ఒక యోగి రాజ‌కీయ వ్యూహం

ది రియ‌ల్ యోగి ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిజ‌మైన యోగి అయిన విష‌యం తెలిసిందే. ఈ రాజ‌కీయ యోగి జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు…

ది రియ‌ల్ యోగి ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిజ‌మైన యోగి అయిన విష‌యం తెలిసిందే. ఈ రాజ‌కీయ యోగి జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. తాను ముందుండి జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకొస్తాన‌ని, న‌మ్మాల‌ని వేడుకుంటున్నారు. యోగి నుంచి వ‌చ్చిన మాట‌ల్ని వింటే న‌వ్వుకోకుండా ఉండ‌లేరు.

ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లె మండ‌లం ధూళిపాళ్ల‌లో జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ఆదివారం కౌలురైతు భ‌రోసా స‌భ జ‌రిగింది. రైతుల‌కు ఎవ‌రు మంచి చేసినా త‌ప్ప‌క అభినందించాలి. ఈ విష‌యంలో ప‌వ‌న్‌ను ప్ర‌శంసించి తీరాల్సిందే. కౌలురైతు స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ వైసీపీ వ్య‌తిరేక ఓట్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చీల‌నివ్వ‌న‌ని మ‌రోసారి శ‌ప‌థం చేశారు. గ‌తంలో ఇప్ప‌టంలో వైసీపీ వ్య‌తిరేక ఓట్ల‌పై ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి వుంటాన‌ని పున‌రుద్ఘాటించారు.  

వారాహి మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోడ్ల‌పై తిరుగుతాన‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రు ఆపుతారో చూస్తాన‌ని అన్నారు. వారాహిని ఆపండి…నేను ఏంటో చూపిస్తా అని ఆయ‌న హెచ్చ‌రించారు. మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌న్న‌ట్టే, శ‌ప‌థాల‌కు హెచ్చ‌రిక‌ల‌కు ప్ర‌త్య‌ర్థి ప్ర‌భుత్వాలు కూలిపోవ‌ని ప‌వ‌న్ గ్ర‌హించాలి. ఎందుకంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యూహం ఏంటో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజానికి తెలిసిపోయింది. టీడీపీని గెలిపించి, చంద్ర‌బాబును సీఎం పీఠంపై కూచోపెట్ట‌డ‌మే ప‌వ‌న్ ఎజెండా అని ఏపీలోని చిన్న‌పిల్ల‌ల్ని అడిగినా చెబుతారు.

ఇదేదో ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్య‌మ‌ని, జ‌న‌సేన‌ను అధికారం వైపు న‌డిపించేందుకు త‌న వ‌ద్ద గొప్ప వ్యూహ‌మేదో ఉన్న‌ట్టు ప‌వ‌న్ బిల్డ‌ప్‌లు ఇవ్వ‌డం సినిమాను త‌ల‌పిస్తోంది. ఇదే సినిమాలో అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను పొలిటిక‌ల్ హీరోగా పెట్టి, డైరెక్ట‌ర్ ఏదో ఒక‌టి చేసి అధికారంలోకి ర‌ప్పించే అవ‌కాశం వుంటుంది. కానీ ఇది రీల్ లైఫ్ కాదు, రియ‌ల్ లైఫ్ అనే సంగ‌తిని మ‌న యోగి పుంగ‌వుడు మ‌రిచిన‌ట్టున్నారు.

ది రియ‌ల్ యోగి అనే పుస్త‌కంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి ర‌చ‌యిత గ‌ణ ఏం రాశారో తెలియ‌దు కానీ, నిజంగా తానో అవ‌తార పురుషుడ‌నే భ్ర‌మ‌ల్లో ప‌వ‌న్ ఉన్న‌ట్టున్నారు. వ్యూహాల్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ త‌న పార్టీ శ్రేణుల‌కి పిలుపు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే అధినేత న‌డ‌వ‌డిక ద్వారా జ‌న‌సేన వ్యూహం ఏంటో ప‌సిగ‌ట్ట గ‌లిగిన జ్ఞానం శ్రేణుల‌కి వుంటుంది. జ‌న‌సేన శ్రేణుల బాధ‌ల్లా… టీడీపీ ప‌ల్ల‌కి మోయాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతారేమో అని. శ్రేణుల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌డుచుకోనిదే తాను అని ప‌వ‌న్ గ్ర‌హించ‌డం లేదు. అవున్లే…. ఆయ‌న యోగి క‌దా!

వ్యూహం పేరుతో జ‌న‌సేన శ్రేణుల్ని మోస‌గించొచ్చు. కానీ ఇత‌ర పార్టీల శ్రేణుల్ని, త‌ట‌స్థుల్ని వంచించ‌డం సాధ్యం కాద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. జ‌న‌సేన వ్యూహం అనేది కేవ‌లం త‌న‌కు, త‌న పార్టీ శ్రేణుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పే అంశం. నిజంగా రాష్ట్రంతో పాటు త‌న పార్టీ కోస‌మే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకేస్తున్నార‌ని పౌర స‌మాజం న‌మ్మాలి.

ఆ విశ్వాసం చూర‌గొన‌డంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు. రాష్ట్రానికి మంచి చేయ‌డం కోసమే ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ నిర్ణ‌యాలున్నాయ‌నే న‌మ్మ‌కాన్ని పొంద‌గ‌లిగిన‌ప్పుడు జ‌న‌సేన‌కు మంచిరోజులు వ‌చ్చిన‌ట్టు. ఎందుకంటే వ్యూహాలు నాయ‌కుల‌కే కాదు, ప్ర‌జ‌ల‌కు వుంటాయ‌నే వాస్త‌వాన్ని గ్ర‌హిస్తే… స‌ర్క‌స్ ఫీట్లు చేయ‌న‌వ‌సం వుండ‌దు. ఏపీ పొలిటిక‌ల్ యోగి గారు ఈ స‌త్యాన్ని తెలుసుకుంటే మంచిది.