ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుబడితే ఏదైనా సాధిస్తారు. ప్రయత్న లోపం లేకుండా శక్తి వంచన లేకుండా ఆయన పని చేస్తారు. రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలిచితీరాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునే ఓడించి, ఆ పార్టీకి భవిష్యత్ లేకుండా చేయాలనేది వైఎస్ జగన్ ఆశయం. కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని వైసీపీ ఘోరంగా ఓడించింది. అలాంటప్పుడు చంద్రబాబును ఎందుకు ఓడించలేమనేది ఆయన ప్రశ్న.
ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యేలు, వైసీపీ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుడు, ఇన్‌చార్జ్‌లతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆయన ఆదేశించారు. మరోసారి తనతో పాటు అందరూ గెలవాలని కోరుకుంటున్నట్టు ఆయన మనసులో మాట చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా జగన్ టార్గెట్ ఎవరో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాకు చెప్పారు.
అనకాపల్లిలో మీడియాతో రోజా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ 175 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై టీడీపీ వ్యతిరేకంగా మాట్లాడిందన్నారు. ఇప్పుడు టీడీపీ యూటర్న్ తీసుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని గతంలో టీడీపీ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడేమో తాము కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని టీడీపీ మాట మార్చిందన్నారు.
కుప్పంలో చంద్రబాబు, టెక్కలిలో అచ్చెన్నాయుడు, మంగళగిరిలో నారా లోకేశ్‌లతో పాటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ ఓడించేందుకు జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆమె చెప్పారు. జగన్ టార్గెట్ ఎవరో ఆమె తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో లోకేశ్, పవన్‌కల్యాణ్‌లను పట్టు పట్టి మరీ ఓడించిన సంగతి తెలిసిందే. జగన్ టార్గెట్ చేస్తే… ప్రత్యేక యాక్షన్ ప్లాన్ వుంటుంది. రానున్న రోజుల్లో అది ఎలా వుంటుందో కాలమే జవాబు చెబుతుంది.