విశాఖ భద్రత మరోమారు చర్చకు వస్తోంది. దానికి కారణం ఎక్కడో లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన భారీ పేలుళ్ళు, అంతకు మించి ఆస్థి ప్రాణనష్టం భారీ ఎత్తున జరగడం వంటివి. ప్రపంచాన్నే వణికించిన బీరూట్ పేలుళ్ళు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
విశాఖ కూడా పోర్టు సిటీ. బీరూట్ కి విశాఖకు ఇదొక పోలిక. అలాగే అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు జరిగే ఏకైక పోర్టు కూడా దేశంలో విశాఖే. మరో విషయం ఏంటంటే బీరుట్ లో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ రసాయనిక ప్రక్రియ కారణంగా పేలి భారీ ముప్పుని తెచ్చింది.
ఇపుడు విశాఖలో చూస్తే టన్నులకు టన్నులు దిగుమతి చేసుకుంటుంది. దానిని అనేక కంపెనీలకు ఇక్కడ నుంచే తరలిస్తుంది. మరి దాదాపుగా 300 కిలోమీటర్ల మేర ప్రదేశాలు బీరుట్ పేలుళ్ళ వల్ల దెబ్బ తింటే విశాఖలో అనుకోని ప్రమాదం జరిగితే నగరం సంగతేంటని మేధావుల ప్రశ్న.
పైగా ఇటీవల కాలంలో అనేక పరిశ్రమల్లో కూడా జరిగిన వరస ప్రమాదాలు ఒక వైపు ఉండనే ఉన్నాయి. దీంతో అంతా భయపడుతున్నారు. దానికి తోచినట్లుగా మళ్లీ విశాఖ సేఫ్ కాదన్న ప్రచారం అయితే సాగిపోతోంది. ఇక్కడ పాలనారాజధాని ఎలా పెడతారు అని మళ్ళీ వితండవాదం చేసేవారు ముందుకు వస్తున్నారు.
అయితే భారీ పేలుళ్ళు జరిగిన బీరుట్ కూడా లెబనాన్ రాజధాని అన్న సంగతి మరచిపోతున్నారు. మరో వైపు విశాఖలో కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఇక్కడ ఈ అమ్మోనియం నైట్రేట్ దిగుమతులన్నీ కూడా తూర్పు నావికాదళం కనుసన్నలో జరుగుతాయి. ఉగ్ర ముప్పు కూడా లేదు. తక్కువలలో తక్కువ 35 రోజుల కంటే కూడా నిల్వ చేసేందుకు కూడా వీలు లేని కఠిన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు.
మొత్తం మీద చూసుకుంటే విశాఖ సేఫ్ జోన్. డోంట్ వర్రీ అంటున్నారు. కానీ విశాఖ యోగ్యం కాదు, రాజధానికి పనికిరాదు అనేవాళ్ళు మాత్రం యాగీ మొదలెడుతున్నారు. కానీ వారు మరో విషయం మరచిపోతున్నారు. విశాఖలోదాదాపుగా పాతిక లక్షల మంది జనం కూడా ఉన్నారు. ఒకవేళ వారు ఊహించిందే అయితే ఈ జనాభా సంగతేంటి. అంటే జనం అక్కరలేదు, రాజకీయమే కావాలా.