“మా” ప్రమాణీ స్వీకారోత్సవం సాక్షిగా మెగా కుటుంబాన్ని మంచు ఫ్యామిలీ దెబ్బకొట్టిందా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. అదును చూసి మెగా ఫ్యామిలీకి వాత పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా “మా” నూతన పాలక మండలి కొలువుదీరింది. ప్రమాణ స్వీకారానికి అగ్రహీరో బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులను మంచు విష్ణు స్వయగా ఆహ్వానించారు. కానీ మెగా కుటుంబానికి ఆహ్వానం లేకపోవడంపై టాలీవుడ్ ఆశ్చర్య పోతోంది.
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌లను ఉద్దేశ పూర్వకంగా ఆహ్వానించకపోవడంపై మెగా హీరోల అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. తమ హీరోలను అవమానించాలనే దురుద్దేశంతోనే మంచు ఫ్యామిలీ కుట్రపూరితంగా వ్యవహరించిందని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు.
అందర్నీ కలుపుకుని పోవడం అంటే ఇదేనా? అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా నడుచుకోవాల్సిన మంచు విష్ణు నేతృత్వంలోని నూతన పాలకమండలి కావాలనే విభజించు పాలించు అనే బ్రిటీష్ విధానాల్ని ఒంటబట్టించుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తనకు పెద్దలంటే ఎంతో గౌరవ మర్యాదలని, చిరంజీవిని త్వరలో కలుస్తానని మంచు విష్ణు అన్న మాటల్ని గుర్తు చేస్తున్నారు. బాలకృష్ణతో పాటు కోట శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులను ఆహ్వానించడానికి ఉన్న సమయం, మెగా హీరోలను పలకరించడానికి లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
కనీసం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు కూడా మనసు రాలేదా? ఇదేనా పెద్దల్ని గౌరవించడం అంటే అనే నిలదీతలు వస్తున్నాయి. మంచు విష్ణు ప్యానల్ వైఖరి చూస్తుంటే, మున్ముందు ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌తో పాటు దానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కర్నీ దూరం పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కొలువుదీరిన వేడుక నుంచే సంకేతాలు పంపారని చెబుతున్నారు.