సోము వీర్రాజు ఏ మహూర్తాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టారో కానీ.. రాష్ట్రంలో వరుస సంచలనాలు సృష్టిస్తున్నారు. వైరి పక్షాలకు ముఖ్యంగా టీడీపీకి ముచ్చెమటలు పోయిస్తున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ చేయలేని, చేయని పనులన్నిటినీ చేస్తూ తన మార్కు చూపెడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని కలిసి రాష్ట్ర రాజకీయాల్లో చర్చలేవనెత్తారు, అన్నయ్యని కలసిన మరుసటి రోజే తమ్ముడు పవన్ కల్యాణ్ ని కూడా కలసి మరింత సంచలనం రేపారు.
వాస్తవానికి చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు, కేవలం సినిమా షూటింగ్ ల వ్యవహారం కోసమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్దకు వచ్చారు. అలాంటి చిరంజీవిని కూడా ఇంటికెళ్లి మరీ కలిశాడంటే ఏదో భారీ స్కెచ్ వేశారనే అర్థమవుతోంది. తమ్ముడు పవన్ తో కలసి పార్టీలను మరింత బలోపేతం చేసుకోవాలని చిరంజీవి సూచించినట్టు చెప్పిన వీర్రాజు, మెగాస్టార్ ని మరోసారి రాజకీయ బరిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు పవన్ కల్యాణ్ ని కూడా పార్టీ ఆఫీస్ లో కలవడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది.
కాపు సామాజిక వర్గాన్ని ఒకచోట చేర్చే ప్రయత్నాల్లోనే వీర్రాజు మెగా బ్రదర్స్ తో వరుసగా సమావేశమయ్యారని తెలుస్తోంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ కి ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. కలసి మీటింగ్ లు పెట్టి, ఎవరికి వారే, యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. దీంతో జనసైనికులు కూడా క్షేత్ర స్థాయిలో బీజేపీతో కలవలేకపోయారు. ఎవరి నిరసనలు, ఎవరి ఆందోళనలు విడివిడిగానే చేసుకున్నారు. వీర్రాజు రాకతో అలాంటి పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది.
ఎలాంటి భేషజాలేవీ పెట్టుకోకుండా రెండు పార్టీల్ని కలుపుకొని వెళ్తున్నారు వీర్రాజు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని ఆయన సామాజిక వర్గాన్ని బీజేపీకి మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంటికెళ్లి మరీ మెగా బ్రదర్ ని కలవడంతో ఇటు జనసేన వర్గాల్లో కూడా సంతోషం నెలకొంది. ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసుకుని ఆయన దూకుడు చూపిస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం కాపు నాయకత్వం నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న దశలో మరోసారి ఆ సామాజిక వర్గంపై బీజేపీ దృష్టిసారించింది. అందులో భాగంగానే వీర్రాజు వరుస భేటీలు. భవిష్యత్తులో వీర్రాజు ఏం సాధిస్తారనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికిప్పుడు మాత్రం ఆయన జనసైనికుల అభిమానాన్ని సాధించారు.