సున్నా మార్కులకే ఉద్యోగం.. అంతలా ఆశ్చర్యపోవద్దు!

సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారింది. ప్రత్యేకించి ఓసీ కేటగిరి వాళ్లు దాన్ని తెగ షేర్ చేస్తూ ఉన్నారు. సున్నా మార్కులకే వార్డు వాలంటరీ ఉద్యోగాలను ఇవ్వాలని ఒకచోట కలెక్టర్ ఆదేశాలు ఇచ్చాడనేది…

సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారింది. ప్రత్యేకించి ఓసీ కేటగిరి వాళ్లు దాన్ని తెగ షేర్ చేస్తూ ఉన్నారు. సున్నా మార్కులకే వార్డు వాలంటరీ ఉద్యోగాలను ఇవ్వాలని ఒకచోట కలెక్టర్ ఆదేశాలు ఇచ్చాడనేది ఆ వార్త  సారాంశం. ఆ వార్తను పట్టుకుని కొంతమంది తెగ ఇదైపోతున్నారు. ఇదే భారతదేశం వెనుకబాటుకు కారణమని తెగవాపోతూ ఉన్నారు.

అయితే ఈ మిడిమిడి జ్ఞానం మేళాలకు జ్ఞానబోధ చేయలేం కానీ, దేశంలో అది కొత్తా కాదు, మొదటిదీ కాదనే ప్రాథమిక విషయం తెలియని వారు ఇప్పుడు తెగ ఇదైపోతూ ఉన్నారు. అది వార్డు వాలంటీర్ ఉద్యోగం. చాలామంది అప్పర్ క్యాస్ట్ కుర్రాళ్లు, అమ్మాయిలు ఆ ఉద్యోగం చేయడానికి ముందుకు రావడంలేదు కూడా. ఇక రెండో విషయంలో ప్రతి వ్యవహారంలాగే అందులోనూ రిజర్వేషన్లున్నాయి.

ఆ పోస్టులను వేరే వాళ్లతో భర్తీ చేయడానికి వీల్లేదు. దీంతో కలెక్టర్ ఎవరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటే వారికి ఉద్యోగం ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఆయన రాజ్యాంగబద్ధంగానే ఆదేశాలు ఇచ్చారు. ఇక కొంతమంది చదువు'కొన్న' మేధావులు కూడా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్లు అన్నీ తెలిసి మాట్లాడరు. కొన్నే తెలిసి మాట్లాడతారు. మన ఉద్యోగాల పరీక్షల విషంలో బ్యాక్ లాగ్ పోస్టులంటూ కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అలాంటి వాటిని భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు మార్కులతో నిమిత్తం లేకుండా రిజర్వేషన్లకు అనుకూలంగా భర్తీ చేస్తూ ఉంటారు.

అలాగే గతంలో ఎంసెట్ లో మైనస్ మార్కుల సిస్టమ్ ఉండేది. అలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ సీట్లు భర్తీ కాని సందర్భాల్లో.. మైనస్ మార్కులు వచ్చిన వారికి కూడా సీట్లు లభించాయి! అలాంటి వారు ఇంజనీరింగ్ చదివారా లేదా, చదివాకా వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయా, పోటీ ప్రపంచంలో తట్టుకున్నారా.. లేదా అనేది ఎవరూ ఆలోచించరు. వార్డు వాలంటీర్ ఏమీ బిల్డింగులు కట్టడు. రాతపని, మోతపని. ఆ విషయంలో సున్నా  మార్కులు అంటూ కొంత మంది అక్కసు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారు వాళ్ల వాళ్ల ఊర్లలో అదే పని చేయడానికి రెడీగా ఉన్నారా?

ఇక్కడే మరో ఉదాహరణను ప్రస్తావించుకోవాలి. ఇలాంటి అవకాశాలు ఓసీలు, అప్పర్ క్యాస్ట్ వాళ్లు కూడా ఒకసారి భారీగా పొందారు. దాదాపు పదేళ్ల కిందట ఎలిమెంటరీ స్కూల్ టీచర్ల భర్తీలో ఒక విచిత్రం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఒక రూల్ తీసుకువచ్చింది. ప్రాథమిక విద్యాలయ్యాల్లో.. అంటే ఎలిమెంటరీ స్కూల్స్ లో టీచర్ పోస్టులను టీటీసీ వారితోనే భర్తీ చేయాలని, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ టీచర్ పోస్టులను బీఎడ్ వాళ్లతో భర్తీ చేయాలని నిర్ణయించింది. డీఎస్సీ నిర్వహించాకా ఆ నిర్ణయం తీసుకున్నారు!

దీంతో ప్రైమరీ స్కూల్స్ పోస్టులకు అర్హుల కొరత ఏర్పడింది! బీఎడ్ వాళ్ల నుంచి పోటీ లేకపోవడంతో టీటీసీ ఉండి, డీఎస్సీని అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ అప్పుడు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచినే టీటీసీకి చాలా క్రేజ్ పెరిగింది. అలా ఉద్యోగాలు పొందిన వారిలో ఓసీలున్నారు, బీసీలున్నారు, ఎస్సీలున్నారు.

వాళ్లలో చాలామంది డీఎస్సీ మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హతే సాధించలేదు. అటెంప్ట్ చేశారు కాబట్టి ఉద్యోగం పొందారు. అలా ఉద్యోగం పొందినవారు ప్రతి ఒక్కరి ఎరుకలోనూ ఉండనే ఉంటారు. అలాంటివి మనకు తప్పు అనిపించవు. ఇప్పుడు సున్నా మార్కులుకు ఎవరో వార్డు వాలంటీర్ పోస్టు వచ్చిందని.. సోషల్ మీడియా మొత్తం భగ్గుమంటోంది! మిడిమిడి జ్ఞానం.. అర్థంలేని అక్కసులు సోషల్ మీడియా వచ్చాకా బాగా వెల్లగక్కడానికి చాలా అవకాశం ఏర్పడింది. దాని ఫలితాలే ఇవన్నీ.

నీ తెలుగు కంటే నేనే మేలు.. హాట్ యాంకర్ డైరెక్టర్ చిట్ చాట్