రెన్నెళ్ల కిందట తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు అనంతపురం పర్యటన హాట్ టాపిక్ గా నిలిచింది. ట్రావెల్ బస్సుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినందుకు గానూ తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు అరెస్టు చేయగా.. లోకేష్ ఆగ్రహించారు!
తెలుగుదేశం నేతలన్నాకా.. ఆ మాత్రం అక్రమ పద్ధతిలో బస్సులు అమ్ముకోకూడదా? పదుల కోట్ల రూపాయలు సంపాదించుకోకూడదా? ప్రజల ప్రాణాలకు ప్రమాదం తీసుకురాకూడదా? అన్నట్టుగా తెలుగుదేశం నేత నారా లోకేష్ బాబు ఆ అరెస్టులను తీవ్రంగా ఖండించారు! జేసీ ట్రావెల్స్ ఒక అక్రమాల పుట్ట అని, దాన్ని తవ్వి తీస్తే దానికి హద్దే ఉండదని, పాలెం బస్సు దుర్ఘటన గురించి అప్పట్లో సరైన విచారణ జరగలేదనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఒక దశలో జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ.. ట్రావెల్స్ బస్సులను ఎవ్వరూ రూల్స్ ప్రకారం నడపలేరని తేల్చారు!
ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించి.. రవాణా శాఖ రూల్స్ ప్రకారం బస్సులు నడపటం సాధ్యం కాదు అని అంటూ, వందల బస్సులకు యాజమానికి ఉన్న వ్యక్తిని ఏమనాలి? జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము బస్సుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడిన విషయం రుజువు అయినా మహా అంటే తమకు ఫైన్ పడుతుందని కూడా తేల్చారు ఒక ఇంటర్వ్యూలో! వాళ్లే అలా అంటుంటే.. లోకేష్, చంద్రబాబులు మాత్రం వాళ్లను ఇంకా కవర్ చేయడానికి పూనుకోవడం గమనార్హం.
జేసీ ఫ్యామిలీని పరామర్శించడానికి అంటూ వెళ్లినప్పుడు లోకేష్ డైనింగ్ టేబుల్ వద్ద దిగిన ఫొటో అప్పట్లో వైరల్ అయ్యింది. ఆ ఫొటో చూస్తే లోకేష్ ఏదో విందుకు వెళ్లినట్టుగా ఉంది కానీ, పరామర్శించడానికి వెళ్లినట్టుగా లేదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించసాగారు.
ఇక తాజాగా ప్రభాకర్ రెడ్డి మరోసారి అరెస్టయ్యారు. తన అహంభావపు ధోరణికి ఆయన ఇలా మూల్యం చెల్లించుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో లోకేష్ మరోసారి జేసీ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్తున్నారో లేదో మరి!