మీడియా వివిధ రూపాల్లో విపరీతంగా పెరిగిపోయాక సెలబ్రిటీలకు, ప్రధానంగా రాజకీయ నాయకులకు ప్రచారయావ బాగా పెరిగిపోయింది. తాము ఏ పని చేసినా టీవీల్లో, పత్రికల్లో రావాలి అనే కోరిక ఎక్కువైంది. ప్రచార యావకు స్థాయితో పని లేదు.
సాధారణంగా రాజకీయ నాయకులంటేనే ప్రచార కండూతి ఉంటుంది. ఇక అధికార పదవుల్లో ఉండేవారి సంగతి చెప్పక్కరలేదు. ఇక సెల్ ఫోన్లు వచ్చాక ఫోటోల పిచ్చి విపరీతంగా పెరిగింది. ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడ్డ వారికి సాయం చేయకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ప్రచార పిచ్చి, ఫోటోల పిచ్చి ఇంతలా వెర్రి తలలు వేస్తోంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఆస్పత్రిలో ఉన్నారు. ఆయనకు డెంగ్యూ సోకింది. ఎవరైనా ఆస్పత్రిలో ఉంటే పరామర్శించడం సహజం. అది కనీస బాధ్యత. ఇక మాజీ ప్రధాని ఆస్పత్రిలో ఉంటే పరామర్శించకుండా ఉంటారా ? కానీ అది కూడా ప్రచారాంశంగా వాడుకుంటే ఏమనుకోవాలి ?
ఇలాగే చేశాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ. ఆయన మీద మన్మోహన్ కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారు. మన్సుఖ్ మాండవియా పరామర్శకు వెళ్లిన సందర్భంలో ఫోటోలు తీయించుకోవడంపై మన్మోహన్ సింగ్ కూతురు డామన్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంత్రితో పాటు ఫోటోగ్రాఫర్ గదిలోకి ప్రవేశించడంపై తన తల్లి చాలా కలత చెందుతున్నారని డామన్ అన్నారు. ఫోటోగ్రాఫర్ గదిలోకి వచ్చినప్పుడు కనీసం ఆమె పరిస్థితి ఏమిటో కూడా వారు పట్టించుకోలేదని విమర్శించారు. ఆమెను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారని డామన్ సింగ్ ఆరోపించారు.
వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని,.. ఫోటోలు తీసుకుని వెళ్లడానికి వారేమీ జూ లో జంతువులు కాదని డామన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఫోటోలు తీసుకోవద్దని చెప్పినప్పటికీ.. వారు వినకుండా తమ పని తాము చేసుకుపోయారని ఆమె తీవ్రంగా విమర్శించారు.
తన తండ్రి మన్మోహన్ సింగ్ ని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పరామర్శించడం .. త్వరగా కోలుకోవాలని కోరుకోవడం ఆనందంగా ఉందని.. అయితే అదే సమయంలో ఆయన ఫోటోలు తీయడం మాత్రం సమర్థనీయం కాదని చెప్పారు. మాండవీయ ఆ ఫోటోలు తీసుకొని దాచుకోరు కదా. వెంటనే మీడియాకు అందజేస్తారు. అంటే బీజేపీ మంత్రి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కాంగ్రెస్ కు చెందిన మాజీ ప్రధానిని పరామర్శించారని మీడియాలో వస్తుంది. అదే కావాల్సింది.