మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసినా, అది సృష్టించిన వివాదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఏదైతే జరగకూడదని అంతా భావించారో ఇప్పుడు అదే జరగబోతోంది. ఇప్పుడీ వివాదంలోకి పోలీసులు ఎంటరయ్యారు. త్వరలోనే కోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
''మా'' ఎన్నికల టైమ్ లో లోపల గొడవ జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది సభ్యుల చొక్కాలు కూడా చిరిగాయి. దీనికి సంబంధించి బయటకొచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఆరోపణలు కూడా చేశారు. మరిన్ని రుజువుల కోసం ప్రకాష్ రాజ్, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు లేఖ కూడా రాశారు. సీసీటీవీ ఫూటేజ్ కావాలని కోరారు.
అయితే ప్రకాష్ రాజ్ విజ్ఞప్తిని కృష్ణమోహన్ ప్రస్తుతానికి తిరస్కరించారు. తను నిబంధనలు మొత్తం చదువుతానని, అలా ఇవ్వొచ్చా, ఇవ్వకూడదా అనే అంశంపై ఓ స్పష్టతకు రావాల్సి ఉందన్నారాయన. ప్రకాష్ రాజ్ అడిగినట్టు ఇప్పుడు తను ఫూటేజ్ ఇస్తే, భవిష్యత్తులో చాలామంది సభ్యులు తమకు కూడా ఫూటేజ్ కావాలని అడిగే అవకాశం ఉందన్నారు.
ఒకవేళ, ఇప్పటికిప్పుడు సీసీటీవీ ఫూటేజ్ కావాలనుకుంటే కోర్టుకు వెళ్లాలని ప్రకాష్ రాజ్ కు సూచించారు కృష్ణమోహన్. కోర్టు ఆదేశిస్తే, తను ఫూటేజ్ ను కోర్టుకు సమర్పిస్తానని, కోర్టు నుంచి ప్రకాష్ రాజ్ దాన్ని తీసుకోవచ్చని చెప్పారు.
ఇప్పట్లో తన చేతికి సీసీటీవీ విజువల్స్ రావనే విషయం ప్రకాష్ రాజ్ కు అర్థమైపోయింది. దీంతో ఆయన వెంటనే జూబ్లీహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు. సీసీటీవీ ఫూటేజ్ ను కొంతమంది మాయం చేసే ప్రమాదం ఉందని ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లోని సర్వర్ రూమ్ కు తాళం వేశారు.
తాజా పరిణామాలతో “మా” వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడీ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కక తప్పేలా లేదు. మరోవైపు బ్యాలెట్ పేపర్లను కౌంటింగ్ రోజు రాత్రి కృష్ణమోహన్ తన ఇంటికి తీసుకెళ్లారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రకాష్ రాజ్, విష్ణు సమక్షంలో తను బ్యాలెట్ పేపర్లను పెట్టెలో పెట్టి తాళం వేశానని, ఆ టైమ్ లో తన చేతిలో ఉన్నవి డమ్మీ బ్యాలెట్ పత్రాలని ఆయన వివరించారు.