“మా” ఎన్నికల వివాదం రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదం కాస్త జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఒకవైపు “మా” ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ప్రత్యర్థులు దౌర్జన్యానికి తెగబడ్డారని, ఆ దృశ్యాలు సీసీ పుటేజీలో నిక్షిప్తమయ్యాయని, దాన్ని ఇవ్వాలంటూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్‌రాజ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీసీ పుటేజీ విషయమై తాజాగా ట్విస్ట్ చర్చకు తెరలేపింది.
సీసీ పుటేజీ ఇవ్వకపోగా, దాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు సీజ్ చేయడం కొసమెరుపు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదైన కృష్ణమోహన్ సీసీ పుటేజీపై ఇచ్చిన వివరణ ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు అనుమానాలు పెంచింది. ఎన్నికల అధికారిగా తన బాధ్యతల్ని నిర్వర్తించానని, ఇప్పుడు సీసీ పుటేజీని ఇవ్వాలంటే నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని ఆయన సెలవిచ్చారు.
తనకు తానుగా సీసీ పుటేజీ ఇవ్వడం సాధ్యం కాదని, అది కోర్టు డైరెక్షన్‌లో ఇవ్వాలా? లేక మరేదైనా విధానం ఉందా? అని తెలుసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన సెలవిచ్చారు.
ఈ నేపథ్యంలో సీసీ పుటేజీని భద్రపరిచిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లోని గదిని పోలీసులు సీజ్ చేశారు. ఆ గదికి తాళాలు వేసి తమ కంట్రోల్‌లోకి పోలీసులు తీసుకున్నారు. ఇది ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు షాక్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే అడగ్గానే సీసీ పుటేజీ ఇస్తారని ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు అమాయకంగా ఆశించారు. అది కాస్త యూ టర్న్ తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం న్యాయస్థానం చేరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సీసీ పుటేజీపై ఎలాంటి డైరెక్షన్ వస్తుందనే చర్చ నడుస్తోంది. మొత్తానికి మా ఎన్నికల కథ ఇప్పట్లో కంచికి చేరేలా లేదు.