చంద్రబాబునాయుడు, లోకేశ్, అచ్చెన్నాయుడు…ఇలా టీడీపీ నేతలందరికీ పులివెందుల అంటే అణుకు. బహుశా కలలో కూడా పులివెందుల, వైఎస్ కుటుంబాన్ని స్మరించుకునేలా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగాన కడప, పులివెందుల, రాయలసీమ సంస్కృతి అంటూ విషం చిమ్మడం టీడీపీ నేతలకు అలవాటుగా మారింది. తాజాగా పులివెందుల ఫ్యాక్షనిజం అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అవాకులు చెవాకులు పేలారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందులపై విషం కక్కారు. తాడేపల్లి నుంచి మారుమూల పల్లెల వరకూ పులివెందుల ఫ్యాక్షనిజం వైరస్‌లా సోకిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలపై వైసీపీ నాయకులు దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యక్రమాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించామని గుర్తు చేశారు.
టీడీపీ జెండా కట్టుకున్నాడని గోపాల్ అనే అతని ఆటోను తగులబెట్టడం దుర్మార్గమన్నారు. తెనాలిలో అన్న క్యాంటీన్‌ను వైసీపీ గూండాలు తగులబెట్టారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు మూసేసి పేదవాడి కడుపు కొట్టారని ఆయన ఆగ్రహించారు.
పులివెందులపై అచ్చెన్న వ్యాఖ్యలను రాయలసీమ వాసులు తప్పు పడుతున్నారు. రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాన్ని కించపరిచే విమర్శలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. పులివెందులలో ఫ్యాక్షన్ ఎక్కడుందో చూపాలని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చని, కానీ ఒక ప్రాంతంపై నెగెటివ్ ముద్ర వేస్తూ నిరాధార ఆరోపణలు చేయడం మంచిది కాదని సీమ సమాజం హితవు చెబుతోంది.
ఇలా తమపై సాంస్కృతిక దాడి చేయడంపై మనస్తాపానికి గురైన రాయలసీమ సమాజం గత ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పిందని సీమ మేధావులు, విద్యావంతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ విమర్శలకు పరిమితమై, ప్రాంతాల్ని కించపరిచే చర్యల్ని మానుకోవాలని సీమ సమాజం డిమాండ్ చేస్తోంది. టీడీపీ వైఖరిలో మార్పు రాకపోతే, శాశ్వతంగా రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని ఆ ప్రాంతం వార్నింగ్ ఇస్తోంది.