్రాయం కలుగుతోందని నెటిజన్లు అంటున్నారు.
సినీ రంగానికి సంబంధించి సంస్థ కావడంతో సహజంగానే ‘మా’ అందర్నీ ఆకర్షిస్తోంది. ఇంతకాలం ‘మా’ ఎన్నికలు సాఫీగా ఏకగ్రీవంగా సాగిపోతూ వుండడంతో అందులోని లోపాలు బయటకు రాలేదు.
ఇప్పుడు ప్రకాశ్‌రాజ్ అనే విలక్షణ నటుడు ‘మా’ ఎన్నికల్లో ఎంటర్ కావడంతో, ‘మా’ స్వభావం బయటపడింది, మున్ముందు మరింత పడనుంది. ‘మా’ సంకుచిత భావజాలాన్ని నిరసిస్తూ ఒకప్పుడు ఆ సంస్థకు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నాగబాబు ఏకంగా సభ్యత్వాన్ని వదులుకోవడం చిన్న విషయం కాదు. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందని రాంగోపాల్‌వర్మ సెటైర్ విసిరారు. ‘మా’ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే సినీ పెద్దలకే తమ సంస్థ ఒక్కోలా కనిపించడం విశేషం.
ఇందులో భాగంగా వర్మకు సర్కస్‌ని గుర్తుకు తేవడంపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ… సోషల్ మీడియాలో ‘మా’ వివాదాన్ని సజీవంగా ఉంచుతుండడం గమనార్హం.