జనసేనాని పవన్‌కల్యాణ్ నేల విడిచి సాము చేస్తున్నారు. వైసీపీపై అదే ద్వేషం. వారానికో సారి ఏదో మీటింగ్ పెట్టడం, ఆ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పవన్‌కు పరిపాటిగా మారింది. విమర్శలు చేయడమే లక్ష్యమైతే, దానికి ప్రతి వారం ప్రత్యేకంగా సభలు, సమావేశాలు పెట్టుకోవడం దేనికో అర్థం కాదు.
తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లె మండలం ధూళిపాళ్లలో జనసైన కౌలురైతు భరోసా సభ జరిగింది. ఈ సభలో పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని గెలవనివ్వనని వార్నింగ్‌లు ఇస్తున్న పవన్‌కల్యాణ్… తనను ఎవరో గెలిపిస్తారో చూసుకుంటే మంచిదని వైసీపీ ఘాటు రిప్లై ఇస్తోంది.
గత ఎన్నికల్లో జనసేనకు ఇంత బలం వుండి కూడా విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ గెలిచిందన్నారు. 2014లో మాదిరిగా కలిసి పోటీ చేసి వుంటే… ఒకవేళ వైసీపీ గెలిచినా అసెంబ్లీలో బలమైన గొంతు వినిపించడానికి అవకాశం వుండేదన్నారు. 2024లో ప్రభుత్వం మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవట్లేదన్నారు. గెలవనివ్వమని తేల్చి చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత తనదే అన్నారు. ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పానన్నారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి వున్నట్టు ఆయన తెలిపారు.
బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు పట్టలేదని పవన్‌కల్యాణ్ అన్నారు. వైసీపీ అత్యధికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పెట్టుకుని చిల్లర చేష్టలు చేస్తోందన్నారు. పనికొచ్చే పని ఒక్కటీ చేయడం లేదన్నారు. ఏమన్నా మాట్లాడితే వారానికి ఒక్కసారి వస్తావని తనను అంటారని విమర్శిస్తుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరత్వం కావాలన్నారు. రౌడీయిజం తగ్గాలని కోరారు.
మీలాగా పెన్షన్ డబ్బును కాజేసే నీచత్వం తనకు లేదన్నారు. మీ అందరి గుండెచప్పుడు బలంగా వుంటే ముఖ్యమంత్రి అవుతా అన్నారు. వైసీపీతో తనకు గొడవ లేదన్నారు. సమర్థవంతంగా పరిపాలన చేసి వుంటే ఈ రోజు గొడవ చేసి వుండేవాన్ని కాదన్నారు. రైతాంగానికి గిట్టబాటు ధరలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వుంటే ఇవాళ రోడ్డు మీదకు వచ్చేవాన్ని కాదన్నారు. కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్యగోచరంగా, అంధకారంగా మారుతుందని ఎంతో బాధతో చెబుతున్నానన్నారు. మీరు కోరుకుంటేనే తాను ముఖ్యమంత్రి అవుతానన్నారు. రాజకీయ క్రీడలో ఓటు చీలనివ్వకుండా ఎలా ఆడాలో మనముందు పెద్ద లక్ష్యం ఉందన్నారు.
పవన్ ప్రగల్భాలు బాగా వున్నాయి. వైసీపీని గెలవనివ్వనంటున్న పవన్‌కల్యాణ్…. ఇంతకూ తను గెలుస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ తాను ఎక్కడి నుంచి బరిలో దిగుతారో చెప్పే దమ్ము, ధైర్యం పవన్‌కు ఉన్నాయా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పవన్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదని వెటకరిస్తున్నారు. వ్యక్తిగతంగా తన గెలుపునకే భరోసా లేని నాయకుడు… వైసీపీని ఏదేదో చేస్తానని చెప్పడం విడ్డూరంగా వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు మాని, గట్టి మేలు తలపెట్టే పని చేయడం మంచిదని పవన్‌కు హితవు చెబుతున్నారు.