కర్నూలులో కోడిగుడ్ల కోసం కొట్టుకున్నారు. రెండు వర్గాలకు చెందిన మనుషులు ఒకరినొకరు నెత్తురు కారేలా కొట్టుకున్నారు. మీడియా పోలీసులను కూడా లెక్కచేయలేదు. వారిమీద కూడా దాడికి తెగబడ్డారు. ఈ రెండు వర్గాల వారూ అధికార వైకాపాకు చెందినవారే! పార్టీలోనే రెండు గ్రూపులు ఇలా రోడ్డున పడి కొట్టుకుంటూ ఉంటే నాయకులు ఏం చేస్తున్నారు? వినోదం చూస్తున్నారా? ఎటూ అధికారంలోకి వచ్చేశాం.. అయిదో ఏడాదిలో ఆ గ్రూపుల మధ్య సయోధ్య కుదిరిస్తే చాలు లెమ్మని అనుకుంటున్నారా?
ఇక్కడ ఓ సంగతి గుర్తించాల్సి ఉంది. ఇలా బజారు రౌడీల్లా కొట్టుకున్న వారు.. గల్లీస్థాయివారు.. ఆ మాత్రం స్థాయి కూడా లేనివారే కావచ్చు. కానీ.. వారి మీద వైకాపా పార్టీకి చెందిన వారనే ముద్ర ఉంది. అలాంటి ముద్ర ఉన్నప్పుడు వారు అతి చేయకుండా చూసుకోవడం వారికి నెక్ట్స్ లెవెల్ లో ఉండే నాయకుల బాధ్యత. ఆ స్థాయిలోని నాయకులు సంయమనం కోల్పోయి.. తమ అనుచరుల దుడుకుతనాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తుంటే గనుక.. అంతిమంగా పోయేది మాత్రం అధినేత పరువే.
మధ్యాహ్న భోజనానికి కోడిగుడ్లు సరఫరా చేయడం అనేది కాంట్రాక్టు. అందుకోసం అధికార పార్టీలోనే రెండు వర్గాలు ప్రయత్నించాయి. వారు కలెక్టరాఫీసు ప్రాంగణంలోనే రాళ్లతో కర్రలతో దాడిచేసుకుంటూ కొట్టుకునే దాకా వొచ్చారంటే దాని అర్థం.. అక్కడ నాయకత్వం చేతగానితనం మాత్రమే. రెండువర్గాల మధ్య సయోధ్య కుదిర్చలేకుండా.. ఆ నాయకత్వం ఏం చేస్తున్నదో అర్థంకాదు. ఒకే పార్టీలో ఉన్నంత మాత్రాన నాయకులంతా ఒకే మాటకు కట్టుబడి ఉండాలనే నిబంధనేమీ లేదు.
ఫక్తు వ్యాపారాలు మాత్రమే కాకుండా… పంతాలు కూడా పెద్దపాత్ర పోషించే ప్రాంతాల్లో ఈ ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వర్గ విభేదాల్ని చక్కబెట్టడంలోనే నాయకుల పరిణతి బయటపడుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొలి అవకాశం వచ్చింది. పాలన పరంగా ప్రజల్లో సుస్థిర అభిమానాన్ని నిర్మించుకునేందుకు జగన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పరువు దిగజార్చేలా ఇలా ముఠాలుగా రోడ్డున పడి కొట్టుకుంటూ ఉంటే… ఫలితం దక్కదు. పాలనతో పార్టీ మెట్లు ఎక్కుతూ ఉంటే.. ఇలాంటి కొట్లాటలతో కార్యకర్తలు కిందికి లాగేస్తున్నట్లుగా ఉంది.